Home జాతీయ వార్తలు 1,818 కిలోల డ్రగ్స్ డ్రంప్

1,818 కిలోల డ్రగ్స్ డ్రంప్

 

మూడేళ్లుగా సాగుతున్న భారీ దందా
 ఇద్దరు నైజీరియన్ల అరెస్టు
 నివాసం ఐపిఎస్ అధికారిది

నోయిడా : దేశంలోనే అత్యంత భారీ స్థాయిమాదకద్రవ్యాల స్థావరాన్ని గ్రేటర్ నోయిడాలో కనుగొన్నారు. మత్తుమందు గిడ్డంగిని తలపించిన ఈ ఇల్లు ఒక ఐపిఎస్ అధికారిదని వెల్లడైంది. ఢిల్లీకి శివార్లలోని గ్రేటర్ నోయిడాలో ఒక నివాసంలో మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సిబి) వారు జరిపిన సోదాలలో 1,818 కిలోల డ్రగ్‌ను కనుగొన్నారు. తీవ్రస్థాయి నిషాను కల్గించే ఈ స్యూడోఎఫెడ్రైన్ నిల్వలను ఇంత పెద్ద మొత్తంలో పట్టుకోవడందేశంలోనే ఇది తొలిసారి. దాదాపు రూ 1000 కోట్ల వరకూ ఖరీదు చేసే ఈ డ్రగ్ ఉన్న ఇల్లు యాజమాని ఎవరనేది ఆరాతీయగా అది ఐపిఎస్ అధికారి దేవేంద్ర పాండేది అని తేలినట్లు అధికారులు తెలిపారు. దేశంలో ఇటువంటి మాదకద్రవ్యాన్ని ఇంత పెద్ద మొత్తంలో కనుగొనడం ఇదే మొదటిసారి అని, ఇక గత మూడేళ్లలో ప్రపంచస్థాయిలో చూస్తే కూడా ఇది భారీ డ్రగ్ నిల్వ అని ఎన్‌సిబి ప్రాంతీయ డైరెక్టర్ మాధవ్ సింగ్ ఆదివారం విలేకరులకు తెలిపారు. తాము జరిపిన దాడి క్రమంలో ఇద్దరు నైజీరియన్లను అరెస్టు చేసినట్లు అధికారి వివరించారు. తమకు అత్యంత కీలకమైన సమాచారం అందడంతో గురువారం కేంద్రీయ పారిశ్రామిక భద్రతా బలగాలకు తెలిపామని, వారు వెంటనే ఢిల్లీ నుంచి దుబాయ్ మీదుగా జోహాన్స్‌బర్గ్‌కు వెళ్లేందకు సిద్ధంగా ఉన్న 31 ఏండ్ల దక్షిణాఫ్రికా మహిళ నొమ్సా లుటాలోను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. ఆమె బ్యాగులను తనిఖీ చేయగా 25 కేజీల వరకూ ఈ మత్తుమందు దొరికినట్లు చెప్పారు. ఆ మహిళను క్షుణ్ణంగా విచారించిన తరువాత గ్రేటర్ నోయిడాలోని నివాసంలో ఉంటున్న నైజీరియన్లు ఈ సరుకు ఇచ్చి పంపించారని చెప్పారు. జోహెన్స్‌బర్గ్‌లో తాము చెప్పినచోటికి దీనిని చేరిస్తే భారీ మొత్తంలో సొమ్ము అందుతుందని బేరం కుదుర్చుకున్నారని మహిళ తెలిపింది. మహిళ సమాచారంతో డ్రగ్స్ కంట్రోలు విభాగం వారు ఆమె చెప్పిన చిరునామా మేరకు గ్రేటర్ నోయిడాలోని పి 4 సెక్టార్‌లో ఉన్న నివాసంపై దాడికి దిగారు. ఈ ఇంట్లో నైజీరియాకు చెందిన 35 ఏండ్ల ఐడియోఫర్, 30 ఏండ్ల మహిళ చిన్మండో ఒకోరా ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లో అనేక జాడీలు, డబ్బాలు, పెట్టెలలో ఈ మత్తుమందు ఉన్నట్లు, ఇక్కడే 1.9 కిలోల కొకైన్‌ను కూడా స్వాధీనపర్చుకున్నట్లు ఎన్‌సిబి డైరెక్టర్ సింగ్ తెలిపారు. తాము ఇంటిని అద్దెకు తీసుకుని 2015 నుంచి ఉంటున్నట్లు , తాము వివిధ మార్గాల నుంచి రసాయనాలు ఇతరత్రా సరుకులను తీసుకువచ్చి మత్తుమందు తయారుచేస్తుంటామని, ఎక్కువగా ఆఫ్రికా దేశాలకు తరలిస్తామని ఈ మధ్యకాలంలో ఢిల్లీ పరిసరాలలో కొంత సరుకును ఏజెంట్ల ద్వారా అమ్మామని తెలిపారు. ఈ డ్రగ్స్ నిల్వలు దొరికిన నివాసం యజమాని పాండే ప్రస్తుతం లక్నో పోలీసు విభాగానికి చెందిన ఆర్థిక నేరాల నియంత్రణ విభాగంలో అధికారిగా ఉన్నారు. తాను ప్రాపర్టీ డీలర్ ద్వారా ఇంటిని అద్దెకు ఇచ్చినట్లు, అక్కడ ఎవరుంటున్నారు? వారి పనులు ఏమిటీ, ఇంట్లో వ్యవహారాల గురించి తనకు ఏమీ తెలియదని అధికారులకు ఈ ఐపిఎస్ వివరణ ఇచ్చుకున్నారు. తనకు ఏడాదిగా అద్దెకూడా అందడం లేదని, దీనితో అద్దెకు దిగిన నైజీరియన్ల గురించి నోయిడా పోలీసు అధికారికి ఫిర్యాదు చేశానని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగినట్లు అయితే తనకు బాధ్యత లేదని స్పష్టం చేస్తూ అద్దె ఒప్పందంలో రాసి ఉందని చెప్పిన పోలీసు ఉన్నతాధికారి అద్దెకు దిగింది నైజీరియన్లే అనే విషయం తెలుసునని అంగీకరించారు.

1,818 Kg’s drugs captured in Noida