Home లైఫ్ స్టైల్ త్రీడీ ఆర్ట్‌కు కేరాఫ్ బైక్ సిస్టర్స్

త్రీడీ ఆర్ట్‌కు కేరాఫ్ బైక్ సిస్టర్స్

3D Painting Services in Hyderabad

హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన సత్యనారాయణ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుండేవాడు. భార్య ఇంట్లోనే ఉండేది. సత్యనారాయణకు సంగీత, సత్యవేణి ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరూ కేంద్రీయ విద్యాలయంలో చదువుకునే వారు. చిన్న పాపకు స్కూలు నుంచే ఆటలపై ఎక్కువ ఆసక్తి చూపించేది. చదువులో కూడా ముందుండేది. తనకు ఎక్కువగా టెన్నిస్ ఆట అంటే ఇష్టం. ప్రతిరోజు నాన్నతో కలిసి ఉదయాన్నే రన్నింగ్‌కి వెళ్లేది. రోజులో 8 గంటలు కేవలం టెన్నిస్ ప్రాక్టీస్ చేయ డానికే కేటాయించేది. చిన్నతనం నుండి టెన్నిస్ లో కోచింగ్ తీసుకుని మంచి పొజిషన్‌లోకి వెళ్ళింది. చాలా అవార్డులు గెలుచుకున్న సత్యవేణిని సకుటుంబం పలకరించింది.

ఊహ తెలిసిననాటి నుండి సత్యవేణి చేతిలో టెన్నిస్ రాకెట్ ఉండేది. జాతీయ స్థాయిలో 50 వ ర్యాంకుకు చేరుకుంది. అలా జీవితం సాఫీగా నడుస్తున్న సమయంలో పది సంవత్సరాల క్రితం అండర్ 16 ఫైనల్ టోర్నమెంట్ లో మ్యాచ్ కోసం అన్నయ్యతో కలిసి బైక్ మీద వెళుతున్నప్పుడు ఓ వ్యక్తి ఎదురుగా వచ్చాడు. అన్నయ్య సడన్ బ్రేక్ వేయడంతో సత్యవేణి కింద పడిపోయింది. అటుగా వస్తున్న ఓ బైకర్ అదుపుతప్పి సత్యవేణి కాలు మీద నుండి బైక్ పోనిచ్చాడు. అప్పటికే అతను ఫుల్‌గా తాగి వాహనం నడుపుతున్నాడు. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లడంతో అప్పటికే డాక్టర్లు కాలిమడమ విరిగిపోయింది అని చెప్పారు. ఒక్కసారిగా తన భవిష్యత్తు ఇంక ఆగిపోయిందని కన్నీరుమున్నీరు అయింది. టెన్నిస్ ఆటలో ముఖ్యంగా ప్లేయర్ ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. సర్జరీ చేసి ఇంక జన్మలో టెన్నిస్ ఆడకూడదు అని డాక్టర్ చెప్పారు. తరువాత వాళ్ల అమ్మ చెట్ల మందులతో వైద్యం చేయించింది.

యాక్సిడెంట్ తర్వాత మూడు నెలల్లో కోలుకోవడానికి ఆకు పసరుతో నాటు వైద్యాన్ని చేయించుకోవడం మొదలుపెట్టింది. మూడు నెలలు అని అనుకున్నది ఆరు నెలలు పట్టింది. ఆరు నెలలు ఆడకపోవడం వల్ల ర్యాంకు సున్నాకు పడిపోయింది. ప్రాక్టీస్ ప్రారంభించింది మూడు సంవత్సరాల కఠోర శ్రమతో తిరిగి 50కి చేరుకుంది. అలా తను ఆరు నెలలు ఇంట్లో రెస్ట్ తీసుకుంది. కొన్నాళ్ల తరువాత ఒక రోజు తను చెన్నైలో మ్యాచ్ ఆడటం కోసమని అక్కడికి చేరుకుంది. మ్యాచ్ ఆడుతున్న సమయంలో తన కాలు విపరీతమైన నొప్పి రావడంతో వెంటనే హైదరాబాద్‌లోని డాక్టర్ దగ్గరికి వెళ్లి స్కానింగ్ తీయించారు.

అప్పుడు తెలిసింది, విరిగిన ఎముకను డాక్టరు తప్పుగా అమర్చాడని… ఆ తర్వాత తిరుమలగిరిలోని బాడీ మెకానిక్ వ్యాక్స్ థెరపీ(వేడి మైనాన్ని కాలి మీద పోస్తూ జరిపే ట్రీట్‌మెంట్) మూడు నెలలు చేయించుకుంది. దాదాపు మూడు నెలల పాటు బాధను భరిస్తూనే చేయించుకుంది.పెద్దగా మార్పు రాలేదు. తప్పుగా అమర్చిన ఎముకను విరగ్గొట్టి ఆపరేషన్ తో సరిచేసుంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ఈ ఆపరేషన్‌కు మూడు సంవత్సరాలు ఆలస్యం అవ్వడంతో కాలి ఎముక పూర్తిగా క్షీణించిపోయింది. వెన్నెముక భాగంలోని ఎముక తీసి అమర్చారు. దీంతో ఇక టెన్నిస్ ఆడడం, పరిగెత్తడం, లాంగ్ జంపింగ్, జిమ్ లాంటివి శాశ్వతంగా చేయలేకపోయింది.

బైక్ అంటే భయం
తనకెంతో ఇష్టమైన టెన్నిస్ ఆడలేకపోవడానికి గల ప్రధాన కారణమైన బైక్ లను చూసి మొదట భయపడేది. ఇంకా 6 నెలలు పాటు ఇంట్లో ఉండి తర్వాత కస్తూర్బా కాలేజీలో బికాం చదువుతూ ఉస్మానియా యూనివర్సిటీలో టెన్నిస్ గేమ్స్‌లో పాల్గొనేది. కాలు నొప్పి కారణంగా ఆట ఆడలేకపోయింది. టెన్నిస్ ఆడలేకపోతున్నందుకు తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నప్పుడు అమ్మ ‘నువ్వు ఇలా బాధపడుతూ ఇంట్లో కూర్చోవడం మాకు ఏమాత్రం నచ్చడం లేదు, తరువాత రోజు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ తాళం తీసుకో, నడపడం నేర్చుకో నీ జీవితంలో ఇంకా భయం అనే పదాన్ని ఇంటికి తీసుకురావద్దు నీలో మార్పు రావాలి’ అని చెప్పింది.

కజిన్ అప్పుడే వచ్చి రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద తీసుకుని వెళితే సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు సత్యవేణి నడుపుతూ తీసుకువచ్చింది. అలా సత్యవేణి బైక్ నడపడం నేర్చుకుంది. తను డిప్రెషన్‌గా ఫీల్ అయినప్పుడు తన బైక్‌పై ఒక్కతే లాంగ్ డ్రైవింగ్‌కు వెళ్లేది. వరంగల్‌లో తన అమ్మమ్మ ఇంటికి ఉదయమే బయలుదేరి వెళ్లేది. అలా వెళ్లడంతో కొద్దిగానైనా బాధనుండి ఉపశమనం పొందేది. అలా రోజురోజుకి తనకు బైక్ నడపడం అలవాటుగా మారిపోయింది. రోడ్డుపై డ్రైవింగ్ చేసే సమయంలో కొందరు ‘నీలాంటి పిల్లలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి’ అని అనేవారు. సత్యవేణికి, సంగీతకి చిన్నప్పటి నుంచే బొమ్మలు వేయడం కూడా ఇష్టంగా ఉండేది.

త్రీడీ పెయింటింగ్ అంటే ఇష్టం…..
ప్రస్తుతం ఇప్పుడు సత్యవేణి వయసు 23 సంవత్సరాలు. తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ చిత్రాల రూపంలో వేస్తుండేది. ఒక రోజు తన బైక్ ట్యాంక్‌పై వేసింది. అలా తను తయారుచేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ట్యాంక్‌పై వేసిన ఆర్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. అలా తను తయారు చేసిన ఆర్ట్‌ని మాకు కూడా కావాలని అందరూ కోరుకోవడంతో సత్యవేణికి ఒక ఆలోచన వచ్చింది. ఎక్కడో ఉద్యోగం చేయడం కంటే తమ కళ్లపై తాము బతకాలనే ఆలోచన వచ్చింది. వెంటనే అక్క సంగీత విఎఫ్‌ఎక్స్‌ని మానేసి తనతో ఈ బైక్ త్రిడీ ఆర్ట్‌ని ప్రారంభించింది. అలా ఇద్దరూ ఒక సంస్థను (womeneoteric customs) ఏర్పాటు చేసారు.

సంగీత, సత్యవేణి కలిసి త్రీడి పెయింటింగ్ తయారు చేయడానికి రెండు నెలల సమయం పట్టింది. కేవలం ఇంట్లో ఉండి ఈ ఆర్ట్‌ని వేస్తున్నారు. ఇంత శ్రమతో కూడిన ఆర్ట్‌ను భారతదేశంలో మొట్టమొదటగా సత్యవేణినే వేస్తున్నది. సత్యవేణి ఆర్ట్ నచ్చి రాజ్ తరుణ్ ‘లవర్’ సినిమాలో వాడింది సత్వవేణి బైక్‌నే. అంతే కాకుండా ప్రతి శనివారం వీరు బైకార్స్ ఇన్ హైదరాబాద్ క్లబ్ కంపెనీకి చెందిన సంస్థతో కలిసి 100 మందికి 18 నుంచి 55 సంవత్సరాల మధ్యవయసు ఉన్న వారికి ఉచితంగా గేర్ బైక్ నేర్పిస్తుంటారు. బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నేర్పిస్తుంటారు. తన దగ్గరకు ఎక్కువ శాతం బైక్ రైడర్స్ వస్తుంటారు. కాలేజీలకు, రైడింగ్ ప్రోగ్రాంలకు వెళ్లినప్పుడు అక్కడ స్టేజీపైనా ప్రసంగం ఇస్తున్న సమయంలో తానే బైక్ మాడిఫై చేస్తూ ట్యాంక్‌లపై ఆర్ట్ వేస్తా అని చెప్పడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

ఎప్పుడైతే టెన్నిస్ రాకెట్ పోయి చేతిలోకి బైక్ వచ్చిందో అప్పుడే కళ కూడా వచ్చేసింది. మొదట తన జీవన ప్రయాణాన్ని బొమ్మల రూపంలో వేసింది. ఆ తర్వాత సోదరి బైక్ మీద పెయింటింగ్ వెయ్యొచ్చు కదా అని సలహా ఇవ్వడంతో బైక్ పెట్రోల్ ట్యాంక్‌ల మీద, హెల్మెట్ల మీద, టీ షర్ట్ మీదా, వాల్ పెయింటింగ్స్ వెయ్యడం మొదలు పెట్టింది. ఇందులోనే మరింత రీసెర్చ్ చేసి త్రీడీ డిజైన్లను మొదలుపెట్టింది. ఇది చెప్పినంత సులభం కాదు.. ఒక్కో త్రీడీ పెయింటింగ్‌కు నెల రోజుల సమయం పడుతుంది. పెయింట్ కు తగ్గట్టు క్లే ని అమర్చాలి.చిన్న తేడా వచ్చినా ఆకృతి మారిపోతుంది. ప్రస్తుతం సత్యవేణికి తెలుగు రాష్టాలలోనే కాదు ముంబయ్, ఢిల్లీ, కర్ణాటక, చెన్నై లాంటి ప్రాంతాలలోనూ అభిమానులున్నారు. ఎవరికైనా ఈ త్రీడీ ఆర్ట్ కావాలనుకునే వారు తనకు ఆన్‌లైన్‌లో కొరియర్ ద్వారా హైదరాబాద్‌కి పోస్ట్ చేస్తే తను పెయింటింగ్ వేసి మళ్లీ కొరియర్‌లో వారికి తిరిగి పంపిస్తుంటుంది. గురువులేకుండా నేర్చుకున్న ఈ కళ ఇప్పుడు జీవితంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చిపెట్టిందంటోంది సత్యవేణి. సోషల్ మీడియాలో కూడా తన ఆర్ట్‌కి ఫాలోవర్స్ ఉండటంతో ప్రజలకు మరింత చేరువలోకి వచ్చింది. ఒక ట్యాంక్‌కి త్రీడీ ఆర్ట్ వేయడానికి రూ.4000/, హెల్మెట్లకు రూ.1500/ నుంచి మొదలవుతుంది. 7 రోజుల నుంచి 15 రోజుల వరకు సమయం పడుతుందని చెబుతోంది.

                                                                                                                                                 – కాసోజు విష్ణు