Home అంతర్జాతీయ వార్తలు ఇరాన్ చెరలో 18 మంది భారత నావికులు

ఇరాన్ చెరలో 18 మంది భారత నావికులు

Iranగల్ఫ్ జలాల్లో చమురు ట్యాంకర్ ఆక్రమణ

లండన్ : గల్ఫ్ జలాల్లో 18 మంది భారతీయ నావికులతో కూడిన ఆయిల్ ట్యాంకర్‌ను ఇరాన్ తమ స్వాధీనంలోకి తీసుకుంది. ఈ ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ వారు ఈ చర్యకు దిగారు. ప్రస్తుతం గల్ఫ్ జలాల్లో ఇరాన్‌కు అమెరికా, మిత్రదేశాలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. బ్రిటన్ పతాకంతో హోర్మూజ్ సింధుశాఖలో వెళ్లుతున్న చమురు ట్యాంకర్‌లో మొత్తం 23 మంది ఉండగా వీరిలో 18 మంది భారతీయులే ఉన్నారని వెల్లడైంది. స్టెనా ఇంపెరో చమురు నౌకను శుక్రవారం గార్డ్ అడ్డగించి , దారిమళ్లించారు. ఇరాన్‌కు చెందిన జాలర్ల మరపడవతో ఈ ట్యాంకర్ ఢీకొన్నందునే దీనిని స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లు ఇరాన్ వార్తా సంస్థ ఇర్నా తెలిపింది.

ఆయిల్ ట్యాంకర్ నౌక స్వీడన్‌కు చెందిన స్టెనా బల్క్ అనే కంపెనీది. గల్ఫ్ ప్రాంతంలో అత్యంత కీలకమైన జలమార్గంలో ఇరాన్ అధీనంలోకి వెళ్లిన ఈ నౌక సిబ్బందిలోని వారితో ప్రస్తుతం తాము మాట్లాడలేకపోతున్నట్లు కంపెనీ వారు తెలిపారు. ట్యాంకర్‌లో రష్యా, ఫిలిపైన్స్, లాటివియా ఇతర దేశాలకు చెందిన వారు ఐదుగురు నౌకా సిబ్బందిగా ఉన్నారు. మిగిలిన 18 మంది భారతీయలని వెల్లడైంది. క్యెప్టెన్ భారతీయుడు అని, ఇంగ్లాండ్ పతాకంతో నౌక వెళ్లుతోందని తెలిపారు. సముద్ర జలాల అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తూనే చమురు ట్యాంకర్ వెళ్లిందని, అయితే ఉన్నట్లుండి గుర్తు తెలియని నౌకతళ విమానం, ఒక హెలికాప్టర్ ఈ చము రు ట్యాంకర్ పై చక్కర్లు కొట్టడం, తరువాత ఈ ట్కాంకర్ దిశ మార్చుకుని వెళ్లిందని కంపెనీ కార్యనిర్వాహక అధికారి ఎరిక్ హనెల్ తెలిపారు. సిబ్బందికి ఎటువంటి గాయాలు లేవని, వారి భద్రత తమకు కీలకం అని స్పష్టం చేశారు. ఈ కంపెనీ వారు జరిగిన ఘటనపై బ్రిటన్, స్విట్జర్లాండ్ ప్రభుత్వాధికారులతో మాట్లాడుతున్నారు. సమస్య పరిష్కారానికి యత్నిస్తున్నారు.

సిబ్బంది కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉ న్నామని వివరించారు. ఇటీవలి కాలంలో గల్ఫ్ జలాల్లో ట్యాంకర్లపై ఆధిపత్యానికి పలు దేశాలు యత్నిస్తూ వస్తున్నాయి. దీనితో ఉద్రిక్తత నెలకొంటోంది. ఈ నెల ఆరంభంలోనే బ్రిటిష్ నౌకాదళం, గిబ్రట్లర్ పోలీసులు సంయుక్తంగా ఒక ఇరాన్ ట్యాంకర్‌ను స్వాధీనంలోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ నౌకలో సిరియాకు ముడిచమురు తరలిస్తున్నారని, అందుకే ఈ చర్యకు దిగామని అప్పుడు గిబ్రట్లర్ పోలీసు వర్గాలు వివరణ ఇచ్చుకున్నాయి. ఈ ప్రాంతంలోనే ఒమన్‌కు చెందిన చమురు నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనపై ఇరాన్, అమెరికాలు పరస్పర ఆరోపణలకు దిగాయి.

ఇరాన్‌తో సంప్రదింపులు : ఇండియా

ఒక్కరోజు క్రితం ఇరాన్ ఈ ట్యాంకర్‌ను దారిమళ్లించినట్లు తెలిసిందని, వెంటనే ఇరాన్ అధికారులతో మాట్లాడుతున్నామని భారత విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుక యత్నిస్తున్నట్లు , భారతీయ సిబ్బంది విడుదలకు అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు వివరించారు. సత్వరమే వారిని విడిపించి, స్వదేశం తిరిగి రప్పించేందుకు అధికారికంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

18 Indian sailors in captivity in Iran