Home జాతీయ వార్తలు అన్నింటికీ 18% అసంబద్ధం

అన్నింటికీ 18% అసంబద్ధం

జిఎస్‌టిలో ఏకీకృత పన్ను అమలు ప్రసక్తే లేదు
బెంజ్ కారును, పాల ప్యాకెట్‌ను ఒకే గాటన కట్టలేము
ఏడాదిలోనే వస్తు సేవల పన్నుతో అద్భుత ఫలితాలు
పరోక్ష పన్నుల చెల్లింపు 70% పెరిగింది : ప్రధాని

Modi

న్యూఢిల్లీ : మెర్సిడెస్ బెంజ్ కారును, పాల ప్యాకెట్‌ను ఒకే గాటన కట్టలేమని, వాటికి ఒకే పన్ను వేయలేమని ప్రధానంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలో ఏకీకృత పన్నుల విధా నం అమలు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అన్నింటిని 18 శాతం పన్ను పరిధిలోకి తేవడం అనుచితమన్నారు. ఆదివారం ప్రధాని మోడీ స్వరా జ్య మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో జిఎస్‌టి ఏడాది పూర్తి సందర్భంగా సంబంధిత అంశాలను ప్రస్తావించారు. విలాసవంతమైన కార్లు వేరు.. నిత్యావసర పాలు ఇతర సరుకులు వేరని, రెండింటికి పొంతన లేదని, ఇక వీటికి ఒకే పన్ను విధింపు ఏ విధంగా సాధ్యం అవుతుంద ని ప్రశ్నించారు. అన్నింటినీ ఒకే పన్ను పరిధిలోకి తీసుకుని రావాలనే కాంగ్రెస్ పార్టీ వాదనను ప్రధాని తప్పుబట్టారు. వారి మాట మన్నిస్తే చివరికి దేశంలో ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులపై పన్నులు తడిసి మోపెడవుతాయని ప్రధాని తెలిపారు. ఇది ప్రజానీకానికి భారం గా మారుతుందన్నారు. జిఎస్‌టి ఒక అపూర్వ ప్రయోగం, ప్రవేశపెట్టిన ఏడాది కాలంలోనే దీని వల్ల అనేక సత్ఫలితాలు దక్కాయని వివరించారు. పరోక్ష పన్నుల చెల్లింపుల స్థాయిలో 70 శాతం పెరుగుదల కనపించింది. నిఘా కేంద్రాల వ్యవస్థకు మంగళం పాడినట్లయింది. వివిధ స్థాయిలలోని 17 పన్నులు , 23 సెస్సులను మిళితం చేసి సింగిల్ టాక్స్‌కు మళ్లించినట్లు వివరించారు. కేంద్రం పలు కసరత్తుల తరువాత జిఎస్‌టి వ్యవస్థను ఏర్పాటు చేసిందని, ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుల వంటి కేంద్రం లెవీలను, రాష్ట్రాల పన్నుల పరిధిలోని వాట్‌ను కలిపి జిఎస్‌టిగా రూపొందించడం జరిగిందని ప్రధాని తెలిపారు. పరోక్ష పన్నుల విధానాన్ని సరళీకృతం చేయడమే జిఎస్‌టి ఉద్ధేశం అని తేల్చిచెప్పారు. పన్నుల వ్యవస్థలో ఇబ్బందికరంగా తయారయిన బెదిరింపుల ఇన్‌స్పెక్టర్ రాజ్ సంవిధానానికి ఇప్పుడు చెల్లుచీటి పాడినట్లు అయిందని ప్రధాని వెల్లడించారు.
అందరి సలహాల మేరకే: కేంద్రం ఏకపక్షంగా జిఎస్‌టిని తీసుకురాలేదని, అన్ని రాష్ట్రాల నుంచి తగు విధంగా సమాచారం తీసుకుని , వ్యాపారులు ఇతర భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలను తెలుసుకుని దీనిని ఖరారు చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ మిత్రులు తరచూ ఒకే జిఎస్‌టి రేటు తీసుకువస్తామని చెపుతున్నారని , వారు చెపుతున్నదానిని బట్టి చూస్తే ఆహారపదార్థాలు, వస్తువులపై ఒకే పన్ను వేయాల్సి వస్తుందని విశ్లేషించారు. బెంజ్‌లు , పాలు ప్యాకెట్లు, ఉప్పు ప్యాకెట్లను ఒకే గూట్లో చేరుస్తారా? అని నిలదీశారు. జిఎస్‌టి ప్రారంభం తరువాత దేశంలో కొత్తగా 48 లక్షల కొత్త సంస్థలు పన్నుల పరిధిలో స్వచ్ఛందంగా చేరాయని, స్వాతంత్య్ర భారత చరిత్రలో ఇది అరుదైన ఘట్టం అని ప్రధాని తమ ముప్పావు గంట ఇంటర్వూలో తెలిపారు. జిఎస్‌టి రాకతో చెక్‌పోస్టుల ఎత్తివేతకు వీలేర్పడిందని, రాష్ట్రాల సరిహద్దుల మధ్య చెక్‌పోస్టుల బాదరబందీ లేకపోవడంతో ట్రక్కు డ్రైవర్లకు విలువైన సమయం ఆదా అవుతోందని చెప్పారు. అంతేకాకుండా ఆయువుపట్టు వంటి రవాణా రంగం లాభపడుతోంది, ఈ విధంగా దేశ ఉత్పత్తి వేగవంతానికి దోహదం చేస్తోందని తెలిపారు.
జిఎస్‌టి సంక్లిష్టంగా ఉంటే ఇదంతా సాధ్యం అవుతుందా? అని ప్రధాని ప్రశ్నించారు. జిఎస్‌టి అమలుపై వస్తున్న విమర్శలపై ప్రధాని స్పందించారు. కొత్త పన్నుల వ్యవస్థ విస్తృత పరిణామం అని, అతి పెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక పూర్తి స్థాయి ప్రక్షాళన అని, ఈ దశలో అమలులో కొన్ని ఇబ్బందులు ఉండనే ఉంటాయని తెలిపారు. ఇంతకు ముందు దేశంలో పలు పన్నులు తెలియకుండానే నెత్తిన భారం మోపేవని, అయితే ఇప్పుడు జిఎస్‌టిలో ఈ బెడద లేదని, మీరు ఏదైతే గమనిస్తున్నారో దానికే విలువ కట్టి ధరను చెల్లిస్తున్నారని తెలిపారు. పలు నిత్యావసర సరుకులపై ప్రభుత్వం పన్నులు తగ్గించిందని , దీనితో ధరలు తగ్గాయని చెప్పారు. బియ్యం కానివ్వండి, గోధుమలు, చక్కెర , మసాలా దినుసులు వంటివాటి ధరలను అప్పటికీ ఇప్పటికీ వ్యత్యాసాలతో పోల్చుకోవచ్చునని సూచించారు. పలు రోజువారి సరుకులపై పన్నుల మినహాయింపు ఉంది. లేదా వాటిని 5 శాతం స్లాబ్‌లో చేర్చడం జరిగిందని , ఇక ఏకంగా 95 శాతం వస్తువులు 18 శాతం కన్నా తక్కువ శ్లాబ్‌లోకి వెళ్లాయని ప్రధాని వివరించారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం అంతకు మించి ఐటి సాయంతో పన్నుల వ్యవస్థను ఇన్‌స్పెక్టర్ రాజ్‌నుంచి విముక్తం చేసేందుకు ఇది కీలక అడుగు అని ప్రధాని స్పష్టం చేశారు. ఇక పన్నుల వ్యవస్థలో రిటర్న్‌ల నుంచి రిఫండ్ వరకూ అంతా ఆన్‌లైన్ వ్యవహారం కాబట్టి ఆఫ్‌లైన్‌లో వ్యవహారాలకు వీల్లేదని చమత్కరించారు. ఒక క్లిక్‌తో అంతా పారదర్శకంగా ఉంటుందని తెలిపారు.
సింగపూర్ ఇండియా కాదు రాహుల్ బాబూ ః జైట్లీ
న్యూఢిల్లీ ః జిఎస్‌టిలో సింగిల్ శ్లాబు విధానం భారత్ వంటి దేశాలలో కుదరదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ సింగిల్ శ్లాబ్ విధానం మేలని చెప్పడంపై జైట్లీ మండిపడ్డారు. ఇది వితండ వాదన అన్నారు. సింగిల్ శ్లాబ్ విధానం కేవలం ప్రజలంతా ఒకే విధమైన వ్యయ సామర్థం ఉన్న దేశాలలోనే వీలవుతుందని జైట్లీ తేల్చిచెప్పారు. జిఎస్‌టి ప్రవేశపెట్టి ఏడాది అవుతున్న సందర్భంగా జైట్లీ ది జిఎస్‌టి ఎక్స్‌పీరియన్స్ పేరిట ఒక వ్యాసం వెలువరించారు.
వ్యవస్థలో కొన్ని లొసుగులు ఉండొచ్చు అని, పన్నుల వ్యవస్థల హేతుబద్ధీకరణ అంశాన్ని సంబంధిత జిఎస్‌టి మండలి చూసుకుంటుందని ఆర్థిక మంత్రిగా అపార అనుభవం ఉన్న జైట్లీ తెలిపారు. కీలక ఆపరేషన్ తరువాత జైట్లీ ప్రస్తుతం ఏ హోదాలేని మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సింగిల్ శ్లాబ్ జిఎస్‌టి సలహాలు సరికావని , అత్యధిక ఆదాయ వర్గాలు ఉండే దేశాలకు వర్తించే విధానాన్ని ఇక్కడ అమలు చేయాలంటే అది అప్రస్తుతం అవుతుందన్నారు. రాహుల్ గాంధీ సింగపూర్ మోడల్ పట్ల ఆకర్షితులు అయి ఉండొచ్చునని, ఈ మోజులో ఈ మాటలకు దిగుతూ ఉన్నట్లు ఉందని జైట్లీ వ్యాఖ్యానించారు. జనాభాపరంగా తక్కువగా ఉండే సింగపూర్‌కు ఇండియాకు లింక్ సాధ్యమా అని ప్రశ్నించారు. సింగపూర్‌లో ఫుడ్‌పై 7 శాతం జిఎస్‌టి పెట్టవచ్చు. అదే విధంగా విలాస సరుకులపై కూడా ఇదేశాతం మోపవచ్చు. అయితే ఈ తరహా విధానంలో వడ్డింపులు ఇండియాలో సాధ్యమా? అని ప్రశ్నించారు