కొన్ని నెలల నిశ్శబ్దం తరువాత దేశంలో మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. మహారాష్ట్ర లోని థానేలో శనివారం కొవిడ్‌తో ఒకరు మృతి చెందారు. తీవ్రమైన డయాబెటిస్‌తో బాధపడుతున్న 21ఏళ్ల వ్యక్తి సహరుగ్మతలతో కల్వా లోని టిఎంసికి చెందిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆస్పత్రిలో శనివారం ఉదయం మృతి చెందారని టిఎంసి ప్రకటించింది. డయాబెటిస్ సంబంధిత సమస్యలతో ఆ వ్యక్తి గురువారం ఆస్పత్రిలో చేరారని, శుక్రవారం రాత్రి పరీక్షలో కొవిడ్ 19 సోకినట్టు తేలిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిరుద్ధ మాల్‌గావోంకర్ వెల్లడించారు. కొవిడ్ పరిస్థితిపై టీఎంసీ సమీక్షసమావేశం నిర్వహించింది. థానేలో మొత్తం 18 క్రియాశీల కొవిడ్ రోగులను గుర్తించడమైందని వీరిలో ఒకరు మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగతా వారు ఇంటివద్దనే ఐసొలేషన్‌లో ఉంటున్నారని టిఎంసి వివరించింది. వీరి పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది. ఢిల్లీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక , ఆంధ్ర వంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తాజాగా ఈ నెల కొవిడ్ కేసులు బయటపడ్డాయి.
మూడేళ్ల తరువాత మొట్టమొదటసాదేశ రాజధాని ఢిల్లీలో 23 కేసులు నమోదు కాగా బీజేపీ ప్రభుత్వం అప్రమత్తమై ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్లు, వాక్సిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఇప్పుడు వ్యాపిస్తున్న ఈ వేరియంట్ సాధారణమైన ఇన్‌ఫ్లుయెంజా వంటిదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆరోగ్య మంత్రి పంకజ్ సింగ్ సూచించారు. రోజువారీ ఇన్‌ఫ్లుయెంజా లైక్ ఇల్‌నెస్ (ఐఎల్‌ఐ), సివియర్ రెస్పిరేటరీ ఇల్‌నెస్ (ఎస్‌ఏ ఆర్‌ఐ) వంటి వివిధ రకాల శ్వాసకోశ వైరస్ కేసులను హెల్త్ డేటా ప్లాట్‌ఫారమ్‌లో అప్‌లోడ్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆస్పత్రులకు సూచించింది. ఢిల్లీఎన్‌సిఆర్ సిటీలు నొయిడా, ఘజియాబాద్‌ల్లో కూడా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. శనివారం నొయిడాలో 55 ఏళ్ల మొట్టమొదటి కొవిడ్ రోగిని గుర్తించారు. ఘజియాబాద్‌లో ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద గరిష్టంగా కేరళలో 273 కేసులు బయటపడ్డాయి. కేరళ లోని అన్ని జిల్లాల్లో పర్యవేక్షణ పెంచాలని ఆరోగ్యమంత్రి ఆదేశించారు. ఆస్పత్రుల్లో మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
జలుబువంటి లక్షణాలు కనిపించినా మాస్క్‌లు ధరించాలన్నారు. పొరుగున ఉన్న కర్ణాటకలో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. 35 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో హోస్కోట్‌కు చెందిన తొమ్మిది నెలల పసిపాప ఉంది. ఎవరైతే సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్ (ఎస్‌ఏ ఆర్‌ఐ) తో బాధపడుతున్నారో వారు పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. మహారాష్ట్రలో కొవిడ్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ముంబైలో ఇంతవరకు 95 కేసులు నమోదయ్యాయి. అయితే ఆస్పత్రుల్లో చేరిన వారు మాత్రం తక్కువగానే ఉన్నారు. 16 మంది మాత్రమే ఆస్పత్రి పాలయ్యారు. మహారాష్ట్ర లోని థానేలో గత మూడు రోజుల్లో 10 కేసులు నమోదయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో కేసులు పెరగకపోయినా, వ్యాక్సిన్లు, పిపిఇ కిట్లు, ట్రిపిల్‌లేయర్ మాస్క్‌లు, తదితర అవసరాలు తగినంతగా అందుబాటులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రులను ఆదేశించింది. కేసులు నమోదవుతున్నప్పటికీ, తీవ్రత తక్కువేనని ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అయినా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది.
కొవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ ఎన్‌బీ.1.8.1 ఎల్‌ఎఫ్7లను భారత్‌లో గుర్తించినట్టు ఇండియన్ సార్స్ కోవ్2 జీనోమిక్స్ కన్సార్టియం శనివారం వెల్లడించింది. ఎన్‌బీ 1.8.1 రకం కేసు ఏప్రిల్‌లో బయటపడగా, ఎల్ ఎఫ్ .7 కు సంబందించి నాలుగు కేసులు మేలో గుర్తించినట్టు తెలిపింది. అవి తమిళనాడు, గుజరాత్‌లో నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఆసియా దేశాలు మరీ ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్‌తోపాటు చైనా లోనూ కొవిడ్ 19వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి జేఎన్.1 వేరియంట్ , దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. జేఎన్.1ఉపరకాలైన ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ .1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్యశాఖ తెలిపింది. జ్వరం, ముక్కుకారడం, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం, వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, బాధితులు నాలుగు రోజుల్లో కోలుకుంటున్నారని వైద్య నిపుణులు వెల్లడించారు.