Home లైఫ్ స్టైల్ నమ్మకంతో కృషిచేస్తే విజయం తథ్యం

నమ్మకంతో కృషిచేస్తే విజయం తథ్యం

LFE

‘విజయం అంతిమం కాదు; అపజయం ప్రమాదం కాదు; కానీ ధైర్యంగా ముందుకు వెళ్లాలి’ అన్న మాట రుక్మిణి రాయర్ విషయంలో సరిపోతుంది. రుక్మిణి గృహిణిగా ఉంటూ యుపిఎస్‌సి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవటమే కాదు మొదటి
ప్రయత్నంలోనే ఆల్ ఇండియాలో 2వ ర్యాంకును సాధించింది. ఎన్నో కష్టాలను భరిస్తూ డిగ్రీలోను, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లోనూ గోల్డ్ మెడల్స్ సాధించింది. పోటీ పరీక్షల్లో ఇంత గొప్ప ప్రతిభ చూపిన ఈమె ఆరో తరగతి పరీక్షలో ఫెయిల్ అయింది. ఇది నమ్మదగినదిగా లేదు కదా!

రుక్మిణి రాయర్ తల్లిదండ్రులు రిటైర్డ్ డిప్యూటీ అటార్నీ అయిన హోషియార్‌పూర్, బలజిందర్‌సింగ్ రాయర్. ఈమె పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో జన్మించింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసి వద్ద సాక్రెడ్ హార్ట్ పాఠశాలలో బోర్డింగ్‌లో ఉంటూ చదువుకుంది. ఒక్కసారిగా ఇంటి వాతావరణం నుండి కొత్త వాతావరణంలోకి వెళ్లటం మూలంగా చాలాఏళ్లు ఒత్తిడి, ఆందోళనతో విద్యాభ్యాసం కొనసాగలేదు. ఫలితంగా ఆరోతరగతి తప్పింది. ఆమె మాట్లాడుతూ… నేను 4వ తరగతిలో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు బోర్డింగ్‌లో పాఠశాలలో చేర్పించారు. నేను ఆ వాతావరణంలో ఇమడలేకపోయాను. దాంతో ఆరో తరగతి ఫెయిలయ్యాను. నేను అంత గొప్పగా చదవకపోయినా ఫెయిలవ్వడంతో ఇంకొంచెం నిరుత్సాహ పడ్డాను. నేను నా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు చాలా భయపడ్డాను. నాలో నేను బాధ పడ్డాను. కానీ కొంతకాలానికి విచారించటం నా సమస్యకి పరిష్కారం కాదని తెలిపింది. విజయం సాధిస్తే మార్గం దానంతట అదే కనిపిస్తుంది అని తెలిసింది. కష్టపడి బాగా చదివితే విజయాన్ని సాధించవచ్చని, ఇతరులు చాలా గౌరవంగా చూస్తారని, ఆ విజయంతో చాలా మంది స్నేహితులవుతారని ఆమె తన అనుభవాలను పంచుకుంది. ఆ తర్వాత రుక్మిణి చదువు విషయంలో వెనుదిరిగి చూడలేదు. అమృతసర్‌లోని గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయంలో చేరింది. అక్కడ పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో సోషల్ సైన్స్‌స్ సబ్జెక్ట్‌లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ముంబయి నుండి గోల్డ్‌మెడల్ సాధించింది. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, మైసూరులోని ఆశోదయ, ముంబైలోని అన్నపూర్ణ మహిళా మండలి రుక్మిణిలోని అంతర్లీన సమస్యలను బయటపెట్టాయి. సామాజిక విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఈ సమస్యలనుండి ఉపశమనం పొందవచ్చని గ్రహించింది. హార్ష్ మందిర్ సామాజిక కార్యకర్తగా న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ ఈక్విటి స్టడీస్‌తో కలిసి పనిచేసింది. జామా మసీద్, యమున పుస్త ప్రదేశాలను మెరుగుపరిచింది. సంప్రదాయాలు, వాతావరణ పరిస్థితులును బట్టి ప్రజల సమస్యలు వేరువేరుగా ఉంటాయి. పంజాబ్, ఇంకా ఇతర మురికి ప్రదేశాలలో చాలామంది యువత మత్తు మందుల వాడకానికి బలవుతున్నారు. ఉత్తర భారతంలో ఉన్న ఆడపిల్లలకు ప్రాథమిక విద్య అత్యవసరమని ఒక ఇంటర్వూలో ఆమె చెప్పింది. ఇటువంటి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఖర్చుపెడుతోంది. ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతి రూపాయలో ఒక పది పైసలు మాత్రమే అవసారార్థులకు చేరుతోందని ఆమె అభిప్రాయపడింది. గ్రామీణ ఆరోగ్య పథకం, అంగన్వాడీ పథకం వారు సరిగ్గా అమలు చేయలేకపోతున్నారు. దాంతో పేదవారికి అవసరాలు తీరటం లేదంటోంది. తోటి స్నేహితులు అందరూ ప్రతిరోజూ 10,12 గంటలు చదివితే రుక్మిణి ఆరు గంటలే చదివింది. పరీక్ష 2011, జూన్‌లో అయితే ఆమె ఆగస్టు 2010 నుండి ప్రిపేర్ అయింది. ఇంకా ఒక సంవత్సరం సమయం ఉందనగా ఎన్‌సిఇఆర్‌టి బుక్స్‌ని తీసుకుని చదివింది. రోజూ క్రమం తప్పకుండా చదివేది. ఆమె స్నేహితులు రోజుకు ఎక్కువ గంటలు చదివాక విశ్రాంతి తీసుకునేవారు. ఆ సమయంలో చదివినది మర్చిపోయి దానిని తిరిగి చదువుకోవటానికి సమయం పట్టేది. అది గుర్తించిన రుక్మిణి పరీక్షల సమయం దగ్గరపడుతున్నప్పుడు ప్రతిరోజూ నిరాటంకంగా చదువుతాను కాబట్టి ఒత్తిడి ఉండదని గుర్తించింది.
ఫలితాలు తెలుస్తాయి అన్న రోజు కొంత ఒత్తిడికి గురయింది. కానీ పంజాబ్‌లోనే కాక మొత్తం దేశంలో గొప్ప పేరు గడించింది. ఆమెను అభినందిస్తూ, ఇమెయిల్స్, సమాచారాలు వచ్చాయి. ఆ సంవత్సరం అనేకమంది మహిళా అభ్యర్థులు విజయం సాధించారు. ఆడపిల్లలు గట్టి నమ్మకంతో కృషిచేస్తే విజయం సాధిస్తారని, ఒక్క అవకాశం ఇస్తే వాళ్లు వాళ్ల ప్రతిభను చాటుతారని చెప్పింది. సాంఘిక నేరాలైన భ్రూణ హత్యలు, ప్రాథమికమైన చదువు లేకపోవడం, వరకట్న హత్యలు వంటివి భవిష్యత్తులో నిర్మూలించటానికి కృషిచేయనున్నట్లు చెబుతోంది. యుపిఎస్‌సిలో ఓటమి చెందిన అభ్యర్థులకు, ఫెయిలైన విద్యార్థులకు ఆమె సందేశాన్ని ఇస్తూ… ఫెయిలవ్వటం అనేది తప్పుకాదు. ఇది ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యే. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని కష్టపడాలి. ఇష్టంగా కష్టపడితే జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొవచ్చు అని
చెబుతోంది రుక్మిణి.