నలుగురు మహిళలు మృతి
జాతీయ రహదారిపై మృతదేహాలతో రాస్తారోకో
మృతుల కుటుంబాలకు సింగరేణిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు : ఆర్డివో
మన తెలంగాణ/కొత్తగూడెం/చంద్రుగొండ : వరి నారు తీసేందుకు కూలీలతో వెళుతున్న వ్యాన్‌ను బొగ్గు టిప్పర్ ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం తిప్పనవల్లి వద్ద జరిగింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని సుజాతనగర్‌కు చెందిన వ్యాన్‌లో 14మంది కూలీలు వరి నారు తీసేందుకు అబ్బుగూడెం వెళుతుండగా తిప్పనపల్లి వద్ద సుజాతనగర్ రోడ్డు నుంచి విజయవాడ హైవేపైకి వ్యాన్ వస్తుండగా ఎదురుగా సత్తుపల్లి వైపు నుంచి వస్తొన్న బొగ్గు టిప్పర్ ఢీకొట్టింది. దీంతో కూలీలు ప్రయాణిస్తున్న వ్యాన్ పల్టీలు కొట్టింది. ప్రమాదంలో నలుగురు మహిళలు మృత్యువాత పడ్డారు. ఒక్కసారిగా ఆ ప్రాంతం హాహాకారాలతో నిండిపోయింది. ప్రమాదంలో వ్యాన్‌లో వెనుక వైపు ప్రయాణిస్తున్న కత్తి స్వాతి(26), ఎక్కిరాల సుజాత (40) అక్కడికక్కడే మృతిచెందారు.
మిగతా 9మంది క్షతగాత్రులతోపాటు డ్రైవర్ రాందాసును కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించిన వెంటనే గుర్రం లక్ష్మీ(55), కత్తి సాయమ్మ (50) మృతిచెందారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా క్షతగాత్రులు కత్తి లక్ష్మీ, కత్తి పద్మ, కత్తి సగుణ, కత్తి వెంకటరమణ, గుర్రం అచ్చమ్మ, గుర్రం నర్సమ్మ, నారు కొనేందుకు వెళుతున్న ఆళ్ల వీరయ్య, ఆయన భార్య ఆళ్ల పద్మ గాయపడ్డారు. డ్రైవర్ రాందాస్‌కు స్వల్పగాయాలయ్యాయి. టిప్పర్ సమీపంలోని ఖజాబీ అనే మహిళ ఇంట్లోకి దూసుకుపోయింది. కాగా, ఈ మార్గంలో సత్తుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గని నుంచి ఓవర్ లోడ్‌తో వేగంగా వస్తున్న టిప్పర్ల వల్ల దాదాపు 40 మంది ఇప్పటికి వరకు మృత్యువాతపడ్డారని చెబుతున్నారు. ఈ సందర్భంగా తిప్పనపల్లి వద్ద గ్రామస్థులు రాస్తారోకో చేశారు.
మృత దేహాలను ప్రీజర్బాక్సులో పెట్టి సాయంత్రం వరకు రాస్తారోకో నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు కాంట్రాక్టర్ ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, అలాగే దళిత బంధు రూ 10లక్షలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి జిఎం, రవాణా శాఖాధికారులు రావాలని పట్టుబట్టారు.మృతుల కుటుంబాలకు ఆర్డీవో స్వర్ణలత తక్షణ సాయంగా రూ.50వేలు ప్రకటించారు. మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి సింగరేణి ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వరబాబు ఆధ్వర్యంలో గస్తీ ఏర్పాట్లు చేశారు. చంద్రుగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాస్తారోకోకు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైఎస్ఆర్టిపి, ఎమ్మార్పీఎస్ నాయకులు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
4 women die after van and coal tipper collided