Friday, March 29, 2024

బోరుబావిలో బాలుడు

- Advertisement -
- Advertisement -

borewell

మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం పోడ్చన్‌పల్లి శివారుల్లో ఘటన

25 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్టు గుర్తింపు
ఆక్సిజన్ పైపుల ఏర్పాటు, రంగంలోకి ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు
బాలుడిని రక్షించే చర్యలు ముమ్మరం
చేయండి : సిఎం కెసిఆర్ ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్: మెదక్ జిల్లా పాపన్నపేట్ మండల పరిధిలో ని పోడ్చన్‌పల్లి గ్రామ శివారులో మూడు సంవత్సరాల సంజయ్‌సాయి వర్థన్ బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలాఉన్నాయి గ్రామానికి చెందిన మంగలి భిక్షపతి తన వ్యవసాయ భూమిలో మంగళవారం రాత్రి బోరుబావి పనులు ప్రారంభించాడు. అయితే 150 అడుగులు బోరు వేసినప్పటికీ నీరు రాకపోవడంతో తిరిగి బుధవారం ఉదయం నుండి మల్లీ బోరు బావిని తవ్వకం ప్రారంభించాడు. ఈ నేపత్యంలో రెండు బోరు బావులు వేసినప్పటికీ నీరు రాకపోవడంతో బోరు బావుల తవ్వకాలను నిలిపివేశాడు.

కాగా బోరుబావి గుంతలను పుడుస్తున్న క్రమంలో అక్కడే ఉన్న భిక్షపతి మనువడు మూడు సంవత్సరాల బాలుడు సంజయ్ సాయి వర్ధన్ ఆడుకుంటూ బోరుబావి గుంతలో పడడంతో గమనించిన కుటింబికులు బోరుబావి వద్ద కు వెళ్ళిచూడగా బాలుడి ఏడుపు వినిపించ సాగింది. దీంతో వెంటనే పాపన్నపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ ఆంజనేయులు, తహసీల్దార్ బలరాం లు సంఘటన స్థలానికి చేరుకుని బోరుబావి నుండి బాలుడు పడిపోయిన ఘటన వివరాలను ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మెదక్ జిల్లా ఎస్‌పి చందన దీప్తి, మెదక్ ఆర్‌డిఒ సాయిరాం సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు ప్రొక్లైనర్,108 వాహనాన్ని, అగ్ని మాపక వాహనాన్ని రప్పించి గుంత నుండి బాలున్ని కాపాడే ప్రయత్నం చేశారు. కాగా మంగలి భిక్షపతి కూతురు అయినా నవనీత, గోవర్ధన్‌ల ముగ్గురు కుమారులలో సంజయ్ సాయి వర్ధన్ మూడోవాడు. సంజయ్ సాయికి ఇద్దరు అన్నలు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ బాలుని బయటకు తీయడానికి హైదరాబాద్ నుంచి ఎన్ డి ఎ బృందాలను రప్పించామని తెలిపారు.

బోరుబావిలోకి ఆక్సిజన్

ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన సంజయ్‌సాయికి అధికారులు ఆక్సిజన్‌ను అందించే ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలో బాలుడిని వెలికి తీసేందుకు హైదరాబాద్‌నుంచి ప్రత్యేక బృందాలను కూడా రప్పించారు. ఘటనా స్థలానికి నాలుగు జెసిబిలను తరలించి బాలుడికి వెలికితీసే యత్నాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా ఎస్‌పి చందనాదీప్తి బోరుబావి వద్ద పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

బాలుడు సురక్షితంగా రావాలని ప్రార్థనలు

కళ్లముందే ఆడుకుంటూ వెళ్లిన సంజయ్‌సాయి వర్థన్ అనే బాలుడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతోతల్లి దండ్రులు తీవ్రఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడు క్షేమంగా బయటపడాలని అటు తల్లిదండ్రులు, గ్రామస్థులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. కాగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన మంగలి గోవర్ధన్ నవీనల మూడో కుమారుడు సాయి వర్ధన్. నాలుగు నెలల క్రితం పోడ్చన పల్లి గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి గోవర్ధన్‌కుటుంబ సమేతంగా వచ్చారు.మామ మంగలి బిక్షపతి చెందిన రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కుటుంబ సమేతంగా చూడటానికి వెళ్లిన సమయంలో నీరులేని బోరు బావిలో సంజయ్‌సాయి వర్థన్ ప్రమాదవశాత్తు పడిపోయాడు.

ముమ్మరంగా సహాయక చర్యలు

బోరుబావిలో పడిన సంజయ్ సాయి వర్ధన్‌ను రక్షించేందుకు బుధవారం సాయంత్రం నుంచే అధికారులు సహాయ చర్యలు ప్రాంభించారు. కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్‌పి చందన దీప్తి, ఆర్‌డిఒ సాయిరాం, పాపన్నపేట తహసీల్దార్ బలరాం సహాయక పనులను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.జెసిబిలు, రెండు క్రేన్లు, మూడు అంబులెన్సులు, రెండు ఫైరింజన్లు ఘటనాస్థలం వద్ద సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉంచారు. ఈక్రమంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌నుంచి ప్రత్యేక బృందాలు బోరుబావి ఘటన స్థలానికి తరలివెళ్లాయి.

25 ఫీట్ల లోతులో బాలుడు

బోరుబావి లోతు 150 ఫీట్ల వరకు ఉంటుందని, సంజయ్ సాయి వర్ధన్‌కు ఆక్సిజన్ అందించేందుకు పైపును బోరుబావిలోకి పంపిచగా 25 ఫీట్ల లోతులోనే ఆగిపోయినట్టు వెల్లడించారు. సాయివర్ధన్ 25 ఫీట్ల లోతులోనే ఉన్నట్టు ప్రాథమిక అంచనాకొచ్చినట్టు పేర్కొన్నారు. బోరుబావి చుట్టూ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు బాలుడిని సురక్షింతంగా బయటకు తీసేందుకు యత్నాలు సాగిస్తున్నారు.

అనుమతి లేని బోర్లతో అనర్థం

గ్రామంలో అనుమతి లేని బోర్లు వేస్తుండటం వల్ల అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. పోడ్చన్‌పల్లిలో ఒక్కరోజేమూడు బోర్లు వేసి నీళ్లు పడకపోవడంతో అలాగే వదిలేసినట్టు తెలుస్తోంది. మే మాసంలో పోడ్చన్‌పల్లిలో ఇప్పటికే 19 బోర్లు వేశారని, వేటికీ అనుమతులు తీసుకోలేదని అధికారులు చెప్తున్నారు. గతంలో ఉమ్మడి మెదక్‌జిల్లాలో చిన్నారులు బోరుబావిలో పడిన ఘటనలు వరసగా.. 2008, 2011, 2015 సంవత్సరాల్లో మూడు చోటు చేసుకున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

బాలుడిని రక్షించే చర్యలు ముమ్మరం చేయండి- అధికారులకు సిఎం కెసిఆర్

హైదరాబాద్ : మెదక్ జిల్లా పోడ్చన్‌పల్లిలోని బోరుబావిలో మూడేళ్ల బాలుడు పడ్డ ఘటనపై సిఎం కెసిఆర్ స్పందిస్తూ బాలుడిని రక్షించడంలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులకు సిఎం ఆదేశించారు. బోరు బావిలో బాలుడి పడిపోయిన ఘటనను పద్మా దేవేందర్ రెడ్డి సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈక్రమంలో పల్లె ప్రగతిలో బోర్లు అన్నీ మూసేయాలని చెప్పామని అయినా ఎందుకు మూసేయలేదని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇదే ఘటనపై మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

మంత్రి హరీష్‌రావు మానిటరింగ్

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో బాలుడి రెస్క్యూ ఆపరేషన్‌ను మంత్రి హరీశ్‌రావు మానిటర్‌చేస్తున్నారు. బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు అన్ని రకాల సహాయ చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్‌నుంచి రెస్క్యూ, ఎన్‌డిఆర్‌ఎఫ్ నిపుణులను రప్పించాలని ఆదేశించారు. బోరుబావుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే బోరుబావుల యజమానులపై చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News