Friday, April 19, 2024

నిందితులతో కుమ్మక్కు… 28 మంది అధికారులపై వేటు

- Advertisement -
- Advertisement -

28 Tihar jail officials have been suspended

న్యూఢిల్లీ : ఓ కేసులో నిందితులుగా ఉన్న వారితో కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలపై 28 మంది తీహార్ జైలు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఢిల్లీ లోని యునిటెక్ మాజీ ప్రమోటర్లు అజయ్ చంద్ర, సంజయ్ చంద్రలకు తీహార్ జైలు అధికారులు సహకరించారని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. దీంతో వారిపై చర్యలు తీసుకొని దర్యాప్తు చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఢిల్లీ జైళ్లశాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. తీహార్ జైలు 7 నంబరుకు చెందిన వారిలో మొత్తం 28 మంది అధికారులపై చర్యలకు ఉపక్రమించగా, మరో ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులను తొలగించినట్టు వెల్లడించింది. మరో ఇద్దరు అధికారులపై ఢిల్లీ ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది.

ఇళ్ల కొనుగోలు దారుల సొమ్మును దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన యునిటెక్ స్థిరాస్తి సంస్థ మాజీ ప్రమోటర్లు సంజయ్ చంద్ర, అజయ్‌చంద్రలతో అధికారులు కుమ్మక్కై వారు జైలు నుంచే వ్యాపార లావాదేవీలు చేసుకునేలా వీలు కలిగించారని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫిర్యాదు చేసింది. దీనిపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానా సీల్డు కవరులో ఇచ్చిన నివేదికను పరిశీలించిన న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం వారిపై చర్యలు తీసుకోవాలని అక్టోబర్ 6 న ఆదేశించింది. అనంతరం పూర్తి దర్యాప్తు చేపట్టాలని స్పష్టం చేసింది.అంతేకాకుండా జైలు నిర్వహణను మెరుగు పరిచేందుకు ఆస్థానా ఇచ్చిన సూచనలను అమలు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖకు సుప్రీం కోర్టు సూచించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో తాజాగా ఈ కేసులో మొత్తం 32 మంది అధికారులపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ కేసు నమోదు చేసింది.

అనంతరం వారిపై అవినీతి నిరోధక చట్టం , ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పేర్కొంది. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని ఢిల్లీ క్రైం బ్రాంచ్ వెల్లడించింది. ఇక జైల్లో ఉన్న యునిటెక్ ప్రమోటర్లు అక్కడి అధికారులతో కుమ్మక్కు అయ్యారని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వారిని తీహార్ జైలు నుంచి తొలుత ముంబయి ఆర్తూర్ రోడ్ జైలుకు తరలించారు. విచారణ సందర్భంగా జైలు అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం , సంజయ్ చంద్ర, అజయ్ చంద్రల ప్రవర్తనపై ఈడీ ఇచ్చిన నివేదికలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.న్యాయస్థాన ఆదేశాలను నిర్వీర్యం చేసే ఇలాంటి ఘటనలు తీవ్రమైన కలవరపెట్టే సమస్యలకు దారి తీస్తాయని పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News