Home జాతీయ వార్తలు అయ్యప్పను దర్శించుకున్న 246 మంది భక్తులు

అయ్యప్పను దర్శించుకున్న 246 మంది భక్తులు

246 devotees visited Sabarimala temple
మాస్కులు, టెస్ట్ రిపోర్టులు తప్పనిసరి

శబరిమల(కేరళ): కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా గడచిన ఆరు నెలలకు పైగా మూతపడిన ప్రఖ్యాత అయ్యప్ప ఆలయం శనివారం భక్తుల దర్శనార్థం తెరుచుకుంది. శుక్రవారం సాయంత్రం మాస పూజల నిమిత్తం ఆలయం తెరుచుకుంది. అక్టోబర్ 21 వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ప్రతి రోజు 250 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించాలని ట్రావన్‌కోర్ దేవస్వామ్ బోర్డు నిర్ణయించగా శనివారం దర్శనానికి వర్చువల్ క్యూ విధానం ద్వారా 246 మంది బుక్ చేసుకున్నారు. దర్శనానికి వచ్చిన వారు కొవిడ్-19 నెగటివ్ సర్టిఫికెట్ చేతిలో పట్టుకుని ముఖానికి మాస్క్ వేసుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కాగా నెగటివ్ టెస్ట్ రిపోర్టు చేయించుకోని వారికి నిలక్కల్ వద్ద ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నిర్వహించి దర్శనానికి అనుమతిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన తర్వాత అయ్యప్ప గుడిలో భక్తులను దర్శనానికి అనుమతించడం ఇదే మొదటిసారని దేవస్వామ్ బోర్డు వర్గాలు తెలిపాయి. 10-60 ఏళ్ల మధ్య వయస్కులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. సన్నిధానం, నిలక్కల్ లేదా పంబా వద్ద భక్తులు బస చేసేందుకు అనుమతించడం లేదు.

246 devotees visited Sabarimala temple