ఇదీ భారతదేశం. మనిషి ప్రాణాలకు విలువివ్వని భారతదేశం ఇది. పనికిమాలిన పోకడలకు అలవాటు పడి, టెక్నాలజీ, సోషల్ మీడియా వెంట పరిగెత్తే భారతదేశం ఇది. అందుకే ఓ నిండు ప్రాణాలు రోడ్డు మీద గిలగిలా కొట్టుకుంటున్నా… చోద్యం చూసిందే తప్ప పట్టించుకోలేదు.
వివరాల్లోకెళ్తే… కర్ణాటక రాజధాని బెంగళూరు కు 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొప్పల్ కు చెందిన అన్వర్ అలీ, సైకిల్ పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు డీకొంది. బస్సు అలీ నడుము పైనుంచి వెళ్లడంతో అలీ కదలలేక అలాగే రక్తపుమడుగులో పడి ఉన్నాడు.
ఈ ఘటన ను గమనించిన స్థానికులు అలీ దగ్గరకు వచ్చి, తమ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీశారే తప్ప ఒక్కరూ హాస్పిటల్ కు తీసుకెళ్లడానికి ప్రయత్నించలేదు. యాక్సిడెంట్ జరిగిన 20 నిమిషాల వరకూ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీస్తూనే ఉన్నారు. ఒక్క స్థానికుడు మాత్రం అలీకి కొన్ని నీళ్లు తాగించి హాస్పిటల్ కు తీసుకెళ్లినా.. అప్పటికే అలీ మరణించాడు.
తన తమ్ముడిని సరైన సమయానికి హాస్పిటల్ కు తీసుకెళ్లుంటే బతికేవాడని, కాని ఫోటోలు, వీడియోలు తీస్తూ టైమ్ వేస్ట్ చేశారని, అలీ అన్నయ్య బోరుమన్నాడు.