Home ఆఫ్ బీట్ యువతకి మార్గదర్శి 1ఎం1బీ

యువతకి మార్గదర్శి 1ఎం1బీ

Man Who Will Help 1 Billion People

యువత ఉపాధికి రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. అందరికీ వారు అనుకున్న ఉద్యోగాలు లభించకపోవచ్చు. కొంతమందికి అవకాశాలు ఏమి ఉన్నాయో కూడా అవగాహన ఉండదు. ఉద్యోగం దొరికినా వాటిలో ఎదగటానికి ఎలాంటి మార్గాలు అనుసరించాలో కూడా తెలియదు. కొంతమందికి పరిశ్రమలుపెట్టాలని ఆసక్తిచూపుతారు. కానీ దానికి పెట్టుబడి పెట్టాలని వెనకడుగు వేస్తారు. ఇలాంటి వారికి తగిన సలహాలు ఇచ్చి వారిలో నమ్మకాన్ని పెంచి అభివృద్ధిలోకి వచ్చేలా తీర్చిదిద్దే సంస్థే 1ఎం1బీ. వాస్తవానికి ఇది సంస్థ కాదు… ఓ వ్యక్తి లక్ష్యం. కొన్ని లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని వారి ద్వారా కోట్లమందికి ఉపాధి సౌకర్యం కల్పించాలనేది మనవ్‌ సుబోధ్ లక్ష్యం. 18 నుంచి 25 ఏళ్ల యువతలో చైతన్యం కల్పించే దిశగా మనవ్ సుబోధ్ అనేక కార్యక్రమాలు చేపడతున్నాడు. ఇప్పటికే 30 దేశాల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న 1ఎం1బీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వారికి కూడా సలహాలు, సూచనలు ఇస్తున్నా రు.

బెంగళూరుకు చెందిన మనవ్ ఇంటెల్‌లో గ్లోబల్ మేనేజర్‌గా పనిచేశారు. అంతకుముందూ అనేక సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. చాలామంది యువతలో ఉపాధి లేక బాధపడుతున్న వారిని చూశారు. ఇలాంటివారికి తగిన చేయూత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో 1ఎం1బీకి బీజం పడింది. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఇంటెల్ కంపెనీలో తన బాస్‌కు చెప్పారు. అది ఆయనకు ఎంతో నచ్చింది. దీన్ని నీవు ఉద్యోగం వదిలి చేయొద్దు… మన కంపెనీ నీ ఆశయానికి సహాయం అందిస్తుంది… డూఇట్ అన్నారు. ఆదే ఉత్సాహంతో మొదటగా ఈజిప్టులో తన ఆలోచనకు కార్యరూపం పెట్టారు. అక్కడున్న ఓ కళాశాలకు వెళ్లి శిక్షణ మొదలు పెట్టారు. అక్కడి యువతలో నమ్మకం ఏర్పడింది. సొంత కాళ్ల మీద నిలదొక్కుకునేందుకు పలు అవకాశాలు ఉన్నాయని గ్రహించారు. అక్కడ లభించిన స్పందనతో.. అమెరికా, ఈజిప్ట్, కొస్టారికా, ఐర్లాండ్, జోర్డాన్, కరేబియన్ దీవులు… ఇలా 30 దేశాల్లో మనవ్ మరికొంతమంది ప్రతినిధులు కలిసి శిక్షణలు ఇస్తున్నారు.

గ్రామాల్లో చాలా మంది యువత ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారని దిశానిర్దేశం లేని గ్రామీణ యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చాలనే లక్ష్యంతో 1ఎం1బీ నిర్ణయించుకుంది.గామాల్లో వ్యవసాయం, తాగునీరు, ఆరోగ్యం, విద్య వంటి విషయాల్లో ఉన్న ఉపాధి అవకాశాలను వారికి తెలియజెప్పి, స్థానికంగా ఉన్న వనరులు ఉపయోగించుకొనేలా చైతన్యం చేస్తోంది. ప్రభుత్వాలు కల్పిస్తున్న భరోసా, రాయితీలనూ వివరిస్తోంది. టాటా కంపెనీ ప్రోత్సాహంతో ఉత్తరాఖండ్, కర్ణాటక, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శిక్షణ కేంద్రాలు నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని మోరీ గ్రామంలో ఇప్పటికే టెలీ హెల్త్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శిక్షణ కార్యక్రమాలు నడుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో గురుకుల్ పేరుతో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో భీమవరంలలోని యువతకు ఇవి చేదోడుగా ఉంటాయి. నైపుణ్యాలకు మెరుగులద్దడం, పరిశ్రమలు స్థాపించడానికి అవసరమైన వనరులు సమకూర్చడం వీటి లక్ష్యం. స్థానిక వనరుల గుర్తింపు, ప్రభుత్వ సహకారం అందేట్లు చేయడం తద్వారా పలువురికి ఉపాధి చూపడమే ధ్యేయంగా సాగుతోంది.