Home ఆఫ్ బీట్ సాంకేతిక పరిజ్ఞానంలో కొత్తపుంతలు

సాంకేతిక పరిజ్ఞానంలో కొత్తపుంతలు

సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. పోయిన సంవత్సరంలో మార్పులు, ఆవిష్కరణలు చోటుచేసు కున్నాయి. వాటిల్లో చేతిలో ఇమిడిపోయే కంప్యూటర్లు, చెబితే వినే ఫోన్లు ఇలాంటివెన్నో ఉన్నాయి. 2018 లో ట్రెండ్ క్రియేట్ చేసిన అంశాలు, యూజర్లు కట్టిపడేసిన ఫోన్లు, ఆకట్టుకున్న యాప్స్ మనల్ని ఆకట్టుకున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం…

ఇయర్ ప్రింట్ : బయోమెట్రిక్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చాక ఫింగర్ ప్రింట్‌తో పని మరింత పెరిగింది. కాకపోతే మనకు తెలియకుండానే ఈ టెక్నాలజీ చోరీకి గురవుతోంది. మరి ఈ సమస్యకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ’ఇయర్ ప్రింట్’ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇదెలా పనిచేస్తుందంటే…ఇందులో మొబైల్ నుంచీ మన చెవికి ఓ ధ్వనిని పంపిస్తారు. ఆ ధ్వని తిరిగి వెనక్కి వెళ్తుంది. ఈ ధ్వని ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. ఇయర్ ప్రింట్ కావాలంటే, స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ని మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. అది స్మార్ట్ ఫోన్ సెన్సార్లను ఉపయోగించుకుంటుంది. ఇది చాలా సులభంగా జరిగే ప్రక్రియ. చెవి దగ్గర మొబైల్ పెట్టి, టచ్ స్క్రీన్‌ను ట్యాప్ చేస్తే కావల్సిన పని జరిగిపోతుంది. భవిష్యత్తులో ఫింగర్ ప్రింట్స్ బదులు ఇయర్ ప్రింట్స్ వస్తాయంటున్నారు సైంటిస్టులు. సైబర్ సెక్యూరిటీకి ఇది ఎంతగానో మేలు చేయనున్నట్లు చెబుతున్నారు.

రోబో జెల్లీఫిష్: వాతావరణ కాలుష్యం వల్ల సముద్రాల్లో ఉండే పగడపు దిబ్బలు, వాటిలోని అరుదైన జీవులు, విలువైన మొక్కలు అంతరించిపోతున్నాయి. పగడపు దిబ్బలను కాపాడాలంటే అక్కడి వాతావరణాన్ని నిరంతరం గమనిస్తూ ఉండటానికి ఏర్పాటుచేసిందే రోబో జెల్లీ ఫిష్. ఇది పగడపు దిబ్బలకు ఎటువంటి హాని కలిగించదు. అక్కడి జీవులకు అపాయం రానీయదు. అమెరికా, ఫ్లోరిడాలోని అట్లాంటిక్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు.

గూగుల్ ఏఐ: వెబ్ సెర్చింగ్‌లో దూసుకుపోతున్న సెర్చింజిన్ ’గూగుల్’. ఈ ఏడాదిలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. మనిషి కంటిని చూసి అతనికి వచ్చిన రోగం ఏంటో పక్కాగా చెప్పేలా ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సృష్టించింది. డయాబెటిస్ లాంటి మొండి రోగాల్ని తేలిగ్గా గుర్తించేందుకు ఇది వీలు కల్పిస్తోంది. మన కళ్లను చూసి కంటి డాక్టర్ల కంటే కచ్చితంగా షుగర్ లెవెల్స్‌ని లెక్కకట్టి చెప్పేస్తుందీ గూగుల్ ఏఐ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డయాబెటిక్ రెటినోపతి ఆవిష్కరణను త్వరలోనే భారతదేశంలోని క్లినిక్స్‌కు అందించనుంది గూగుల్.
త్రీడీ ప్రింటింగ్ : ప్రింటింగ్ అంటే కేవలం సాఫ్ట్ కాపీని కేన్వాస్ మీదనో, పేపర్ మీదనో ప్రింట్ తీయటం. కానీ త్రిడీ ప్రింటింగ్ అంటే ఒక వస్తువును సృష్టించటం. సాప్ట్ కాపీ నుంచి త్రిడీ ప్రింటర్ ద్వారా అచ్చంగా అదే వస్తువును తయారు చేయటం. ఈ టెక్నాలజీ తో కావాల్సిన భారీ లోహ నిర్మాణాల్ని అప్పటికప్పుడే తయారు చేయించుకోవచ్చు. ఇదివరకు సాధ్యం కాని క్లిష్టమైన లోహ ఆకృతుల్ని కూడా ఇప్పుడు త్రీడీ ప్రింటర్లు తయారుచేస్తున్నాయి.
గతేడాదితో పోల్చితే

ఈఏడాది సోషల్ మీడియా టూల్స్‌లో అదిరిపోయే ఫీచర్లు వచ్చాయి. ప్రధానంగా ఫేస్‌బుక్, వాట్సాప్‌లు ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. మరోవైపు యూజర్ల ప్రైవసీని కాపాడే విధంగానూ ఫీచర్లు రావటంతో వాటికి మరింత ఆదరణ పెరిగింది. ఫేస్‌బుక్ జోడించిన ఫీచర్లలో ప్రధానం లైవ్ స్ట్రీమ్, పోస్ట్ రియాక్షన్స్, ఆడియో లైవ్, జిప్ ఫైల్స్ షేరింగ్ ఫీచర్లు వచ్చాయి. దీంతో పాటు యూజర్ సెక్యూరిటీలోనూ మార్పులు వచ్చాయి. వాట్సాప్ కూడా వేగంగా ఫీచర్లను రిలీజ్ చేస్తూ వచ్చింది. ప్రధానంగా ఫార్వర్డ్ మెసేజ్‌లను, ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటుంటోంది. మనీ ట్రాన్ఫఫర్, వీడియో కాలింగ్, గ్రూప్ వీడియో కాలింగ్, డార్క్ మోడ్, స్టికర్స్, స్త్వ్రప్‌టు రిప్లే, డాక్యుమెంట్, లొకేషన్ షేరింగ్ వంటి అదిరే ఫీచర్లను జోడించి వినియోగదారులకు మరింత చేరువైంది. గ్రూప్ అడ్మిన్ రూల్స్‌లో మార్పులతో సెక్యూరిటీ, ప్రైవసీ పెంచింది. ఆండ్రాయిడ్, ఐఫోన్‌లకూ దాదాపు ఒకే సారి ఫీచర్లను అందించటంలో సక్సెస్ అయింది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లు ఇన్‌స్టంట్ మెసెజింగ్‌లో ట్రెండ్‌గా మారటంతో హైక్, స్కైప్, వైబర్ వంటి సోషల్ యాప్‌లు వెనకబడ్డాయి. ఎంటర్టెయిన్, షేరింగ్ ఫీచర్లతో ఉన్న ఇన్‌స్టా, షేర్‌చాట్‌లను నెటిజన్లు ఆదరించారు. 2018లో ప్రధానంగా హాట్‌టాపిక్ గా మారిన టెక్నాలజీ ’అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్’.

ఈ టెక్నాలజీపై ప్రపంచ దేశాలు ఫోకస్ చేశాయి. ఇండియాలోనూ ఏఐ టెక్నాలజీ ప్రభావం కనిపించింది. 1956లో అమెరికా శాస్త్రవేత్త జాన్ మెక్‌కార్తీ… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పదాన్ని సృష్టిం చారు. యంత్రాలు మనుషుల్లా పని చెయ్యడం, మాట్లాడ గలగడం, ఆలోచించ గలగడమే దీని లక్ష్యం. ఇప్పుడిప్పుడే ఈ కల సాకారం అవుతోంది. స్మార్ట్ మొబైళ్ల రాకతో, సామాన్యులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి దగ్గరయ్యారు. ఈ టెక్నాలజీతో రూపొందిన హ్యూమనాయిడ్ రోబోలు ఇప్పటికే చాలా రంగాల్లో సేవలందిస్తున్నాయి.

2018 Technology Roundup