Home జాతీయ వార్తలు కొనసాగుతున్న కొవిడ్ విజృంభణ

కొనసాగుతున్న కొవిడ్ విజృంభణ

248779 New Corona Cases Reported in India

 

మరో 24,879 కొత్త కేసులు
తాజాగా 487 మంది మృతి
ఆ మూడు రాష్ట్రాల్లో ఆగని కరోనా ఉధృతి
తమిళనాడులో 14 రోజుల్లో 4 లక్షల టెస్టులు
ఢిల్లీలో 70 శాతం దరిదాపుల్లో రికవరీ రేటు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులుగా దేశంలో దాదాపు 24 వేల కొత్త కేసులు బయటపడుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా గడచిన 24 గంటల్లో కొత్తగా 24,879 కేసులు నమోదయ్యాయి. దేశంలో తొలిసారిగా ఒక్క రోజే 25 వేలమార్కుకు చేరడం గమనార్హం. దీంతో దేశం లో కరోనా బాధితుల సంఖ్య 7,67,296కు చేరుకుంది. అంతేకాకుండా దేశంలో నిన్న ఒక్క రోజే 487 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 4,76,377 మంది కోలుకోగా, 2,69,789 మంది చికిత్స పొందుతున్నారు. వైరస్‌నుంచి కోలుకున్న వారి శాతం 62.08గా ఉంది.

14 రోజుల్లో 4 లక్షల టెస్టులు
తమిళనాడులో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా ప్రతిరోజూ భారీగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది. గడచిన 14 రోజుల్లోనే దాదాపు 4 లక్షల టెస్టులు నిర్వహించింది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, అసోం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోను పెద్ద ఎత్తున కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఆ మూడు రాష్ట్రాల్లో ఆగని ఉధృతి
కాగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలో 6,603 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం బాధితుల సంఖ్య 2,23, 724కు చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు 9,448 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 198 మంది వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. ఇక తమిళనాడులో బుధవారం ఒక్క రోజే 3756 కేసులు బైటపడడంతో మొత్తం కేసుల సంఖ్య 1,22,350కి చేరుకుంది.వీరిలో 1700 మంది మృత్యువాత పడ్డారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా అక్కడ కొత్తా నమోదైన 2033 కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 1,04,864కు చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు 3,213 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఢిల్లీలో రికవరీ రేటు అధికంగా ఉంది. ఇప్పటివరకు కరోనా బాధితుల్లో దాదాపు 70 శాతం మంది కోలుకోవడం ఊరటనిస్తోంది.

248779 New Corona Cases Reported in India