Home తాజా వార్తలు 2724 కిలోమీటర్ల కొత్తరోడ్లు

2724 కిలోమీటర్ల కొత్తరోడ్లు

Errabelli-Dayaker-Rao

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(పిఎంజిఎస్‌వై) మూడో దశ కింద తెలంగాణ రాష్ట్రానికి 2724 కిలో మీటర్ల కొత్త రోడ్లు మంజూరు అయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే ఈ పథకం కింద రూ.2 వేల కోట్ల నిధులు రానున్నాయని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేసి అవసరమైన ప్రతి చోట రోడ్డు మార్గం అభివృద్ధి చేసేలా ప్రణాళిక రూపొందిస్తామన్నా రు. శుక్రవారం తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈసందర్భంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సాగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తీరుతెన్నులను అధికారులను అడి గి తెలుసుకున్నారు. సిఎం ఆదేశాలకు అనుగుణంగా ‘60 రోజుల ప్రణాళిక’ అమలుకోసం అన్ని విధాలుగా సిద్థం గా ఉండాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేలా అన్ని స్థాయిల అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు పునర్‌వైభవం తీసుకరావడంతో పాటు పచ్చని, పరిశుభ్రమైన పల్లె సీమల నిర్మాణమే లక్ష్యంగా సిఎం చేపట్టిన అరవై రోజుల ప్రణాళిక అమలుకు వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీరాజ్‌ను మరింత బలోపేతం చేసేందుకు సిఎం ఇప్పటికే తగు చర్యలు చేపట్టారన్నారు.
గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పంచాయతీరాజ్ శాఖకు వ్యవస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించారని తెలిపారు. ఇందులో భాగంగానే అవసరమైన పోస్టులను కొత్తగా మంజూరుచేశారన్నారు. 1956 తర్వా త పంచాయతీరాజ్ శాఖలో ఒకేసారి 312 పోస్టుల ను కొత్తగా ఎప్పుడూ మంజూరు చేసిన దాఖలాలు లేవని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి గుర్తుచేశారు. గ్రామాలు, గ్రామీణ వికాసంపై సిఎంకు ఉన్న శ్రద్ధ వల్లే పోస్టులు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రభుత్వం మంజూ రుచేసిన మొత్తం పోస్టులను భర్తీచేసేందుకు వీలుగా ప్రస్తు తం ఉన్న అధికారుల పదోన్నతుల జాబితాను వేగంగా తయారు చేయాలన్నారు. జెడ్‌పిసిఇఒ, డిప్యుటీ సిఇఒ, ఎంపిఒ, డిడిపిఒ, ఎంపిడిఒ, ఎంపిఒ పోస్టులకు అర్హులైన అధికారుల జాబితాను సిద్ధంచేసి పదోన్నతులు కల్పించాలని ఆదేశించారు. గ్రామ కార్యదర్శుల నుంచి పై స్థాయి వరకు అన్ని దశలలో పదోన్నతులు త్వరగా పూర్తి చేయాలన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా మన రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం కొనసాగుతోందన్నారు. గ్రామస్థాయిలో కచ్చితంగా 85శాతం మొక్కలను బతికించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హరితహారం విజయవంతం కోసం గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.
దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే అధికారులు చొరవ తీసుకున్న గ్రామాల్లో హరితహారంలో మంచి ఫలితాలు నమోదయ్యాయని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. గ్రామపంచాయతీల అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలను, దాతలను, ఎన్‌ఆర్‌ఐలను భాగస్వాములను చేయాలన్నారు. అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు ఉండేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. 2 వేల జనాభా, 5 వేల జనాభా, 10 వేల జనాభాకు అనుగుణంగా మూడు వేర్వేరు భవనాల నమూనాలను సిద్ధంచేయాలన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తం గా పంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందనేది అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే గ్రామపంచాయతీ పాలకవర్గాల్లో కో-ఆప్ష న్ సభ్యుల నియామకానికి మార్గదర్శకాలను ఖరారు చేయాలన్నారు.

గ్రామపంచాయతీకి అనుగుణంగా అభివృద్ధి కమిటీల నియామక ప్రక్రియపైనా చర్యలు మొదలుపెట్టాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో పరిశుభ్రత అనేది ముఖ్యమ, పారిశుద్ధ నిర్వహణకు మంచి ప్రణాళిక ఉండాలన్నారు. ఉపాధిహామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రూ.600కోట్లు రావాల్సి ఉందని, ఈ నిధు లు త్వరగా విడుదలయ్యేలా కేంద్ర అధికారులపై ఒత్తిడి తెద్దామన్నారు. ఆగస్టు 26న కేంద్ర ప్రభుత్వ తాగునీటి, పారిశుద్ధ్య శాఖ ఢిల్లీలో జల్ జీవన్ మిషన్ పథకంపై అన్ని రాష్ట్రాలతో సమావేశం నిర్వహిస్తోందని, రాష్ట్రం తరుపున సమగ్ర నివేదికను సిద్ధం చేయాల ని సూచించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కు సంబంధించి దేశానికి ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర విజయాలను వివరించేలా ఈ నివేదిక ఉండాలి’ అని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ ఎం.రఘునందన్‌రావు, మిషన్ భగీరథ ఈఎన్‌సి కృపాకర్‌రెడ్డి, పిఆర్ ఈఎన్‌సి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

2724 km of new roads