Friday, March 29, 2024

మండు వేసవిలోనూ 24 గంటల నాణ్యమైన విద్యుత్

- Advertisement -
- Advertisement -

* రెండింతలు పెరిగిన విద్యుత్ కనెక్షన్లు
* దేశంలోనే కరెంట్ కోతలు లేని రాష్ట్రం తెలంగాణ
* నిత్య కోతల నుంచి నిరంతర వెలుగులు
* విద్యుత్ రంగంలో అద్భుత పురోగతి
* ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
నాగర్‌కర్నూల్: మండు వేసవిలో కూడా అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని నాగర్‌కర్నూల్ శాసన సభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా స్థానిక సాయి గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో విద్యుత్ శాఖ ప్రగతిపై ఉత్సవాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, జెడ్పి చైర్‌పర్సన్ శాంత కుమారితో కలిసి జ్యోతి ప్రజ్వలనతో విద్యుత్ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణ సాధించిన ప్రగతిపై 21 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పయనిస్తుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో రైతులకు, ప్రజలకు నిరంతర విద్యుత్ అందుతుందని, అదే విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, కుల వృత్తుల వారికి విద్యుత్ అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ సరఫరాలో ముందుందని, విద్యుత్ కనెక్షన్లు రెండింతలు పెరిగాయని, దీంతో విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు.

తెలంగాణ విద్యుత్ ప్రగతి నిత్య కోతల నుంచి నిరంతర వెలుగుల ప్రస్థానానికి చేరుకుందని, రాష్ట్రం ఏర్పడిన నాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ విద్యుత్తు రంగంలో అద్భుత రీతిలో పురోగతి సాధించి దేశానికి దారి చూపే టార్చ్ బేరర్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. కరెంట్ కోతలు, పవర్ హాలీడేలు, కరెంట్ కోసం ధర్నాలు, సబ్‌స్టేషన్ల ముట్టడి, రాస్తారోకోలు 2014కు పూర్వం నిత్యకృత్యాలుగా ఉండేవని తెలంగాణ ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ అకుంఠిత దీక్షతో కరెంట్ నిరంతరాయంగా వెలుగులు పంచుతుందన్నారు. యావత్ భారత దేశంలో కరెంట్ కోతలు లేని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, ఉద్యోగులు కష్టపడుతూ రాష్ట్రంలో వెలుగులు నింపుతున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం విద్యుత్ సరఫరాలో ముందుందని, తెలంగాణ రాకముందు కరెంట్ కష్టాలు ఉండేవని ప్రస్తుతం నిరంతర విద్యుత్ సరఫరా అవుతుందని కలెక్టర్ తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్లకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాల కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. దేశంలోనే విద్యుత్ సరఫరాలో ఉచిత విద్యుత్ అందజేయడంతో మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ తెలిపారు.

జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శాంత కుమారి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన విద్యుత్‌ను నిరంతరం అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రజలు మద్ధతు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్‌పర్సన్ కల్పన, విద్యుత్ ఎస్‌ఈ నీలావతి, విద్యుత్ శాఖ ఈఈలు, డిఈలు, ఏఈలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, పారిశ్రామిక వాదులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News