Home తాజా వార్తలు వాయిదా వేయండి

వాయిదా వేయండి

 30 lakh votes lost

ఎన్నికల కమిషన్‌ను కోరిన విపక్షాలు
సత్వరమే ఎన్నికలు : టిఆర్‌ఎస్, ఎంఐఎం

ఇసికి టిఆర్‌ఎస్, ఎంఐఎం వినతి
వేర్వేరు కారణాలతో వాయిదా కోరిన విపక్షాలు
తప్పుల తడకగా ఓటర్ల జాబితా :

బిజెపిఆ ఏడు మండలాలపై గందరగోళం ఉంది :

సిపిఐ 30 లక్షల ఓటర్లు తగ్గారు : సిపిఎం
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగాలి : బిఎస్‌పి
మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీ రద్దు కావడంతో సత్వరం ఎన్నికలు జరగాల్సిన రాజకీయ అనివార్యత ఉందని అధికార టిఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు అభిప్రాయపడగా, మిగిలిన విపక్ష పార్టీలన్నీ రకరకాల కారణాలను చూపి వాయిదా వేయాలని కోరాయి. ఓటర్ల జాబితాలో లోపాల్ని సవరించకుండా, ఏడు మండలాలపై స్పష్టత రాకుండా తొందరపడి ఎన్నికలు నిర్వహించడం మంచిది కాదని విపక్ష పార్టీలు వ్యాఖ్యానించాయి. రాష్ట్రంలో గుర్తింపు పొందిన తొమ్మిది రాజకీయ పార్టీల ప్రతినిధులతో కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం మంగళవారం రాత్రి సమావేశమై అభిప్రాయాలను తెలుసుకునే క్రమంలో టిఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు మినహా మిగిలినవన్నీ ఎన్నికల నిర్వహణకు తొందరపాటు తగదని వ్యాఖ్యానించాయి. కేంద్ర బృందం ఒక్కో పార్టీ తరఫున విడివిడిగా అభిప్రాయాలను తెలుసుకుంది. బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని బహుజన్ సమాజ్ పార్టీ వ్యాఖ్యానిస్తే, ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని బిజెపి, పోలవరం ముంపు ప్రాంతం పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఏడు మండలాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని సిపిఐ, గత ఎన్నికల సందర్భంగా ఉన్న ఓటర్ల జాబితాతో పోలిస్తే సుమారు 30 లక్షల మంది ఓటర్లు తగ్గారని సిపిఎం& ఇలా ఒక్కో పార్టీ ఒక్కో రకమైన అభిప్రాయాన్ని వెల్లడించింది. కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందం సచివాలయంలో తొమ్మిది పార్టీల ప్రతినిధులతో విడివిడిగా చర్చలు జరిపింది.
ఓటర్ల జాబితా తప్పుల తడక : బిజెపి
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు సక్రమంగా జరగాలంటే ఓటర్ల జాబితా సరిగ్గా ఉండాలని, రాష్ట్ర సిఇఓ కార్యాలయం రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలోని వివరాలు మూడు నియోజకవర్గాలకు తప్ప ఎక్కడా సరిగ్గా లేదని కమిటీకి చెప్పినట్లు బిజెపి తరఫున హాజరైన ఇంద్రసేనారెడ్డి మీడియాకు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని, 15 రోజుల్లో ఈ లోపాలన్నింటినీ సరిదిద్దడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని తేల్చి చెప్పినట్లు పేర్కొన్నారు. ముసాయిదా జాబితాలోని తప్పులను సరిచేయకుండా తుది జాబితాను ఖరారుచేయడం సరైంది కాదన్నారు. ఇంటి నెంబర్లను పేర్కొనకుండా ‘పాత ఇళ్ళు’ అంటూ వందల సంఖ్యలో ఓటర్ గుర్తింపు కార్డులు కూడా వచ్చాయన్నారు. హైదరాబాద్ నగరంలో చాలావరకు ఓటర్ల జాబితా తప్పుగా ఉందని, ఇందుకు సంబంధించి ఆధారాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘ బృందానికి వివరించామన్నారు. హైదరాబాదులో 13న వినాయక చవితి, 23న నిమజ్జనం, మధ్యలో 21న మొహరం ఉత్సవాలు వస్తున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని నిమజ్జనం తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించాలని, ఆ తర్వాత పదిహేను రోజులు కొత్త ఓటర్ల పేర్ల నమోదుకు గడువు ఇవ్వాలని ఆ బృందాన్ని కోరినట్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కమిటీ సానుకూలంగా స్పందించిందన్నారు. బిజెపి తరఫున హాజరైన ప్రతినిధి బృందంలో వెంకట్ మల్లారెడ్డి, అమర్‌నాధ్ ఉన్నారు.

నాలుగు వారాల్లో పూర్తిచేస్తారా : మర్రి
నాలుగు మాసాల్లో పూర్తి చేయాల్సిన ఎన్నికల ప్రక్రియను నాలుగు వారాల్లోనే ఎలా పూర్తి చేస్తారని కేంద్ర ఎన్నికల ప్రత్యేక బృందాన్ని ప్రశ్నించామని కాంగ్రెస్ తరఫున హాజరైన మర్రి శశిధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో, ఎప్పుడు ఫలితాలు వస్తాయో షెడ్యూలు ప్రకారం వివరించాల్సింది ఎన్నికల సంఘం అయినప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆరే అన్ని వివరాలనూ మీడియాకు తెలిపారని, ఇదెలా సాధ్యమని, ఎన్నికల సంఘానికున్న పవిత్రత ఇదేనా అని ప్రశ్నించినట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోయిన పేర్ల గురించి ప్రశ్నించామని, ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన తర్వాత జరగాల్సిన సవరణలు డీ లిమిటేషన్ ఉత్తర్వులకు అనుగుణంగా జరగాల్సి ఉంటుందన్న అంశాన్ని కూడా వివరించి హోంశాఖ ఉత్తర్వులు సరిపోవని, రాజ్యాంగ సంక్షోభం ఎదురవుతుందని వివరించినట్లు తెలిపారు. ఓటర్ల జాబితా పూర్తయ్యేంత వరకు 2019 జనవరి జాబితాను మళ్ళీ పునరుద్ధరించాలనికోరినట్లు తెలిపారు.
ఎవరికి ఓటు వేయాలి : వైఎస్‌ఆర్‌సిపి
పోలవరం ముంపు మండలాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఏడు మండలాల ఓటర్లు ఎవరికి ఓటు వేయాలని కేంద్ర ఎన్నికల బృందాన్ని ప్రశ్నించినట్లు వైఎస్‌ఆర్‌సిపి తరఫున హాజరైన శివకుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కొత్తగా ఉనికిలోకి వచ్చిన 21 జిల్లాల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది లేరని, తొందరగా ఎన్నికలు జరపాలనే హడావిడి కోసం ప్రత్యేక సవరణ ప్రక్రియను ఆపడం సరైంది కాదని అన్నారు. అసెంబ్లీకి మెజారిటీ ఉన్నా రద్దు చేయడం వెనక కారణాలు చెప్పాలని అన్నారు. సరైన యంత్రాంగమే లేనప్పుడు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించడంతో పాటు ఒక్కో అసెంబ్లీకి రూ. 15 కోట్లు ఖర్చుచేసే అవకాశం ఉందన్న అంశాన్ని కూడా వివరించామని తెలిపారు. ఒక రహస్య ప్రయోజనం కోసమే ఎన్నికలు వచ్చాయని వ్యాఖ్యానించారు.
30 లక్షల ఓటర్లు తగ్గారు : సిపిఎం
గత ఎన్నికలనాటి ఓటర్ల జాబితాతో పోలిస్తే ఇప్పుడు రూపొందించిన ముసాయిదా జాబితాలో దాదాపు 30 లక్షలు ఓటర్లు తగ్గారని, ఇందుకు కారణాలు చెప్పాలని ప్రశ్నించామని సిపిఎం నాయకుడు నర్సింగ్‌రావు మీడియాకు వివరించారు. ఎందుకు తగ్గాయి, దానికి కారణాలేంటో అడిగామని పేర్కొన్నారు. గతంలో ముసాయిదా జాబితాతో పాటు పోలింగ్ బూత్ మ్యాప్‌ను, సరిహద్దులు తెలిపే నజరీ నక్ష ఇచ్చేవారని, ఇంటి నెంబర్ వివరాలను కూడా ఇచ్చేవారని, ఇప్పుడు అవి ఇవ్వడం లేదని తెలిపారు. ఫోటోలకు బదులు ఇతర వివరాలను పెడుతున్నారని, దీంతో పోలింగ్ బూత్ తెలుసుకోవడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. ఓటర్ల నమోదు, ఓటింగ్ విధానం తదితర అంశాలపై ఎన్నికల సంఘం ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయించాలని సూచించినట్లు తెలిపారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం తగ్గుతోందని, ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని సూచించామన్నారు.
ఆ ఏడు మండలాల సంగతేంటి : సిపిఐ
ప్రధాని మోడీ జమిలి ఎన్నికలు అని ఒకవైపు ప్రతీ సందర్భంలో వ్యాఖ్యానిస్తూనే ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగమం చేశారని, వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుఇప్పుడు అవసరమా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. అన్ని వ్యవస్థలనూ ప్రధాని ధ్వంసం చేశారని, ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీని రద్దు చేసిన కొద్దిసేపటికే మీడియా సమావేశంలో షెడ్యూల్‌ను కూడా ప్రకటించారని గుర్తుచేశారు. పండుగలు. చవితి, మోహర్రం ఉన్నాయి కాబట్టి షెడ్యూల్ వాయిదా వేయాల్సిందిగా కోరామని, తొందర వద్దని సూచించినట్లు మీడియాకు తెలిపారు. గత ఎన్నికల సందర్భంగా రూపొందిన ఓటర్ల జాబితాతో పోలిస్తే దాదాపు 30 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల పేరుతో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన తర్వాత పరిస్థితి గురించి బృందాన్ని ప్రశ్నించామని, తాజా స్థితిగతుల గురించి అడిగామని తెలిపారు.
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగాలి : బిఎస్‌పి
బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలను నిర్వహించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేరెల మల్లన్న తెలిపారు. ఈవిఎంలు టాపరింగ్‌కు గురయ్యే అవకాశం ఉన్నందున బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించడం అన్ని రకాలుగా శ్రేయస్కరమని సూచించినట్లు ఆయన తెలిపారు. గత ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లలో లక్షల సంఖ్యలో తొలగించినందున మళ్ళీ సరైన లెక్కలు తీసి ఓటర్లను నమోదు చేయాలన్నారు.