Home అంతర్జాతీయ వార్తలు వివాహాన్ని 190 కోట్ల మంది చూశారు

వివాహాన్ని 190 కోట్ల మంది చూశారు

Marriage

లండన్: బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్‌హ్యారీ (33), అమెరికా నటి మేఘన్ మార్కెల్(36)ల వివాహం శనివారం ఘనంగా జరగడం తెలిసిందే. బెర్క్‌షైర్ కౌంటీ విండ్సర్ క్యాసిల్‌లోని సెయింట్ జార్జి చర్చిలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు 600 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. మరో 2640 మంది విండ్సర్ మైదానంనుంచి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది టీవీల్లో ఈ వివాహ వేడుకలను తిలకించారు. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1.9 బిలియన్ల మంది(190 కోట్ల మంది) ఈ వివాహ వేడుకలను టీవీల్లో వీక్షించారని ‘ డైలీ ఎక్స్‌ప్రెస్’ పత్రిక తెలిపింది. వివాహం అనంతరం హ్యారీ దంపతులు గుర్రపు బగ్గీలో విడ్సర్ ప్రాంతం అంతా కలయ తిరిగారు. వీరిని చూసేందుకు దాదాపు పదివేల మంది వచ్చారు. వివాహ వేడుకలకు హాజరైన వారిలో హాలీవుడ్ నటుడు జార్జి క్లూనీ, ప్రముఖ టాక్‌షో వ్యాఖ్యాత ఓప్రా విన్‌ఫ్రే, బ్రిటన్ సాకర్ ఆటగాడు డేవిడ్ బెకమ్ దంపతులు, అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్, గాయకుడు ఎల్టన్ జాన్ తదితరులున్నారు. వివాహానికి హాజరైన భారతీయుల్లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ముంబయి కేంద్రంగా పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ మైనా మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకు రాలు పుహానీ జలోటా, ఇతర సభ్యులున్నారు.