Home తాజా వార్తలు 275 కిలోల గంజాయి పట్టివేత

275 కిలోల గంజాయి పట్టివేత

Marijuana Seized

 

భద్రాద్రి కొత్తగూడెం : అక్రమంగా తరలిస్తున్న 275 కేజీల గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బస్టాండ్‌లో పట్టుకుని, నిందితులను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ కె.వినోద్ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ.. స్థానిక బస్టాండ్‌లో పక్కా సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించామని, సీలేరు బస్సులో భద్రాచలం వచ్చిన ఒరిస్సా రాష్ట్రం మల్కాజగిరి జిల్లాకు చెందిన వ్యక్తులు, మహారాష్ట్రకు చెందిన ఐదుగురికి ఈ గంజాయిని అప్పగిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు.

లెదర్ బ్యాగులు, చేతి సంచుల్లో ఈ గంజాయి ప్యాకెట్లు తరలిస్తున్నారన్నారు. ఒరిస్సాకు చెందిన వారు ఎనిమిది మంది కాగా అందులో ఇద్దరు మహిళలు ఉన్నారన్నారు. పట్టుబడ్డ గంజాయి 275 కేజీలు ఉంటుందని, దీని విలువ రూ.41,25,000 ఉంటుందని ఆయన వెల్లడించారు. స్మగ్లర్లు రెండు బృందాలుగా విడిపోయి చాకచక్యంగా పోలీసుల కళ్లుకప్పి తప్పించుకోడానికి ప్రయత్నించారని సిఐ తెలిపారు. భద్రాచలం వరకు ఒక బృందం తరలించగా, ఇక్కడి నుండి హైదరాబాద్ చేరవేయడానికి మరో బృదం ప్రయత్నించినట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరిలిస్తామన్నారు. గంజాయిని స్మగ్లింగ్‌ను ఉపేక్షించేది లేదని భద్రాచలంలో తనిఖీలు ముమ్మరం చేస్తామని సిఐ తెలిపారు.

275 kg of Marijuana Seized