Wednesday, April 24, 2024

‘అల్లుడు తెచ్చిన ఆపద’ బెంగళూరు భగ్గు

- Advertisement -
- Advertisement -

బెంగళూరులో అల్లర్లు.. పోలీసు కాల్పుల్లో ముగ్గురి మృతి

సోషల్ మీడియా పోస్టింగ్‌తో రెచ్చిపోయిన మూకలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై మూకల దాడి
డిజె హళ్లి పోలీసు స్టేషన్‌కు నిప్పుపెటిన దుండగులు
110 మందిని అరెస్టు చేసిన పోలీసులు
అల్లర్లకు పాల్పడవద్దని ముఖ్యమంత్రి యడియూరప్ప విజ్ఞప్తి

బెంగళూరు: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెందిన బంధువు ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగుపై ఆగ్రహించిన మూకలు హింసాకాండకు, అల్లర్లకు పాల్పడడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పులలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. పోలీసు కాల్పులలో ముగ్గురు మరణించారని, ఇక్కడి పులకేశి నగర్ వద్ద జరిగిన హింసాకాండకు సంబంధించి 110 మందిని అరెస్టు చేశామని నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ బుధవారం తెలిపారు. మతపరంగా సున్నితమైన ఒక సోషల్ మీడియా పోస్టింగ్‌పై మండిపడిన మూడకలు మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున అల్లర్లకు, హింసాకాండకు పాల్పడ్డాయి. ఈ అల్లర్లు బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసాన్ని, పోలీసు స్టేషన్‌ను మూకలు ధ్వంసంచేశాయి. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన నవీన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు సిపి తెలిపారు. ఎమ్మెల్యే అఖండ శీనివాస మూర్తి ఇంటిపైన, డిజె హళ్లి పోలీసు స్టేషన్‌పైన దాడులు చేయడం, అల్లర్లకు పాల్పడడాన్ని ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప ఖండించారు. అల్లర్లను, శాంతి భద్రత సమస్యలను సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

నేరస్థులపై కఠిన చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేశామని, హింసను అదుపుచేయడానికి చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. పోలీసులు, మీడియా సిబ్బంది, సామాన్య ప్రజలపై దాడులు క్షమించబోమని, అటువంటి దురుద్దేశపూరిత చర్యలను ప్రభుత్వం సహించబోదని ఆయన చెప్పారు. సోషల్ మీడియా పోస్టింగుతో రెచ్చిపోయిన వందలాది మంది మూకలు మంగళవారం రాత్రి విధ్వంసకాండకు పాల్పడి డిజె హళ్లి పోలీసు స్టేషన్‌పై దాడి చేసి నిప్పుపెట్టారు. పోలీసులు, ప్రైవేట్ వ్యక్తులకు చెందిన వాహనాలను దహనం చేశారు. ఎమ్మెల్యే మూర్తి, ఆయన సోదరికి చెందిన ఆస్తులను ధ్వంసం చేశారు. ఒక ఎటిఎంను కూడా ధ్వంసం చేశారు. మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. చివరకు కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతులలో ఒకరిని యాసిన్ పాషాగా గుర్తించారు.

కాగా, తన కుమారుడు అమాయకుడని, అదే ప్రాంతంలో మాంసం దుకాణం నడుపుతున్నాడని, డిన్నర్‌కు వెళ్లిన తన కుమారుడు పోలీసు కాల్పులలో మరణించాడని, హింసాకాండతో అతనికి ఎటువంటి సంబంధం లేదని యాసిన్ పాషా తండ్రి అఫ్జల్ మీడియా వద్ద వాపోయారు. పెద్ద గుంపుగా వచ్చిన బయటి వ్యక్తులు విధ్యంసానికి, హింసాకాండకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా.. డిజి హళ్లి, కెజి హళ్లి పరిసర ప్రాంతాలలో పోలీసులు కర్ఫూ విధించారు. హింసాకాండకు పాల్పడవద్దని ఎమ్మెల్యే మూర్తి ప్రజలకు పిలుపునిచ్చారు. కొందరు ఆకతాయిలు చేసిన తప్పు కారణంగా హింసకు పాల్పడవద్దని ముస్లిం సోదరులకు ఆయన విజ్ఞప్తి చేశారు. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్, శివాజీ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు.

3 died in Bengaluru Police shooting after Mob Attacks

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News