Home అంతర్జాతీయ వార్తలు రైతుల ఉద్యమానికి బ్రిటన్ ఎంపిల మద్దతు

రైతుల ఉద్యమానికి బ్రిటన్ ఎంపిల మద్దతు

36 UK MPs support to Indian Farmers Protest

 

లండన్ : భారత్‌లో రైతుల ఉద్యమానికి వివిధ పార్టీలకు చెందిన 36 మంది బ్రిటన్ ఎంపిలు మద్దతు తెలిపారు. లేబర్ పార్టీ ఎంపి తన్మన్‌జిత్ సింగ్ దేశీ నాయకత్వంలో ఈ ఎంపిల బృందం ఈ అంశంపై స్పందించింది. తాము భారత్‌లో ఉద్యమిస్తున్న రైతాంగానికి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపింది. బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి డోమినిక్ రాబ్ వెంటనే ఈ విషయాన్ని భారత ప్రభుత్వంతో ప్రస్తావించాలని ఈ ఎంపిలు కోరారు. దీనితో భారత్‌లో జరుగుతోన్న రైతుల ఉద్యమం ఇప్పుడు అంతర్జాతీయ చర్చనీయాంశం అయింది. డోమినిక్ రాబ్‌కు ఈ ఎంపిలు ఓ సందేశం పంపించారు. భారత ప్రభుత్వంపై దౌత్యపరంగా ఒత్తిడి తీసుకువచ్చి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడాల్సి ఉందని ఇందులో తెలిపారు. విదేశాంగ కార్యదర్శి భారత ప్రభుత్వ ప్రతినిధులతో రైతులతో చర్చలు జరపాలని కూడా కోరింది. రైతులకు ఇబ్బందికరంగా ఈ చట్టాలు మారాయని, వ్యవసాయంపై ఆధారపడి జీవించే వర్గానికి చేటుగా రూపొందాయని బ్రిటన్ ఎంపిలు ఆరోపించారు.

స్లాగ్‌కు చెందిన లేబర్ ఎంపి దేశీ తమ సందేశంలో బ్రిటన్ ప్రభుత్వం పంజాబ్ ఇతర రైతుల పక్షాన నిలవాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గత నెలలోనే ఆయన లండన్‌లోని భారతీయ హై కమిషన్ కార్యాలయానికి రైతుల ఆందోళనపై లేఖ పంపించారు. మూడు వ్యవసాయ చట్టాలతో తలెత్తుతున్న దుష్ప్రభావాలపై వెంటనే స్పందించాల్సి ఉందన్నారు. బ్రిటన్‌లోని సిక్కులకు, పంజాబ్‌తో ముడివడి ఉన్న వారికి సంబంధించిన తీవ్రమైన అంశం ఇదని కూడా తెలిపారు. కేవలం పంజాబ్ రైతులపైనే కాకుండా ఇతర భారతీయ రాష్ట్రాలపై కూడా నూతన వ్యవసాయ చట్టాల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్ ఆర్థిక వ్యవస్థకు రైతాంగ వర్గం ఆయువుపట్టు వంటిది. పంజాబ్ ఆర్థిక వ్యవస్థను అనేక విధాలుగా నిర్ధేశిస్తుందని, రైతాంగపు ఎటువంటి ఆందోళనలు అఇయనా రాష్ట్ర , జాతీయ రాజకీయాలలో ప్రభావిత అంశాలే అవుతాయని కూడా తెలిపారు.

36 UK MPs support to Indian Farmers Protest