Home స్కోర్ తీపి జ్ఞాపకాల ప్రస్థానం

తీపి జ్ఞాపకాల ప్రస్థానం

భారత క్రీడా చరిత్రలో 2017 ప్రత్యేకత సంతరించుకొంది. ఈ ఏడాది భారత్ ప్రపంచ క్రీడల్లో తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా క్రికెట్, బ్యాడ్మింటన్ విభాగాల్లో భారత్ మెరుగైన ఆటతో ఆకట్టుకుంది. ఇక, చదరంగంలో కూడా భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అసాధారణ ఆటతో భారత ఖ్యాతిని ఇనుమడింప చేశాడు. ఇక, తెలుగు తేజాలు పివి.సింధు, కిదాంబి శ్రీకాంత్, మిథాలీరాజ్‌లు ప్రపంచ క్రీడల్లో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా, మురళీ విజయ్, యజ్వేంద్ర చాహల్, బుమ్రా, భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్ తదితరులు అద్భుత ఆటతో భారత ఖ్యాతిని నలుమూలలా చాటారు. ఇక, ప్రపంచ క్రికెట్‌లో భారత్ ఎదురులేని శక్తిగా మారింది. శ్రీకాంత్ నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్‌తో చరిత్ర సృష్టించాడు. సింధు కూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అంతేగాక, మహిళల బ్యాడ్మింటన్‌లో నిలకడైన ఆటతో ప్రకంపనలు సృష్టించింది. మరోవైపు సాయి ప్రణీత్, హెచ్.ఎస్.ప్రణయ్‌లు కూడా అద్భుత ఆటతో ఆకట్టుకున్నారు. మహిళా క్రికెట్‌లో మిథాలీరాజ్ నేతృత్వంలోని భారత జట్టు ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచింది. మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, ఏక్తా బిస్త్, మిథాలీరాజ్, వేదకృష్ణమూర్తి, స్మృతి మందన, దీప్తి శర్మ, జులాన్ గోస్వామి, రాజేశ్వరి, మాన్సి జోషి తదితరులు అద్భుత ఆటతో ప్రపంచ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించారు. సమష్టి ఆటతో భారత జట్టు ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకుని పెను సంచలనమే సృష్టించింది. హాకీలో కూడా భారత పురుషుల జట్టు నిలకడైన ఆటతో ఆకట్టుకుంది. ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్‌లో విజేతగా నిలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బెల్జియం, దక్షిణ కొరియా, మలేసియా, స్పెయిన్ వంటి అగ్రశ్రేణి జట్లపై సంచలన విజయాలు సాధించింది. అంతేగాక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తన ఆధిపత్యాన్ని చెలాయించింది. దాయాదితో ఈ ఏడాది జరిగిన అన్ని మ్యాచుల్లోనూ భారత్ జయకేతనం ఎగుర వేసింది. ఆర్చరి, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్ వంటి క్రీడల్లో భారత క్రీడాకారులు పెను ప్రకంపనలు సృష్టించారు. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారిణి మీరాబాయి చాను విశ్వవిజేతగా నిలిచింది. మహిళల ప్రపంచ ఆర్చరి చాంపియన్‌షిప్‌లో భారత జట్టు రజతం సాధించింది. మరోవైపు మహిళల హాకీ విభాగంలో భారత జట్టు ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అంతేగాక హాకీ వరల్డ్‌కప్‌కు అర్హత కూడా సాధించింది.

* క్రికెట్‌లో టీమిండియా ప్రకంపనలు
*బ్మాడ్మింటన్‌లో మెరిసిన తెలుగుతేజాలు
*మీరాబాయి చానూ సంచలనం
*సత్తా చాటిన మిథాలీ సేన
*రోహిత్ మెరుపు విన్యాసాలు
*కొత్త పుంతలు తొక్కిన భారత క్రీడా రంగం

ఎదురులేని భారత్

india
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సంవత్సరాలో 2017 చిరకాలం గుర్తుండి పోతోంది. ఈ ఏడాది భారత్ ఒక్క సిరీస్ కూడా కోల్పోకుండానే ముగించింది. ఆడిన అన్ని సిరీస్‌లలో టీమిండియా జయకేతనం ఎగుర వేసింది. ఇంగ్లాండ్‌తో మొదలైన భారత విజయపరంపర ఈ ఏడాది చివర్లో ముగిసిన శ్రీలంక సిరీస్ వరకు విజయవంతంగా సాగింది. ఈ క్రమంలో ఆడిన అన్ని సిరీస్‌లలో భారత్ జయభేరి మోగించింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, విండీస్, శ్రీలంకలతో జరిగిన అన్ని సిరీస్‌లలో భారత్ విజయం సాధించింది. ఈ ఏడాది భారత్ మూడు ఫార్మాట్‌లలో కలిపి 53 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో భారత్ 37 మ్యాచుల్లో విజయాలు అందుకుంది. ఇదే క్రమంలో ప్రపంచ క్రికెట్ ఒక ఏడాది అత్యధిక విజయాలు సాధించిన జట్లలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఒక్క ఆస్ట్రేలియా మాత్రమే ప్రపంచ క్రికెట్‌లో ఒక ఏడాదిలో అత్యధికంగా 38 విజయాలు దక్కించుకుంది. తర్వాతి స్థానం భారత్‌దే కావడం విశేషం. కాగా, ఈ ఏడాది భారత క్రికెట్ జట్టులో టెస్టుల్లో అగ్రస్థానంలో నిలిచింది. అంతేగాక, వన్డేల్లో కూడా ఈ ఏడాది రెండు సార్లు టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. మరోవైపు ట్వంటీ20 ర్యాంకింగ్స్‌లో కూడా రెండో స్థానాన్ని సాధించింది. ఇక, వన్డేల్లో, టి20లలో విరాట్ కోహ్లి టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. టెస్టుల్లో కూడా అతను రెండో స్థానంలో నిలిచాడు.

రోహిత్ సంచలనం..

rht

ఈ ఏడాది భారత డాషింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ వన్డేల్లో మూడో డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. మొహాలిలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ 208 పరుగులు చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్‌లో సచిన్, సెహ్వాగ్, గుప్టిల్, క్రిస్ గేల్‌లు ఇప్పటి వరకు వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించారు. వీరంత కెరీర్‌లో ఒక్కసారి మాత్రమే డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. అయితే రోహిత్ మాత్రం ఈ ఫీట్‌ను ఏకంగా మూడు సార్లు సాధించి పెను సంచలనమే సృష్టించాడు. ఇక, టి20లో కూడా 35 బంతుల్లోనే సెంచరీ సాధించి మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో ఇండోర్‌లో జరిగిన టి20 మ్యాచ్ సందర్భంగా 35 బంతుల్లోనే శతకం సాధించి దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పేరిట ఉన్న ప్రపంచ అత్యంత వేగవంతమైన శతకం రికార్డును సమం చేశాడు. ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా పరుగుల పారించి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. పుజారా, విజయ్‌లు కూడా కొత్త రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. ఇక, దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టెసుల్లో అత్యంత వేగంగా 300 వికెట్లను మైలురాయిని అందుకుని చరిత్ర సృష్టించాడు. మొత్తం మీద భారత క్రికెట్‌లో 2017 ఓ మరుపురాని ఏడాదిగా మిగిలి పోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అందరికంటే కోహ్లి బెటర్

khl
న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఎందరో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని, వారిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అందరికంటే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనడంతో సందేహం లేదని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. సమకాలిన క్రికెట్‌లో కోహ్లికి సరితూగే బ్యాట్స్‌మన్ ఎవరు లేరన్నాడు. ఫార్మాట్ ఏదైనా కోహ్లి చెలరేగి పోతాడన్నాడు. దీనికి అతని గణంకాలే నిదర్శనమన్నాడు. జోరూట్, వార్నర్, స్మిత్, రోహిత్, విలియమ్సన్, డివిలియర్స్ వంటి వారితో పోల్చితే కోహ్లి చాలా ఉత్తమ ఆటగాడు అనడంలో సందేహం లేదన్నాడు. ఎటువంటి బౌలింగ్ లైనప్‌నైనా దీటుగా ఎదుర్కొనే సత్తా ఒక్క విరాట్‌కే ఉందన్నాడు. టెస్టు, వన్డేలు, టి20లలో అతను మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడని తెలిపాడు. ఇందుకు అతని ఈ ఫార్మాట్‌లలో అతని బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌సే నిదర్శనమన్నాడు.

సత్తా చాటిన శ్రీకాంత్..

srikanth
ఇక, ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత స్టార్, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ పెను ప్రకంపనలే సృష్టించాడు. ఈ ఏడాది ఏకంగా నాలుగు టైటిల్స్ గెలిచి పత్తా చాటాడు. ఆస్ట్రేలియా ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లలో టైటిల్స్ గెలిచాడు. అంతేగాక సింగపూర్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఈ ఏడాది సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. గాయం వల్ల చివరి దశలో ఆటకు దూరం కావడంతో నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈ క్రమంలో లీ చాంగ్ వీ (మలేసియా), లిన్ డాన్, చెన్ లాంగ్ (చైనా), విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ల జోరుకు అడ్డుకట్టు వేశాడు. ప్రణయ్ కూడా సంచలన విజయాలతో పెను ప్రకంపనలే సృష్టించాడు. అతను ఈ ఏడాది లిన్ డాన్, అక్సెల్సన్, చాంగ్ వీ తదితర స్టార్లను మట్టికరిపించి సత్తా చాటాడు. సాయి ప్రణీత్ కూడా రెండు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచి సంచలనం సృష్టించాడు. అజయ్ జయరాం, సౌరవ్ వర్మ తదితరులు కూడా నిలకడైన ఆటతో ఆకట్టుకున్నారు

సింధు జోరు…

sindu
మరోవైపు మహిళల సింగిల్స్‌లో తెలుగుతేజం సింధు జోరును కొనసాగించింది. ఈ ఏడాది సింధు నిలకడైన విజయాలు సాధించింది. అయితే ఫైనల్లో ఓటమి ఫొబియాను అధిగమించలేక పోయింది. రెండు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించిన సింధు పలు టోర్నమెంట్‌లలో ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఫైనల్లో విజయం సాధించడంలో మరోసారి తడబాటుకు గురైంది. ప్రపంచ చాంపియన్‌షిప్, దుబాయి ఓపెన్‌లలో ఫైనల్ వరకు వచ్చినా తృటిలో టైటిల్స్ గెలిచే అవకాశాలను చేజార్చుకుంది. సైనా కూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది. జాతీయ స్థాయి టోర్నమెంట్‌లో సింధు ను ఓడించి విజేతగా నిలిచింది. అంతేగాక టాప్ టెన్ ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించింది..