Home ఎడిటోరియల్ జరగని 2జి కుంభకోణం?

జరగని 2జి కుంభకోణం?

edit

స్పెక్ట్రం2 కుంభకోణం నిందితులు అందరూ నిర్ద్దోషులని ప్రత్యేక సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వడంతో జరగని కుంభకోణంపై జరిగిన రాద్ధాంతాన్ని నిందితులు, సీనియర్ కాంగ్రెస్ వాదులు నిలదీస్తున్నారు. అసలు ఆ కుంభకోణమే లేనపుడు తామంతా ఆ కేసులో తప్పుడుగా ఇరికించబడ్డవారమేకదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆరేళ్ల నుంచి ఆ కుంభకోణంపై సాగుతున్న విచారణలకు సిబిఐ ప్రత్యేక కోర్టు గురువారం నాడు తెరదించుతూ, నిందితులందరినీ నిర్దోషులని ప్రకటించింది. ఈ కేసులో అభియోగాలను రుజువు చేయడంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఘోరంగా విఫలమైనట్లు ప్రత్యేక జడ్జి సాయిని ప్రకటించారు. ‘2జి కుంభకోణం’ అన్నది రెండవ జనరేషన్ స్పెక్ట్రం లైసెన్సుల జారీ కుంభకోణం హ్రస్వ నామం. మొబైల్ కమ్యూనికేషన్ పరిమిత డేటా లైసెన్సులు అవి. అసలు అటువంటి కుంభకోణం జరగనే లేదని తాజా తీర్పువల్ల స్పష్టమైంది.
2010లో అప్పటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ ఒక నివేదికలో దాని వివరాలు పొందుపరిచారు. ఆ విచారణ మూడు ప్రధాన కేసులపై సాగింది. వాటిలో రెండు సిబిఐ, ఒకటి ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఇడి)దాఖలు చేశాయి. అవి అప్పటి రాజకీయ నాయకులు, అధికారులు, ప్రభుత్వ సేవకులను నిందితులుగా పేరొన్నాయి. అప్పటి టెలికమ్ మంత్రి ఎ.రాజా, డిఎంకె ఎంపి ఎంకె కనిమొళి, అప్పటి టెలికాం కార్యదర్శి సిద్ధార్థ్థ బెహురా, రాజా ప్రయివేట్ కార్యదర్శి ఆర్‌కె చందోలియా, వ్యాపారవేత్తలు యునిటెక్‌కు చెందిన సంజయ్ చంద్ర, ఎస్సార్‌కు చెందిన రవి రూయా, రిలయన్స్‌కు చెందిన గౌతమ్ దోషి తదితరులపై ఈ కేసుల లో అభియోగాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ హయాంలో ఈ కేసులు దాఖలయ్యాయి.
లేని కుంభకోణంలో తమను తప్పుగా ఇరికించారని గురువారం ఈ తీర్పు వెలువడిన వెంటనే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేసుల నుంచి బయటపడ్డ నిందితులు విమర్శించారు. అప్పటి ప్రతిపక్షం బిజెపి ఆరోపణల ఆధారంగా ఈ కేసులు దాఖలయ్యాయి. ‘నేను చెప్పినది నిజం. అసలు అవినీతి జరగలేదు. నష్టం ఏమీ కలగలేదు. అది అబద్ధాల కుంభకోణం తప్ప అవినీతి కుంభకోణం కాదు. అప్పటి ప్రతిపక్షం బిజెపి, కాగ్ వినోద్ రాయ్ కలిసి అల్లిన కథ అది. రాయ్ దేశానికి క్షమాపణ చెప్పాలి’ అని కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబాల్ తీర్పు అనంతరం డిమాండ్ చేశారు. కోర్టు తీర్పును గౌరవించాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. యుపిఎ ప్రభుత్వంపై ఎటువంటి ఆధారాలు లేకుండా భారీ ఎత్తున విరుద్ధ ప్రచారం సాగిందని ఆయన అన్నారు. ప్రచారాలు అబద్ధమని రుజువైనందుకు మన్మోహన్ హర్షం ప్రకటించారు.
కేసులు కుట్ర అన్న కనిమొళి
ఈ వ్యవహారంలో ఎవరినీ గురిపెట్టి విమర్శించబోనని డిఎంకె ఎంపి కనిమొళి అన్నారు. అయితే కుట్ర ఉన్నదన్నారు. చాలామంది దీని వెనుక ఉన్నారని కూడా చెప్పారు. తాను ఆ కంపెనీకి 20 రోజుల పాటు డైరెక్టర్‌గా ఉన్నందుకే తనను నిందితురాలిని చేశారని, కంపెనీ ఒక్క బోర్డు సమావేశానికి కూడా తాను హాజరు కాలేదని ఆమె వ్యాఖ్యానించారు. చేయని తప్పుకు దోషిని చేయడం అన్నది తీవ్ర విషయమని, తప్పుడు అవినీతి ఆరోపణలు గుప్పించడం మరింత తీవ్ర విషయమని కనిమొళి ఘాటుగా విమర్శించారు. పాటియాలా కోర్టు భవన సముదాయం వెలుపలకు వస్తూ ఆమె ఈ వ్యాఖ్య చేశారు. ఈ కేసులో ఇదే ఆఖరి మాటా, కేసు ముగిసినట్లేనా అని అడిగితే న్యాయ నిపుణులు కాదన్నారు. తీర్పుపై అపీళ్లు ఉంటాయని తెలిపారు.
ఢిల్లీ హైకోర్టులో తీర్పుపై అపీలు చేస్తానని ఇడి ఈసరికే సూచన అందించింది. డిబి రియాల్టీ అండ్ స్వాన్ కంపెనీ వ్యవస్థాపకుడు షాహిద్ బల్వా అకౌంట్ నుంచి రూ.200 కోట్లు కనిమొలి డైరెక్టర్‌గా, షేర్ హోల్డర్‌గా ఉన్న కళైగ్నార్ టివికి బదిలీ కావడంపై ఇడి పరిశీలన జరిపింది. ఈ తీర్పుపై అపీలు చేసే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకొంటానని సిబిఐ ఒక పోర్టల్‌కు తెలిపింది. స్పెషల్ జడ్జి సాయిని తీర్పులో ఒకే ఒక్క వాక్యం ఉంది. ‘నిందితులందరినీ నిర్దోషులుగా విడిచిపెడుతున్నాను’ అన్న ఒకే ఒక వాక్యంతో ఆయన తీర్పు ముగిసింది. నిందితులపై అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ఆయన ఆ తర్వాత ప్రకటించారు.
మారుతూ వచ్చిన ప్రాసిక్యూటర్లు
2జి స్పెక్ట్రం కేటాయింపులో అవినీతి దొర్లిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారాల్లో రూ.1.76లక్షల కోట్ల నష్టం సంభవించిందని వినోద్ రాయ్ ఇచ్చిన కాగ్ నివేదిక నాడు తెలిపింది. ఇప్పుడా నివేదిక వివాదాస్పదమైంది. సిబిఐ చార్జిషీట్‌లో ఈ నష్టాన్ని రూ.20వేలు, రూ.30వేల కోట్లు పెంచింది. 2007 స్పెక్ట్రం లైసెన్స్‌ల మంజూరీలో భారీ నష్టం భారత టెలికాం రంగానికి కలిగిందన్నది ఈ వివాదం. 2001 స్పెక్ట్రం ధరలు మొదట వచ్చిన వారికి మొదట అన్న సూత్రం ప్రకారం లైసెన్స్‌లు ఇవ్వడంతో పెద్దమొత్తంలో నష్టం తేలింది.
అప్పటి ధరల ప్రకారం రూ.1500 కోట్లు, రూ.2000 కోట్లకు లైసెన్స్‌లు 2జి స్పెక్ట్రంకు ఇచ్చారన్నది ఆరోపణ. కొన్ని కంపెనీలకు మంచి చేయడం కోసం ఈ ధరలను అనుసరించారని అభియోగం. 2012లో సుప్రీం కోర్టు కాగ్ నివేదికను పరిగణనలోకి తీసుకొని 122 లైసెన్స్‌లను రద్దు చేసింది. అవన్నీ రాజా హయాంలో 2008 జనవరి 10 తర్వాత ఇచ్చినవి. అప్పట్లో ఏకపక్షంగా, రాజ్యాంగ వ్యతిరేకం గా లైసెన్స్‌లు ఇవ్వడంతో ఎస్టిలాట్ డిబి(స్యాన్ టెలికాం), యూనిటెక్, టాటా టెలీ సర్వీసెస్ లాభపడ్డాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. టెలికం శాఖ ఈ అవకతవకలకు బాధ్యులని పేర్కొంది. సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల విదేశీ పెట్టుబడులు స్తంభించి అనేక ఉద్యోగాలు నష్టపోవడం సంభవించింది. మార్కెట్ స్థిరీకరణ పేరుతో కంపెనీలు షట్‌డౌన్‌లు పాటించాయి. కొన్ని మూతపడ్డాయి. అందువల్ల కొన్ని బడా కంపెనీలు వేలకోట్ల రూపాయల నష్టపరిహారానికి దావా లు కూడా వేశాయి.                                                                                                                                                                                          * ఎస్.ఎస్