Home తాజా వార్తలు 40కిలోల గంజాయి పట్టివేత

40కిలోల గంజాయి పట్టివేత

 

మనతెలంగాణ, హైదరాబాద్: నగరానికి గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, నారాయణగూడ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 40కిలోల గంజాయి, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా, రాయవరం మండలం, మాచవరం గ్రామానికి చెందిన కొవ్వురి శ్రీనివాస్ రెడ్డి ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా, గార్ల బయ్యారానికి చెందిన గౌరిషెట్టి జగదీష్ నల్గొండ జిల్లా మూసీ రోడ్, నకిరేకల్ స్థిరపడ్డాడు. విశాకపట్నం, పెద్దబయలుకు చెందిన గంపరాయ్ మోహన్ హోటల్‌లో పనిచేస్తున్నాడు. విశాకపట్నం, పాడేరుకు చెందిన విశ్వనాథం వల్లంగి గంజాయీ సరఫరా దారు, పరారీలో ఉన్నాడు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి నష్టాలు రావడంతో ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ సమయంలోనే గౌరిషెట్టి జగదీష్‌తో పరిచయమైంది.

జనవరి, 2019లో కలుసుకున్న ఇద్దరు గంజాయి సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. పాడేరుకు చెందిన విశ్వా, మోహన్ ఇద్దరితో కలిసి నగరానికి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి గంజాయిని కిలోకు రూ.6,000 చొప్పున రాజమండ్రిలో కొనుగోలు చేశాడు. రాజమండ్రి నుంచి గంజాయిని హైదరాబాద్‌కు ఆర్టిసి బస్సులో తరలించి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి కిలోకు రూ.9,000 విక్రయించాలని ప్లాన్ వేశారు. వచ్చిన డబ్బులను అందరూ కలిసి సమానంగా పంచుకోవాలనుకున్నారు. గంజాయిని ఆర్టిసి బస్సులో శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ తీసుకు వస్తుండగా వారికి తెలిసిన నగరానికి చెందిన కిషోర్ నారాయణగూడ ఫ్లైఓవర్‌పై వేచి ఉన్నాడు. పోలీసులకు సమాచారం రావడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాస్ రావు, ఎస్సైలు శ్రీధర్, శ్రీనివాసులు, సిబ్బంది కేసు దర్యాప్తు చేస్తున్నారు.

40 kg marijuana Seized at Narayanguda