Home తాజా వార్తలు 14 పట్టణాల్లో 40 పబ్లిక్ టాయిలెట్లు

14 పట్టణాల్లో 40 పబ్లిక్ టాయిలెట్లు

CDMA

 

127 మున్సిపాలిటీల్లో ప్రతిపాదనలు
71 పురపాలికల్లో మలవ్యర్థ జలాల శుధ్ధి కేంద్రాలు

మనతెలంగాణ /హైదరాబాద్ : పట్టణాల్లో పబ్లిక్ టాయి లెట్ల ఏర్పాటుకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రణాళికలను సిద్దం చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి పట్టణంలోనూ జనాభ ప్రాతిపదికన నిర్మించాలని యోచిస్తున్నది. ముఖ్యంగా బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా మురికివాడలను అభివృద్ధి పరచాలని పురపాలక శాఖ భావిస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 141 పట్టణాల్లో కేవలం 14 పట్టణాల్లోనే పబ్లిక్ టాయిలెట్లు 40 వరకు నిర్మించినట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా తాండూర్‌లో 8, కల్వకుర్తిలో 6, బోధన్ లో 4, హుజురాబాద్‌లో 4, ఖమ్మంలో 3, రామగుండంలో 3. జల్‌పల్లి, కొత్తగూడం, మెదక్‌లలో రెండేసి నిర్మించిన ప్రభుత్వం ఇప్పుడు ప్రతి పట్టణంలోనూ పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవల ప్రారంభమైన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం చేపట్టిన పురపాలక శాఖ ప్రజా మరుగుదొడ్లకు ప్రాధాన్యతనిస్తున్నది. దేవరకొండలో 10 పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కెటిఆర్ ప్రకటించారు.

127 పట్టణాల్లో
తెలంగాణలో మొత్తం 141 పట్టణాలున్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు 127 పట్టణాల్లో ప్రజా మరుగుదొడ్లు లేవు. దీంతో బహిరంగ మల విసర్జన కొనసాగుతుంది. ఇది గ్రహించిన పురపాలక శాఖ ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్టను నిర్మించడంతో పాటు 71 పురపాలికల్లో ప్రత్యేకంగా మలవ్యర్థ జలాల శుద్ది కేంద్రాలను ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలను ప్రైవేట్ సంస్థల నుంచి నివేదికను కోరింది. ఈ శుద్ది కేంద్రాల నిర్వహణ, నిర్మాణం, పర్యవేక్షణ వంటి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా స్వతంత్ర ఇంజనీర్‌ను కూడా నియమిస్తున్నట్టు పురపాలక శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ(రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్)ను ఆహ్వానించింది. త్వరలోనే శుద్ది కేంద్రాల కోసం ప్రత్యేకంగా ఇంజనీర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నది. 71 పురపాలికల్లో దశల వారిగా 7 ప్యాకేజీల ద్వారా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నది. వీటి ఏర్పాటుతో ఆయా పట్టణాల్లో బహిరంగ మల విసర్జణ పూర్తిగా కనుమరుగవుతుందనేది అధికారుల అభిప్రాయం.

40 public toilet design plan in 14 towns of Telangana