Home తాజా వార్తలు రాష్ట్రంలో మరి 169 కరోనా కేసులు

రాష్ట్రంలో మరి 169 కరోనా కేసులు

169 more COVID-19 cases in Telangana

 

జిహెచ్‌ఎంసి పరిధిలో 82 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 64 మందికి, వలస కూలీలు ఐదుగురికి
రంగారెడ్డి 14, మెదక్, సంగారెడ్డిలో చెరి ఇద్దరికి, మరి నలుగురి మృతి,
మొత్తం 71 మంది మృతులు
చికిత్స పొందుతున్న వారు 973
1381 మంది డిశ్చార్జ్

కొత్తగా 169 కేసులు నమోదు
2425కి చేరిన కరోనా పాజిటివ్‌ల సంఖ్య

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కొత్తగా 169 కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. శుక్రవారం నమోదైన కేసుల్లో జిహెచ్‌ఎంసిలో 82 మంది, రంగారెడ్డిలో 14, మెదక్ 2, సంగారెడ్డిలో మరో ఇద్దరు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ను విడుదల చేసింది. అదే విధంగా ఐదుగురు వలస కార్మికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి విమాన మార్గంలో వచ్చిన మరో 64 మందికి వైరస్ నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొన్నారు.

దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2425కు చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య1381పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 973 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు వైరస్ దాడిలో 71 మంది చనిపోయినట్లు వైద్యాశాఖ అధికారిక లెక్కలను వెల్లడించింది. అయితే గత మూడు రోజులుగా సగటున వందకు తగ్గకుండా కేసులు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తుంది.

వైరస్ దాడిలో మరో నలుగురు మృతి
కరోనా వైరస్ దాడిలో శుక్రవారం మరో నలుగురు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. కార్సినోమా థైరాయిడ్‌తో బాధపడుతున్న 53 ఏళ్ల వ్యక్తికి ఇటీవల కరోనా సోకింది. దాదాపు 7 రోజుల పాటు చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వివిధ రకాల ఆరోగ్యసమస్యలు ఉన్న 59 ఏళ్ల మరో వ్యక్తికి వైరస్ సోకగా ఆసుపత్రిలో చేర్చారు. మూడు రోజుల పాటు వైద్యం అందించిన ఫలితం దక్కలేదని అధికారులు పేర్కొన్నారు. హెమిప్లేగియా జబ్బుతో బాధపడుతున్న 62 ఏళ్ల వృద్ధుడికి వైరస్ సోకగా ఆసుపత్రిలో అడ్మిట్ చేసి 13 రోజులు పాటు వైద్యం అందించారు. కానీ వైరస్ దాడికి అతను మృతి చెందినట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు.

దీంతో పాటు హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న 60 ఏళ్ల వృద్ధ మహిళకు ఇటీవల వైరస్ సోకింది. ఈమె కూడా ఐదురోజుల పాటు చికిత్స పొంది వైరస్ దాడిలో మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తూ స్వరాష్ట్రానికి వచ్చిన వారిలో 180 మంది కార్మికులకు వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. అదే విధంగా విమాన మార్గాల నుంచి వచ్చి ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లలో ఉన్న 458 మందిలో ఇప్పటి వరకు 207 మందికి వైరస్ తేలగా, 30మంది విదేశీయులూ కోవిడ్ బారిన పడినట్లు అధికారులు స్పష్టం చేశారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఐదుగురికి వైరస్
మహేశ్వరం మండలంలో శుక్రవారం ఐదు మందికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. హర్షగూడ గ్రామానికి చెందిన టి సక్కుబాయి(50), ఆమె కూతురు నందిని(25), అల్లుడు ఎస్. జానకిరాములు(28), గౌని అక్షర(8), ఎస్ వినోద్(20)లకు పాజిటివ్ వచ్చినట్లు ఆర్డీఓ రవీందర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని జియాగూడ, పహాడిషరీఫ్‌లతో పాటు హర్షగూడలో జరిగిన విందు కార్యక్రమాల్లో వీరు పాల్గొనడం వలనే వైరస్ సోకిందని అధికారులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి కరోనా కట్టడికి కృషి చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. చేగుంట మండల కేంద్రానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి అనారోగ్య సమస్యతో హైదరాబాద్ మెడికోర్ ఆసుపత్రిలో చేరగా, అతనికి గుండె సమస్యలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు సర్జరీ చేశారు.

అయితే కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో టెస్టు చేయగా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా సిద్ధిపేట్ జిల్లా కొండాపాకలో 4 సంవత్సరాల బాలుడికి కరోనా వచ్చింది. నాలుగు రోజుల చికిత్స అనంతరం బాలుడిలో వైరస్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు శాంపిల్ తీసి గాంధీ ఆసుపత్రికి పంపించి టెస్టులు చేశారు. దీంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. తర్వాత ఆ బాలుడి కుటుంబ సభ్యులతో పాటు అతనితో సన్నిహితంగా మెలిగిన మొత్తం 45 మందిని హోం క్వారంటైన్ చేసినట్లు అధికారులు సూచించారు.

ఖమ్మం జిల్లాలో తొలి కరోనా మృతి సంభవించింది. మధిర పట్టణానికి చెందిన చెప్పుల వ్యాపారి శుక్రవారం హైదరాబాద్ గాంధి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. గత మూడు నెలలుగా బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 65 ఏళ్ల వృద్దుడు హైదరాబాద్‌లోని వివిధ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే బుధవారం అతనికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో గాంధి ఆస్పత్రికి తరలించారు. క్సాన్సర్‌తో పాటు ఇతర సమస్యలు ఉండటం వలన ఆ వృద్ధుడు చనిపోయినట్లు జిల్లా వైద్యాధికారులు పేర్కొన్నారు.

169 more COVID-19 cases in Telangana