Home తాజా వార్తలు భద్రాద్రి బ్యాంక్‌లో భారీగా నిధుల కుంభకోణం

భద్రాద్రి బ్యాంక్‌లో భారీగా నిధుల కుంభకోణం

4 employees arrested in bhadradri co-operative urban bank

 

యాజమాన్యం ఫిర్యాదుతో సిబ్బంది అరెస్ట్

మన తెలంగాణ/మణుగూరు : భద్రాద్రి కో-ఆపరేటీవ్ అర్బన్ బ్యాంక్‌లో జరిగిన నగదు అవకతవకలకు పాల్పడిన నలుగురు బ్యాంక్ సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పి సునీల్ దత్ తెలిపారు. బుధవారం మణుగూరు ఎఎస్పి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మణుగూరు భద్రాద్రి బ్యాంక్ నందు నగదు గోల్‌మాల్ జరిగినట్లు గత నెల 24న బ్యాంక్ యాజమాన్యం మణుగూరు పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని, విచారణలో బ్యాంక్ యాజమాన్యం ఇచ్చిన వివరాల ప్రకారం రూ.2,91,29,900ల నగదును బ్యాంక్‌లో సిబ్బంది వాడుకున్నట్లు గుర్తించామన్నారు.

దీనిలో భాగంగా నింధితులను గుర్తించడం జరిగిందని, ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడుగా గుర్తించిన బ్యాంక్ మేనేజర్ కందుల రామును గత 8న అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించామని, తదుపరి విచారణలో అదే బ్యాంక్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ ఎస్‌కె.అక్బర్, క్యాషియర్ చింతపోగు రామారావు, అటెండర్ గనిబోయిన రవీందర్ కుమార్‌లను ఈ కుంభకోణంలో ముద్దాయిలుగా గుర్తించామన్నారు. విచారణలో మణుగూరు ఏఎస్పీ నిందితులు వద్ద నుండి రూ.1,86,36,200ల నగదును రికవరీ చేసినట్లుగా తెలిపారు.

ఇంకా రూ.1,44,02000ల నగదును నిందితుల నుండి రికవరీ చేయాల్సి ఉందని, బ్యాంక్‌లో నిధుల గోల్‌మాల్ గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. బుధవారం మిగిలిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. భద్రాద్రి బ్యాంక్ కుంభకోణంను చాకచక్యంగా విచారణ చేపట్టి సోమ్మును రికవరీ చేసిన పోలీస్ సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు ఏఎస్పీ డాక్టర్ శభరీష్, సీఐ బానుప్రకాష్, ఎస్‌ఐ నరేష్ మరియు సిబ్బంది మోహన్, మల్సుర్ తదితరులు పాల్గొన్నారు.

4 employees arrested in bhadradri co-operative urban bank