Home తాజా వార్తలు ఎంసిహెచ్‌ఆర్‌డిలో అత్యధిక సౌరవిద్యుత్ ఉత్పత్తి

ఎంసిహెచ్‌ఆర్‌డిలో అత్యధిక సౌరవిద్యుత్ ఉత్పత్తి

IT Minister KTR

 

350 కిలోవాట్ల సౌరవిద్యుత్ వ్యవస్థను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
సంస్థలో రెండుదశల్లో 850 కి.వా. విద్యుత్తు ఉత్పత్తి

హైదరాబాద్ : వాతావరణాన్ని కలుషితంచేసే సంప్రదాయక విద్యుత్ మార్గాల తరహాలో కాకుండా కాలుష్యరహితంగా, స్థిరంగా సౌరవిద్యుత్తు శక్తి ఉంటుందని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ బిపి ఆచార్య చెప్పారు. సంస్థ రెండవ అంతస్థులో 350 కిలోవాట్ల సామర్థమున్న సౌరవిద్యుత్ వ్యవస్థను రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బిపి ఆచార్య సౌరవిద్యుత్ శక్తిపై పలు విషయాలను వెల్లడించారు. 2018లో ప్రారంభించిన మొదటి దశ సౌరవిద్యుత్ 500 కిలో వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నదని, రెండవ దశలో ఉత్పత్తి అవుతున్న 350 కి.వా. మొత్తం 850 కిలో వాట్ల ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసే ప్రజా భవనంగా ఎంసిహెచ్‌ఆర్‌డి నిలిచిందని ఆచార్య తెలిపారు.

మొదటి, రెండవ దశల్లో ఉత్పత్తిచేయబడుతున్న విద్యుత్తు ఫలితంగా ఇన్‌స్టిట్యూట్ విద్యుత్ బిల్లులో నెలకు రూ. 9 లక్షలు ఆదా అవుతుందని బిపి ఆచార్య వెల్లడించారు. ఈ సౌరవిద్యుత్ శక్తి రెండుదశలను ఏర్పాటు చేసేందుకు 3.81 కోట్లు, వీటిలో 25 శాతం నిధులు అంటే రూ. 95 లక్షలను కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని, 150 కి.వా.ల సామర్థమున్న మరో పైకప్పు సౌరవిద్యుత్‌ను ఏర్పాటు చేయాలని, తద్వారా సౌరవిద్యుత్ వ్యవస్థ మొత్తం సామర్థాన్ని 1000 కి.వా.లకు అంటే ఒక మెగా వాట్‌కు పెంచాలని సంస్థ యోచిస్తున్నట్టు ఆచార్య తెలిపారు. ఇందుకుగాను తెలంగాణ రాష్ట్రంలో కొత్త, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ అయిన తెలంగాణ న్యూ అండ్ రెన్యూవేబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ద్వారా పైకప్పు సౌరవిద్యుత్ వ్యవస్తలను వినియోగంలోకి తీసుకవచ్చినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సలహాదారు ఎపివిఎన్ శర్మ, సంస్థ అదనపు డిజి హరిప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

350 KW Solar Power Project opened by KTR in MCR HRD