Friday, December 2, 2022

2019 అక్షరయానం

- Advertisement -

Aksharayan

 

రచయిత్రుల పయనం..

మహిళలపై జరిగే అత్యాచారాలను, అన్యాయాలను చూసి చలించిన మనస్సులతో కలాలన్నీ ఒక్కచోట చేరి సంఘటితంగా నిలబడి సమాజంలో మార్పు కోసం పాటుపడాలన్న సంకల్పానికి ప్రతిరూపమే అక్షరయాన్. నలభై మంది రచయిత్రులతో మొయినాబాద్ లో జూలై 14 తేదీన అక్షరయాన్ ప్రారంభమైంది. కవయిత్రులతో ఒకరోజు సమయం కేటాయించుకుని చర్చలు జరుపుకోవాలన్న లక్షం రవీంద్రభారతి నుంచి మొదలుపెట్టి చిలుకూరు బాలాజి దేవాలయం మీదుగా ముందుకు సాగింది. మొయినాబాద్ రిసార్టులో తొలి సమావేశం నాళేశ్వరం శంకరం ప్రసంగంతో ప్రారంభమైంది. రచనలు చేసే వారు తాము చేసే రచనలపట్ల ఎటువంటి శ్రద్ధ చూపించాలో..వస్తువు, శిల్పనిర్మాణాలలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ఇచ్చిన వివరణాత్మక ప్రసంగం రచయిత్రులకు ఎంతగానో తోడ్పడింది.

తరువాత ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణాధికారి సి. యస్ .రాంబాబు రేడియోలో కథలు, కవితలు రాసేటప్పుడు పాటించవలసిన మెళకువలను తెలియజేశారు. రచయిత్రులంతా ముఖాముఖి కలుసుకుని పరిచయాలు చేసుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకున్నారు..అనంతరం యోగ ప్రదర్శన, యోగ ఆవశ్యకత గురించి చర్చ జరిగింది. యోగ శిక్షకురాలు, సంగీతంతో పాటు యోగ చేసే వివిధ రచయిత్రులు వాటి మెళకువలను తెలియపరిచారు. పసిపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై వెంటనే ఒక కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అక్షరయాన్ చేపట్టిన రెండవ 20 మంది కవయిత్రులతో పసిమొగ్గలు పేరుతో ఆకాశవాణిలో ప్రత్యక్షప్రసారంగా కవిసమ్మేళనం. అయినంపూడి శ్రీలక్ష్మి, మోహిత కౌండిన్య, రాంబాబు సహకారంతో నిర్వహించబడింది. శైలజ సుమన్, మమత రఘువీర్, వెంకటేశ్వర్ రెడ్డి,దీప్తి తదితర ప్రముఖుల సమక్షంలో కవిసమ్మేళన నిర్వహణ మనోరంజకంగా సాగింది.

మూడవ కార్యక్రమంగా రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో 8-8-2019న ఫేస్ టు ఫేస్ విత్ సెల్ఫీ ఆఫ్ సక్సెస్ బుర్రా వెంకటేశం పుస్తకవిజయంలో పాలుపంచుకోవడం . వ్యక్తిత్వ వికాసం గురించిన ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ బాద్మి శివకుమార్, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి మామిడి హరికృష్ణ, ఆకాశవాణి డైరెక్టర్ ఉదయశంకర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర టివి , చలనచిత్ర, నాటకరంగ సంస్థల మానేజింగ్ డైరెక్టర్ బుర్రావెంకటేశం అత్యధికంగా అమెజాన్ లో అమ్ముడుపోయిన తన సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తకం గురించి చేసిన ప్రసంగం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అదేరోజు మద్యాహ్నం అక్షరయాన్ రచయిత్రులు తమలో ఒకరైన ప్రముఖ కథా రచయిత్రి కె.బి.లక్ష్మి హఠాతుగా మరణించినందున వారి పిల్లల సమక్షంలో ఒక సంతాప సభను నిర్వహించింది.

మహత్తర కార్యక్రమం
హైదరాబాద్ లో తెలంగాణ స్టేట్ పోలిస్ విమెన్ వింగ్ కార్యాలయం సమావేశ హాల్లో భరోసా ఆధ్వర్యంలో 2019 అక్టోబర్ 17న అక్షరయాన్ రచయిత్రుల సమావేశం జరిగింది. దీనిని తరుణి వ్యవస్థాపకులు డా. మమతా రఘువీర్ ఏర్పాటుచేశారు. అక్షరయాన్ వ్యవస్థాపకులు ఐనంపూడి శ్రీలక్ష్మి ప్రారంభోపన్యాసం, తర్వాత మమతా రఘువీర్ భరోసా అందిస్తున్న సేవలు , సాధించిన విజయాల గురించి పవర్ పాయుంట్ ప్రజెంటేషన్ తో వివరించి సంబంధిత వీడియోలను ప్రదర్శించారు. పోలీసు అదనపు కమిషనర్ స్వాతి లక్రా అద్భుతమైన ప్రసంగంతో పోలీసు వ్యవస్థ భరోసా ద్వారా , షీ టీమ్స్ ద్వారా చేస్తున్న పనితీరును వివరించారు. మహిళలు సమస్యలను ఎదుర్కునే దిశలో పయనించేలా చేయవలసిన బాధ్యత రచయిత్రులదే అన్నారు. అనంతరం ఎసిపి ధారా కవిత షీ టీమ్స్ చేస్తున్న విధివిధానాలను కూలంకషంగా చర్చించారు.

స్వయంగా ధారాకవిత కూడా సాహితీకారులన్న విషయం చెప్పారు. డిజిపి రమణ, అడ్వకేట్ స్పందన రమణి, ఫాష్ట్ ట్రాక్ ట్రయల్ స్పెషల్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. రచయత్రుల లో కన్నెగంటి అనసూయ, జ్వలిత ఇంకా కొందరు బ్రేక్ ద సైలెంట్ అంటూ షీటీమ్ ను తాము ఎలా ఉపయోగించుకున్నది తమ అనుభవాలను పంచుకున్నారు. బాధితులు కొందరు వారు ఎదుర్కొన్న అరాచకాన్ని వారికి భరోసా అందించిన చేయూతని వివరించారు. అందరి కథనాలు కన్నీరు పెట్టించాయి. బాధితులకు సహాయాన్నందించడానికి అక్షరయాన్ ప్రకటించగానే తమ స్పందనలతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చిన కవయత్రుల మానవీయత ప్రశంసనీయం. షీటీమ్స్ మీద కవితలు రాసే అవకాశం డిజిపి స్వాతి లక్రా రచయిత్రులకు కలిగించారు. మూడు ఉత్తమ కవితలకు షీ టీమ్స్ వార్షికోత్సవంలో బహుమతులిచ్చి ఉత్తమ కవితను చదివే అవకాశం కలిగస్తామని రాసిన కవితలను పుస్తకంగా వెలువరిస్తామని షీ టీమ్స్ ప్రకటించింది. ఉత్తమ కవితగా అయినంపూడి శ్రీలక్ష్మి కవిత ఎంపికయి 2019 అక్టోబర్ 25న షీ టీమ్స్ వార్షికోత్సవంలో చదవగా పలువురి ప్రశంసలకు నోచుకుంది.

ద్వితీయ, తృతీయ బహుమతులకు జ్వలిత, నాంపల్లి సుజాతల కవితలు ఎంపికయ్యాయి. కవితా సంకలనం ఆవిష్కరణ కు సిద్ధమైంది. సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేసే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ , తెలంగాణ జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో 2019 అక్టోబర్ 30 నాడు పెద్దయెత్తున బతుకమ్మ ఆటపాటలతో కవిసమ్మేళనాలతో సంబురాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ యార్లగడ్డ శైలజ సుమన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ‘పూలసింగిడి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 316 మంది కవయిత్రుల కవితల సంపుటి ఇదీ. అదే రోజు సాయంత్రం అక్షరయాన్ కవయిత్రులు మరోచరిత్ర సృష్టించారు . రాజ్‌భవన్ లో రాష్ట్ర గవర్నర్ డా తమిళిసై సౌందరరాజన్‌తో బతుకమ్మ సంబురాలలో పాల్గొని పుస్తకాలన్నీ పేర్చి పుస్తక బతుకమ్మను పూలబతుకమ్మతో జత చేర్చి గవర్నర్ తో కలిసి తొలిసారిగా రచయిత్రులు బతుకమ్మ ఆడారు . గవర్నర్ తో విందులో పాల్గొన్నారు.

అక్షరయాన్ విజయవంతంగా నిర్వహించిన కార్యక్రమం విత్తన సదస్సు. డిసెంబరు 21 వతేదీన రెడ్ హిల్స్ లోని ఫాప్సీ భవన్ లో దాదాపు 300 మంది రచయిత్రులతో కని విని ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ రచయిత్రులకు చక్కని అవకాశం ఇచ్చి రచయిత్రులచేత మంచి రచనలు చేయించాలని పూనుకున్నది. సదస్సుకు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి , శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి, తెలంగాణ రాష్ట్రప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలంగాణ విత్తన ఉత్పత్తి సంస్థ మేనేజింగ్ డైకెక్టర్ కేశవులు, మోటివేటర్ డా. శివప్రసాద్‌లు విచ్చేశారు. తెలంగాణ విత్తన ఉత్పత్తి సంస్థ మానేజింగ్ డైరెక్టర్ శ్రీ కేశవులు ప్రారంభోపన్యాసం చేస్తూ సదస్సు ప్రధాన ఉద్దేశం వ్యవసాయ రంగంలో విత్తనం పాత్రను, ప్రాముఖ్యతను కథనం , కవితలు, పద్యాల ద్వారా కొన్ని లక్షలమందికి చేరవేయడమన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ యధా బీజం తథా ఫలం.. కనుక తెలంగాణ రాష్ట్రం విత్తనం కోసం చేస్తున్న కృషిని వివరిస్తూ రచయిత్రులు తలచుకుంటే ఏదైనా చేయగలరని వ్యవసాయానికి సంబంధించిన మంచి రచనలకు తమ సహకారం ఉంటుందన్నారు. ప్రపంచంలోని మేలిమి విత్తనాలన్నీ ఒక్కచోట చేరినట్లు రచయిత్రులు అక్షరయాన్ గా కొలువు తీరారన్నారు.

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ అక్షరం, ఆత్మీయత, అనుబంధం కలిసిన సమూహంగా రచయిత్రులను అభివర్ణిస్తూ విత్తనం గురించి ఉత్తమ రచనలకు ఆహ్వానం పలికారు . పార్థసారథి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విత్తనం గురించి తెలియని ఎన్నో విషయాలను అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ మెదడు క్షేత్రం దానిలో ఆలోచనలనే అక్షరాలను వేయాలని అన్నారు . మరింత ఉత్సాహంగా ముందడుగు వేసి ఎన్ టి ఆర్ స్టేడియంలో అక్షరయాన్ రచయిత్రులు 204 నెంబరు స్టాలు లో తమ రచనలను పొందుపరిచి అక్షరయాన్ స్థానాన్ని ప్రత్యేకంగా నిలుపుకున్నారు. 2019 డిసెంబర్ 26న నోముల సత్యనారాయణ వేదిక మీద అక్షరయాన్ గ్రూప్ రథసారధి ఐనంపూడి శ్రీలక్ష్మి సంధానకర్తగా నిర్భయ నుంచి దిశ దాక సాహితీప్రస్థానం పేరుతో జరిగిన సాహితి సమాలోచనలో కవిత్వం గురించి జ్వలిత, కథ గురించి కుప్పిలి పద్మ, చట్టం గురించి మెహజబీన్ , స్వచ్ఛంద సంస్థలు, షీ టీమ్స్ గురించి మనత రఘువీర్ గారు, ఉద్యమాలు గురించి శాంతి ప్రబోధ, పుస్తకాలు గురించి రాజీవ, స్త్రీ వాదం గురించి భండారు విజయ ప్రసంగాలు చేసారు.

ఈ విధంగా మొదలు పెట్టిన నాటి నుంచి ఈ సంవత్సరం చివరి వరకూ అక్షరయాన్ ప్రయాణం రకరకాల కార్యక్రమాలతో రచయిత్రులను కలుపుకుంటూ పలువురికి అవకాశాలు కలిగిస్తూ చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయపరంపరలుగా వెల్లువెత్తి ఎందరికో స్ఫూర్తిదాయకంగా కొనసాగింది. రాష్ట్రాన్ని పది జిల్లాలుగా విభజించుకొని హైదరాబాద్ జిల్లా కు డా.సమ్మెట విజయ, డా. గురజాడ శోభాపేరిందేవి, రంగారెడ్డి జిల్లాకు రమాదేవి కులకర్ణి, మెదక్ జిల్లాకు డా. దేవేంద్ర మారోజు, వరంగల్ జిల్లాకు డా. నెల్లుట్ల రమాదేవి, డా. వాణి దేవుల పల్లి, ఖమ్మం జ్వలిత దెంచనాల , కరీంనగర్ సుజాత నాంపల్లి, కొలిపాక శోభ , మహబూబ్ నగర్ కోట్ల వనజాత, ఆదిలాబాదు నాగజ్యోతి, నల్గొండ సంధ్య సంగెం రచయిత్రులు వెనువెంట స్పందిస్తూ సమాచారం ఆయా జిల్లాల వారికి చేరవేస్తూ కార్యక్రమాలన్ని సక్రమంగా జరగడంలో తమవంతు సహాయ సహకారాలందిస్తున్నారు.

2020లో భరోసా కథల సంకలనం, షీ టీమ్స్ కవితల సంకలనం, విత్తనం కథలు, కవితల పుస్తకాల ఆవిష్కరణలకో సం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్షరయాన్ అద్భుతయాన్‌గా మారే క్రమంలో మరెన్నో కార్యక్రమాలకు సమాయత్తమవుతోంది

                                                                                                               – డా.సమ్మెట విజయ
Aksharayan launched on July 14 in Moinabad

Related Articles

- Advertisement -

Latest Articles