Home జాతీయ వార్తలు సబ్ ఠీక్ హై …నా….

సబ్ ఠీక్ హై …నా….

30 cr people in India to get vaccinated next 5 months

 

కొవిడ్ టీకాలపై జనం ఊగిసలాట
ఏడాది చూద్దామంటున్న అత్యధికులు
వస్తూనే వేసుకుంటామన్న కొందరు
విదేశాలలో పరిణామాలపై ఆరాలు
వైరస్‌ను మించి సాగుతున్న ప్రచారాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ టీకాల రావడానికి మరికొద్ది గంటలే ఉండటంతో ఇప్పుడు ఓ వైపు కొండంత ఆశ, మరో వైపు దీని ఫలితం ఏమిటనే ఆందోళన నెలకొంటోంది. ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో అతి భారీ స్థాయి సామూహిక వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో ఈ నెల 16వ తేదీ నుంచి భారతదేశంలో చేపడుతున్నారు. ఇందులో భాగంగా ముందు తొలి దశలో 3 కోట్ల మంది కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు దీనిని వేస్తారు. తరువాత కొద్ది నెలల కాలంలోనే కనీసం 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయాలని సంకల్పించారు. ఇందుకోసం ఇప్పటికే రెండు ప్రఖ్యాత వ్యాక్సిన్లు కొవిషీల్డ్, కొవాగ్జిన్‌లు సిద్ధం చేశారు. త్వరలోనేమరో నాలుగు టీకాలు కూడా అందుబాటులోకి వస్తాయని ప్రధాని మోడీ ఇటీవలే తెలిపారు. అయితే ఇప్పటికీ అంతుచిక్కని రీతిలో ఉన్న వైరస్ కరోనా, దీనికి ప్రపంచవ్యాప్తంగా సరైన వైద్య చికిత్సా ప్రక్రియ లేదనే వాదనల మధ్య, అసలు ఇది వికటిస్తుందా? లేక ఫలిస్తుందా? అనే వాదనల మధ్య జనం కొట్టుమిట్టాడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే బ్రిటన్ అంతకు ముందు అమెరికాలో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టారు. అయితే ఫైజర్, కొవిషీల్డ్‌కు సంబంధించి వీటిని తీసుకున్న వారిలో అవలక్షణాలు తలెత్తడం , చాలా మందిలో వీటి సమర్థత దాఖలాలు కన్పించకపోవడం చర్చనీయాంశం అయింది. అమెరికా, బ్రిటన్‌లలో మీడియా ఎప్పటికప్పుడు ఈ వ్యాక్సిన్‌ల పంపిణీల క్రమంలో తలెత్తుతున్న పరిణామాలను వీడిని నీడలా వెంటాడుతూ నిఘా ఉంచి ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితులను తెలియచేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్‌లను సరైన సమర్థతా నిర్థారణలు లేకుండానే ప్రభుత్వాలు కేవలం కంటితుడుపుగా, అంతకు మించి తమ పరువు దక్కించుకునేందుకు హడావిడిగా తీసుకువచ్చాయని విమర్శలు తలెత్తాయి. దీనితో ఇప్పుడు వైరస్ వ్యాక్సిన్‌ల విషయం వివాదాస్పదం అయింది. ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్కచోట తలేత్తే వ్యాక్సిన్ అపనమ్మకం అయినా, ఇతర దేశాలలో వ్యాక్సిన్ పంపిణీపై ప్రభావం చూపుతుంది.

ప్రత్యేకించి ఇంతకాలం వివిధ ఔషధాల ఉత్పత్తిలో ఉంటూ ఎంతో ప్రచారం పొందిన సంస్థలు ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయి ప్రమాణికతకు అనేక విధాలైన పరీక్షలకు దిగుతాయని, ఈ విధంగా వ్యాక్సిన్ పంపిణీలో ఇప్పటి వేగం మందగిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్లు తీసుకుంటారా? లేదా అనే అంశంపై సర్వేలు నిర్వహించారు. ఈ క్రమంలో 28 దేశాలలో జరిపిన అధ్యయనాలలో అత్యధికులు తామైతే ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ జోలికి పోదల్చుకోలేదని చెప్పినట్లు వెల్లడైంది. ఇంతకు ముందు చాలా మంది వ్యాక్సిన్ రావాలని రాగానే దీనిని స్వీకరించి కరోనా నివారణ పొందుతామని చెపుతూ వచ్చారు. రష్యా వంటి దేశాలలో ఇప్పుడు వ్యాక్సిన్ స్వీకరణలో తటపటాయింపులు ఎక్కువ అయ్యాయి. కేవలం 15 శాతం మందే తాము వ్యాక్సిన్ తీసుకుంటామని తెలిపారు. ఓ ఏడాది చూసి అప్పుడు వ్యాక్సిన్ పొందుతామని చెప్పిన వారు 25 శాతం మంది వరకూ ఉన్నారు.

అమెరికా, ఇండియాల్లో వ్యాక్సిన్ల వైపు మొగ్గు
కరోనా తీవ్రత ఇప్పటికీ ఉన్న అమెరికాలో 59 శాతం మంది ప్రజలు తాము ఏడాదిలో వ్యాక్సిన్ తీసుకుని తీరుతామంటున్నారు. అయితే 33 శాతం తాము వ్యాక్సిన్ రావడమే సంతోషమని వెంటనే దీనిని తీసుకుంటామని తెలిపారు. ఇండియాలో అత్యధిక శాతం ప్రజలు వ్యాక్సిన్‌పై ఆశలు పెట్టుకున్నారు. 51 శాతం మంది వరకూ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి రాగానే తీసుకుంటామన్నారు. ఇక 29 శాతం మంది ఏడాది వరకూ చూస్తామన్నారు. అన్ని దేశాలతో పోలిస్తే బ్రిటన్‌లోనే ముందుగా వ్యాక్సిన్ల వాడకానికి అధికారిక అనుమతి దక్కింది. బ్రిటన్ ప్రభుత్వం వ్యాక్సిన్ల తయారీ విషయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. సహకారం అందించారు.

ఏ వ్యాక్సిన్‌లో ఏమున్నదో
ఇప్పటికిప్పుడే వ్యాక్సిన్ తీసుకోవడం రిస్కే అని తృప్త వాసుదేవ్ అనే మహిళ తెలిపింది. ఏడాది పోనిచ్చిన తరువాత తీసుకుంటానని చెప్పింది. వ్యాక్సిన్లు సురక్షితం అని ఎట్లా తేలుతుంది. ఇప్పటివరకూ వ్యాక్సిన్లు రావడానికి ఏండ్లు పడుతుందని చెపుతూ వచ్చారని, కానీ ఇప్పటికిప్పుడు ఇన్ని వ్యాక్సిన్లు పోటాపోటీగా రావడం ఏమిటని ప్రశ్నించారు. ముందు ఇండియాలో ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ తీసుకునే వారు తీసుకోనివ్వండని తరువాత తమలాంటి వారు తీసుకుంటారని తేల్చిచెప్పారు.

వ్యాక్సిన్లపై సానుకూల ప్రచారం
కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లకు సంబంధించి పెద్ద ఎత్తున సహేతుక ప్రచారానికి సంకల్పించింది. వదంతులను నమ్మవద్దని పిలుపు నిచ్చింది. వ్యాక్సిన్ తీసుకుని ఆరోగ్యం పొందే వారి మాటను ప్రచారం చేయదల్చుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ దిశలో ఏర్పాట్లు చేసుకుంది. వాట్సాప్ సందేశాల ద్వారా సరైన వాతావరణ కల్పనకు రంగం సిద్ధం చేశారు. వాట్సాప్ గ్రూప్‌లు, సంఘాలు సంస్థలు, స్వయం సహాయక బృందాలు, పేరెంట్ గ్రూప్‌లు, స్కూళ్లు ఇతరత్రా మాధ్యమాల ద్వారా వ్యాక్సిన్‌ల పట్ల భయాలు పొగొట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

అతి పెద్ద స్థాయిలో జరిగే ఈ సామూహిక వ్యాక్సిన్‌కు సంబంధించి ముందుగా కావల్సింది కేవలం విశ్వాస పునరుద్ధరణనే అని అంతా తేల్చిచెపుతున్నారు. ముందు వ్యాక్సిన్లపై నమ్మకం ఏర్పడితే వీటి ఫలితాలు సవ్యంగా ఉన్నాయని తేలితే ప్రజలంతా కూడా వ్యాక్సిన్లను తీసుకుని తీరుతారని, వ్యాక్సిన్ బాగా పని తీరు బాగుంది అని కానీ లేదా దీనికి విరుద్ధంగా ఇది ఇబ్బందికరమే అనే అంశాలలో ఏది ప్రచారం పొందిన క్షణాలలో దేశవ్యాప్తంగా అది వ్యాపిస్తుంది. ప్రచారంలో ఉండే అంశాలనే జనం బాగా విశ్వసించే మానసికత భారతీయులలో ఉండటంతో వచ్చే కొద్ది రోజులలో వ్యాక్సిన్ల భవిత ఏమిటనేది తేలడానికి వీటి గురించి జరిగే ప్రచారమే ఆయువుపట్టు అవుతుంది.

30 cr people in India to get vaccinated next 5 months