Friday, March 29, 2024

శ్వేత భవనానికి భారతీయ గుబాళింపు

- Advertisement -
- Advertisement -

20 Indian-Americans in key positions in the White House

 

వైట్ హౌస్ కీలక పదవుల్లో భారతీయ సంతతికి చెందిన 20 మంది
వారిలో 13 మంది మహిళలు, తన బృందంలో వివిధ జాతీయ మూలాలున్న వారికి
అవకాశం కల్పించిన అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్, 20న ప్రమాణస్వీకారం

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం అయిన శ్వేతసౌధంలో భారత సంతతి వ్యక్తులు కీలక పాత్ర పోషించనున్నారు. కొత్తగా కొలువుతీరనున్న జో బైడెన్ యంత్రాంగంలో ఏకంగా 20 మంది భారతీయ అమెరికన్లు చోటు దక్కించుకున్నారు. వీరిలో 13 మంది మహిళలే కావడం గమనార్హం. ఆ దేశ జనాభాలో భారతీయ అమెరికన్ల వాటా ఒక శాతంకన్నా తక్కువే. అయినప్పటికీ అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ వర్గానికి బైడెన్ తన పాలకవర్గంలో పెద్దపీట వేశారు. అలాగే తన యంత్రాంగంలో వివిధ మూలాలున్న వారికి అవకాశం కల్పించి అమెరికా చరిత్రలోనే అత్యంత వైవిధ్యమైన పాలక వర్గాన్ని సమకూర్చుకున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే బైడెన్ భారతీయ అమెరికన్లకు తన బృందంలో పెద్దపీట వేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారతీయ సంతతి వ్యక్తి కమలా హారిస్ కూడా అదే రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు.

హారిస్ అమెరికా చరిత్రలోనే తొలి మహిళా ఉపాధ్యక్షురాలే కాకుండా ఆ పదవినలంకరించనున్న తొలి భారత సంతతి వ్యక్తి, ఏసియన్ అమెరికన్ కావడం విశేషం. ఇక హారిస్ తర్వాత బైడెన్ బృందంలో మరో కీలక పదవిని చేపట్ట నున్న భారతీయ అమెరికన్ నీరా టాండన్. ఈమె ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఇక మరో కీలక వ్యక్తి వివేకా మూర్తి. ఈయన అమెరికా సర్జన్ జనరల్‌గా వ్యవహరించనున్నారు. వీరే కాకుండా బైడెన్ పాలక వర్గంలో చోటు దక్కించుకున్న మరికొంత మంది భారత సంతతి వారిలో వనితా గుప్తా (జస్టిస్ డిపార్ట్‌మెంట్‌లో అసోసియేట్ అటార్నీ జనరల్), ఉజ్రా జెయా(స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో అండర్ సెక్రటరీ), సబ్రీన సింగ్( తొలి మహిళా డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ), ఐషా షా, సమీరా ఫజిలి, భరత్ రామ్మూర్తి, గౌతమ్ రాఘవన్, వినయ్ రెడ్డి, వేదాంత పటేల్ తదితరులున్నారు. అత్యంత కీలకమైన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌లోను ముగ్గురు భారతీయ అమెరికన్లకు చోటు లభించింది. వారు తరుణ్ చబ్రా, సుమోనా గుహ, శాంతి కలతిల్.

శ్వేతసౌధం కౌన్సిల్ కార్యాలయంలోను ఇద్దరు భారతీయ అమెరికన్ మహిళలకు చోటు లభించింది. నేహా గుప్తా అసోసియేట్ కౌన్సిల్‌గా, రీమా షా డిప్యూటీ అసోసియేట్ కౌన్సిల్‌గా నియమితులైనారు. వీరే కాకుండా అమెరికా చరిత్రలోనే తొలి సారిగా ముగ్గురు దక్షిణాసియా వారికి జో బైడెన్ బృందంలో కీలక పదవులు లభించాయి. పాకిస్తానీ అమెరికన్ అలీ జైదీ వైట్‌హౌస్‌లో డిప్యూటీ నేషనల్ క్లైమేట్ అడ్వైజర్‌గా నియమితుడు కాగా, శ్రీలంక అమెరికన్ రోహిణి కొసొగ్లు ఉపాధ్యక్షుడికి డిప్యూటీ డొమెస్టిక్ పాలసీ అడ్వైజర్‌గా, బంగ్లాదేశ్ జాతీయుడు జయన్ సిద్దీఖి వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌కు సీనియర్ అడ్వైజర్‌గా నియమితులైనారు. అనేక సంవత్సరాలుగా ప్రజా సేవలో భారతీయ అమెరికన్లు చూపించిన అంకిత భావానికి ఇప్పుడు బైడెన్ పాలనలో తగిన గుర్తింపు లభించిందని, వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉండడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ‘ఇండియాస్పోరా’ వ్యవస్థాపకుడు ఎంఆర్ రంగస్వామి పిటిఐతో అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News