Home అంతర్జాతీయ వార్తలు పాక్‌లో గూడ్స్‌ను ఢీకొన్న రైలు

పాక్‌లో గూడ్స్‌ను ఢీకొన్న రైలు

Train-Accident

16 మంది దుర్మరణం
 58 మందికి గాయాలు
 తప్పుడు సిగ్నల్‌తో లూప్‌లైన్‌లోకి
 క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమం

రావల్పిండి : పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. 58 మంది గాయపడ్డారు. ఈ సంఘటన సదీఖాబాద్‌లోని వల్హార్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. గురువారం తెల్లవారుజామున అక్బర్ ఎక్స్‌ప్రెస్ అక్కడ నిలిపి ఉన్న గూడ్స్ రైలును ఢీకొన్న ఘటన విషాదాంతాన్ని మిగిల్చింది. రైలు వేగంగా ఢీకొనడంతో ఇంజిన్ ఆరు బోగీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైలు తప్పుడు మార్గంలో వెళ్లడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. అక్బర్ ఎక్స్‌ప్రెస్‌కు అందిన తప్పుడు సిగ్నల్స్‌తో అది సరుకు రవాణా రైలు ఉన్న మార్గంలోకి దూసుకువెళ్లిందని వెల్లడైంది. ప్రమాదానికి గురయిన రైలు రావల్పిండి నుంచి క్వెట్టాకు వెళ్లుతోంది. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నారు. గాయపడ్డ వారిని సదిఖాబాద్ ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. అయితే పరిస్థితి మరీ విషమంగా ఉన్న 12 మందిని ఇక్కడి రహీం యార్ ఖాన్ ప్రాంతంలోని షేక్ జాయెద్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ అత్యయిక స్థితిని విధించి, భారీ స్థాయిలో చికిత్సకు ఏర్పాట్లు చేపట్టారు.

బోగీలు పూర్తిగా దెబ్బతినడంతో వాటి శిథిలాల కింద మృతదేహాలను, గాయపడ్డ వారిని వెలికితీయడం కష్టం అయింది. తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో రైళ్లు ఢీకొన్న ఘటన జరిగింది. ఇతర నగరాల నుంచి హైడ్రో కట్టింగ్ యంత్రాలను రప్పించి వెలికితీత కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది. దీనితో మధ్యాహ్నం వరకూ ఎంత మంది మృతి చెందారనేది వెల్లడి కాలేదు. మానవ తప్పిదంతోనే ప్రమాదం జరిగిందని ఫెడరల్ రైల్వే మంత్రి షేక్ రషీద్ టీవీలో ప్రసంగిస్తూ చెప్పారు. దర్యాప్తు చేపట్టారని, సరైన సిగ్నల్ ఇవ్వడంలో విఫలంఅయినందున సంబంధిత స్టేషన్ మాస్టర్‌దే బాధ్యత అని తేలుతున్నట్లు వెల్లడించారు. సదరు అధికారిపై చట్టపరంగా, చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఎక్స్‌ప్రెస్ కావడంతో వేగంగా వెళ్లుతున్న రైలు డ్రైవర్ కొద్ది దూరంలోని గూడ్స్ రైలును గమనించినా వెంటనే బ్రేక్‌లు వేయడానికి వీల్లేకుండా పోయింది. ఈ ప్రాంతంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. తప్పుడు సిగ్నల్‌తో ఎక్స్‌ప్రెస్ రైలు లూప్‌లైన్‌లోకి వెళ్లడం, సాధారణంగా అక్కడ గూడ్స్ ఇతర రైళ్లు నిలిపి ఉంచడంతో ప్రమాదం జరిగింది.

కార్గో రైలులోకి ఎక్స్‌ప్రెస్ కొంత భాగం చొచ్చుకు పోయింది.మృతులలో ఒక మహిళ ఉన్నట్లు, గాయపడ్డ వారిలో 11 మంది పిల్లలు, తొమ్మండుగురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆదుకోవాలని ఆదేశించారు. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని రైల్వే మంత్రికి, రైల్వేల ఉన్నతాధికారులకు సూచించారు.

16 Killed and 80 Injured After Two Trains Collide in Pakistan