Home తాజా వార్తలు కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం

కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం

3 killed in accident on outer ring road at keesara

 

కీసర: కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు డివైడర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి చెందారు. మృతులు సైబర్ క్రైం ఎసిపి కెవిఎం ప్రసాద్ కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. కీసర ఇన్‌స్పెక్టర్ జె.నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… నగరంలోని మూసాపేట్‌కు చెందిన కార్యంపూడి బాలకృష్ణ మూర్తి (48) ఆయన భార్య రేణుక (42), కుమారుడు భాస్కర్ (21)తో పాటు వారి బంధువు కార్యంపూడి శంకరమ్మ (48)తో కలిసి కారు (టిఎస్07ఇ2673)లో ప్రకాశం జిల్లా చీరాలలో బంధువుల వివాహా వేడుకకు హాజరై తిరిగి మేడ్చల్‌కు ప్రయాణం అయ్యారు. సోమవారం తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో కీసర ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న వీరి కారు యాద్గార్‌పల్లి డిఆర్‌డిఒ అండర్ పాస్ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న రేణుక (42), శంకరమ్మ (48) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాలకృష్ణ మూర్తి (48) అతని కుమారుడు భాస్కర్ (21)లను 108 వాహనంలో ఇసీఐఎల్‌లోని శ్రీకర ఆసుపత్రికి తరలించగా, బాలకృష్ణ మూర్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదంలో మృతి చెందిన శంకరమ్మ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ సతీమణి కాగా బాలకృష్ణ మూర్తి ఆయన సోదరుడి కుమారుడిగా పోలీసులు తెలిపారు. ఈ మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

3 killed in accident on outer ring road at keesara