Home ఎడిటోరియల్ కల్తీ సారా విషాదం

కల్తీ సారా విషాదం

new education system in india 2020  పంజాబ్‌లో కల్తీ సారా తాగి 38 మంది దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ను దూరంగా ఉంచేందుకు చేతులకు పూసుకునే శానిటైజర్ సేవించి 12 మంది మృతి చెందారు. ఈ రెండు దుర్ఘటనల్లోనూ బలైపోయింది పేదవారేనని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. మద్యం కొనలేక, అధిక కిక్కు ( మైకం) కోసం నాటు సారాను సేవించడం, అది కల్తీది కావడం వల్ల దానికి వందలాది మంది బలైపోడం దేశంలో కొత్త కాదు. ఆంధ్రప్రదేశ్ దుర్ఘటనైతే అక్కడ ఉధృతంగా బయటపడుతున్న కరోనా వ్యాప్తిని నిరోధించడానికి విధిస్తున్న లాక్‌డౌన్‌లలో భాగంగా మద్యం దుకాణాలు మూసివేయడంతో, అందుకు అలవాటుపడిన వారు శానిటైజర్‌ను సేవించారని అది వికటించి మరణాలు సంభవించాయని వెల్లడయింది. వాస్తవానికి దేశంలో కల్తీ సారా విషాద ఉదంతాలు గత కొంత కాలంగా దాదాపు లేవనే చెప్పాలి. బాగా తగ్గు ముఖం పట్టాయి. గత ఏడాది ఫిబ్రవరిలో అసోం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో జరిగిన ఘటనల్లో పెక్కు మంది చనిపోయారు.

అసోంలోని గోలాఘాట్ జిల్లా సల్మోరా తేయాకు తోటల కార్మికులు కల్తీ సారా తాగడంతో 110 మంది మరణించారు, 200 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఆ ఘోర విషాదానికి ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వైఫల్యమే కారణమని బహిరంగంగా విమర్శించిన వ్యక్తిపై అక్కడి పాలక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడి చేశారని వార్తలు వచ్చాయి. దాదాపు ఏడాదిన్నర క్రితం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో 97 మంది కల్తీ సారా తాగి మృతి చెందారు. ఇందులో ఒక్క హరిద్వార్ (ఉత్తరాఖండ్)లోనే 40 మందికి పైగా చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లో మృతుల బంధువులు ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వైపు వేలెత్తి చూపించగా, పోలీసులు మాత్రం సరుకు ఉత్తరాఖండ్ నుంచే వచ్చిందన్నారు. మృతి చెందినవారి పిల్లలను ఉచితంగా చదివించాలని, వారి భార్యలకు ఉద్యోగాలివ్వాలని బాధిత కుటుంబాలవారు ఆందోళన నిర్వహించారు.

ఇంకా పశ్చిమబెంగాల్, గుజరాత్‌లలో ఇతర పలు చోట్ల గతంలో తరచుగా కల్తీ సారా దుర్ఘటనలు సంభవించాయి. 2015 జూన్‌లో ముంబై మల్వానీలోని ఒక మురికివాడలో కల్తీ సారా 100 మందిని బలి తీసుకున్నది. 2011లో పశ్చిమ బెంగాల్‌లో సంభవించిన ఘటనలో 172 మంది మృతి చెందారు. 2009లో గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో కల్తీ సారా 136 మందిని హతమార్చింది. 2008 మే నెలలో కర్నాటక, తమిళనాడుల్లో 180 మంది దుర్మరణం పాలయ్యారు. పశ్చిమ బెంగాల్ దుర్ఘటనకు బాధ్యులని తేలిన నలుగురికి కలకత్తా హైకోర్టు, ఆ ఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. నిషా నషాళానికి ఎక్కించడానికి సారాయిలో మిథనాల్ కలుపుతున్నారు. అది గుండె పోటుకు, తీవ్రమైన శ్వాస కోశ వ్యాధికి దారి తీస్తున్నది. మత్తులో కల్తీ సారాను అపరిమితంగా తాగేవారు చనిపోతున్నారు. చికిత్స అనంతరం బతికిన వారు కూడా అంధత్వానికి గురి అవుతున్నారు.

సాధారణంగా పేద కుటుంబాల్లో కూలినాలి చేసి కుటుంబాన్ని పోషించే పురుషులు ఆ స్వల్ప ఆదాయంలో చాలా భాగాన్ని తాగుడుకు పోస్తున్నారు. వారు దుర్మరణం పాలైతే వారి మీద ఆధారపడిన తల్లీ, బిడ్డలు దిక్కులేని వారైపోతున్నారు. దారిద్య్రం అమితంగా ఉన్న మన దేశంలో కల్తీ సారా, కల్లు పేదల బతుకుల్లో సృష్టిస్తున్న గాఢాంధకారం అంతా ఇంతా కాదు. కల్తీ సారా తయారీని పూర్తిగా అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. గతంతో పోలిస్తే ఈ దుర్ఘటనల జోరు ఇప్పుడు తగ్గుముఖం పట్టడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న కొన్ని ప్రభావవంతమైన చర్యలతోపాటు , ప్రజల్లో వస్తున్న చైతన్యం కూడా కారణమైంది. ముఖ్యంగా మహిళా సంఘాల ఆందోళనల వల్ల కొన్ని చోట్ల గ్రామాలు మద్యపాన రహితంగా మారుతున్నాయి కూడా. అధిక లాభాల కోసం సారాను, కల్లును కల్తీ చేస్తున్న ముఠాలతో కింది స్థాయి పోలీసులు కుమ్మక్కు అయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుచేత ఇటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా మేజిస్ట్రేట్ దర్యాప్తుతో సరిపుచ్చడం సరికాదు.

అంతకు మించిన శక్తివంతమైన, లోతైన దర్యాప్తులు జరిపినప్పుడే కల్తీ సారా వ్యాపారుల మూలాలు పూర్తిగా బయటపడడానికి వీలు కలుగుతుంది. వారికి అధికార యంత్రాంగం నుంచి, పాలక పీఠాల్లోని నేతల నుంచి మద్దతు ఉందేమోనన్న కోణాన్ని తవ్వి తీయడానికి వీలవుతుంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌లో సంభవించిన విషాదం ఒక గ్రామ సర్పంచ్ నిర్వాకమేనని తేలింది. అలాగే ఈ ఘటనల కేసుల విచారణ త్వరగా జరిపించి కఠిన శిక్షలు వీలైనంత వేగంగా పడేటట్టు చూడాలి. మద్య నిషేధ కాలంలో కూడా కల్తీ మద్యం దుర్మార్గాలు జరిగిన సందర్భాలున్నాయి. దేశంలో మద్య నిషేధానికి, పూర్తిగా విజయవంతమైన చరిత్ర లేదు. అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించడం, సమాజం ఆమూలాగ్రం మరింత చైతన్యవంతం కావడమే ఈ దారుణాలు నిలిచిపోడానికి దోహదపడతాయి.

38 die of drinking spurious liquor in Panjab