Home మహబూబాబాద్ బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేద్దాం..

బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేద్దాం..

239 tandas are gram panchayats Advertising

మన తెలంగాణ/మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్ర4వ అవతరణ వేడుకలను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖా మంత్రి అజ్మీరా చందూలాల్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని ఎంపీ సీతారాంనాయక్, జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డితో కలిసి స్వీకరించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ముఖ్య అతిధులకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి చందూలాల్ జిల్లా ప్రగతి నివేదికను సమర్పించారు. పాలనను ప్రజలకు మరింత చేరువగా చేసే లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి 1 అక్టోబర్ 2016న నూతన జిల్లాలను ఏర్పాటు చేసిందన్నారు.

జిల్లాలోని 239 తండాలను గ్రామ పంచాయతీలుగా, తొర్రూరు, డోర్నకల్, మరిపెడలను మునిసిపాలిటీలుగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉంటే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం రూ.30 కోట్ల వ్యయంతో 32 ఎకరాల స్థలంలో సమీకృత భవన సముదాయాన్ని ఏర్పాటు చేసేందుకు, జిల్లా ఎస్పీ కార్యాలయ నిర్మాణం కోసం 13 ఎకరాల స్థలంలో నిర్మించేందుకు పనులు చేపట్టిందన్నారు. వ్యవసాయ రంగం బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు సంక్షేమం కోసం ‘రైతుబంధు’ కార్యక్రమం ప్రారంభించి జిల్లాలోని 1.25లక్షల మంది రైతలుకు రూ.4వేల చొప్పున రూ.120కోట్ల పంట పెట్టుబడిని అందజేసిందన్నారు. జిల్లాలోని 8381 ఆర్‌ఓఎఫ్‌ఆర్ సాగు రైతులకు రూ.10.71కోట్ల పెట్టుబడి సహాయాన్ని అందజేయడం జరిగిందన్నారు. రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో పాటు ఆగష్టు 15 నుండి రాష్ట్రంలోని ప్రతి రైతుకు రూ.5లోల బీమాను వర్తింపజేయనున్నామని తెలిపారు. మిషన్ కాకతీయ కింద మూడు దశల్లో రూ.304కోట్ల వ్యయంతో 800 చెరువులను పునరుద్దరించడం జరిగిందని, రూ.84 కోట్ల వ్యయంతో 196 చెరువుల పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో రూ.32కోట్లతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్ 2 కొరకు 340 ఎకరాల భూసేకరణ చేశామన్నారు.
కేసీఆర్ కిట్, అమ్మ ఒడి తదితర పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ పేదల వైద్యంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టిపెట్టడంతో ప్రభుత్వ ఆసుప్రతుల్లో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. కేసీఆర్ కిట్ పథకం ద్వారా నాలుగు విడతలుగా రూ.12వేలు చెల్లిస్తున్నామని, ఆడ శిశువును ప్రసవించిన తల్లికి ప్రోత్సాహకంగా మరో వేయి రూపాయలు అదనంగా చెల్లిస్తూ నవజాత శిశువుకు 16 రకాల వస్తువులతో కూడిన రూ.2వేల కిట్‌ను అందించడం జరుగుతుందన్నారు. ప్రతి వ్యక్తికి విద్యను అందించాలనే లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చి విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడం జరుగుతుందని, జిల్లాలోని 1220 ప్రభుత్వ పాఠశాలల్లో 1.79లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, యూనిఫాం అందజేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులు చేసిన నృత్యాలు చూపరులను అలరించాయి. వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించి స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, జేసీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్, మునిసిపల్ చైర్‌పర్సన్ భూక్య ఉమామురళినాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు,విద్యార్దులు,ప్రజలు పాల్గొన్నారు.