Home జాతీయ వార్తలు 42 కోట్ల మంది పేదలకు రూ.53,248 కోట్ల ఆర్థిక సాయం

42 కోట్ల మంది పేదలకు రూ.53,248 కోట్ల ఆర్థిక సాయం

 42 cr poor got Rs 53248 cr aid under the PMGKP

 

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి (పిఎంజికెపి) కింద 42 కోట్ల మంది పేద ప్రజలు రూ.53,248 కోట్ల ఆర్థిక సహాయాన్ని పొందగలిగారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది.

కరోనా వైరస్‌తో సతమతమౌతున్న బలహీన వర్గాలను ఆదుకోడానికి ప్రభుత్వం మార్చి 26న రూ.1.70 లక్ష కోట్ల పునరావాస ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద మహిళలకు, వృద్ధులకు,రైతులకు, ఇతర బలహీన వర్గాలకు ఉచితంగా ఆహార ధాన్యాలు,నగదు పంపిణీ చేస్తారు. ఈ ప్యాకేజీ అమలును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. ఈ ప్యాకేజీ కింద మంగళవారం వరకు జరిగిన పురోగతిని వివరిస్తూ పిఎంకిసాన్ మొదటి వాయిదా కింద 8.19 కోట్ల లబ్ధిదారులకు రూ.16,394 కోట్లు అందచేసినట్టు వివరించింది. జనధన్ లబ్ధిదారులైన మహిళలకు రెండు వాయిదాల్లో రూ.20,344 కోట్లు అందచేసినట్టు వివరించింది. ఇదికాక,2.81 కోట్ల వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, రెండు వాయిదాల్లో రూ.2814.5 కోట్లు పంపిణీ చేశారు.

పిఎంజికెపి కింద 2.3 కోట్ల భవన నిర్మాణ కార్మికులకు రూ.4312.82 కోట్లు అందచేశారు. ఏప్రిల్‌లో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 101 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ కాగా, 73.86 కోట్ల లబ్ధిదారులకు 36.93 లక్ష మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ అయ్యాయి. మే లో 65.85 కోట్ల లబ్ధిదారులకు 32.92 లక్ష మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు పంపిణీ అయ్యాయి. జూన్‌లో 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల 7.16 కోట్ల లబ్ధిదారులకు 3.58 లక్ష మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ అయ్యాయి. అలాగే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 5.06 లక్షల మెట్రిక్ టన్నుల కాయధాన్యాలు పంపగా, వాటిలో 1.91 లక్ష మెట్రిక్ టన్నుల కాయధాన్యాలు మొత్తం లబ్ధిదారులు 19.4 కోట్ల మందిలో 17.9 కోట్ల లబ్ధిదారులకు ఇంతవరకు అందాయి.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) కింద 9.25 కోట్ల ఎల్‌పిజి సిలిండర్లు నమోదు కాగా, 8.58 సిలిండర్లు ఉచితంగా పంపిణీ అయ్యాయి. ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఇపిఎఫ్‌ఒ)సభ్యులు 16.1 లక్షల మంది ఇపిఎఫ్‌ఒ అకౌంట్ నుంచి తిరిగి చెల్లింపు లేని అడ్వాన్సును ఆన్‌లైన్ ద్వారా రూ.4725 కోట్ల వరకు విత్‌డ్రా చేసుకునే ప్రయోజనాన్ని పొందారని ఆర్థిక మంత్రిత్వశాఖ వివరించింది. ఇపిఎఫ్ నిధి నుంచి 24 శాతం అంటే రూ.895 .09 కోట్లు 59.23 లక్షల ఎంపాయీస్ అకౌంట్లకు బదిలీ చేయడమైందని తెలియచేసింది.

కరోనాతో 6 కోట్ల మందికి పేదరికం
కరోనా ప్రభావంతో ఈ ఏదాడి ఆరు కోట్ల మంది కటిక పేదరికానికి గురవుతారని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్టాన్ అభిప్రాయ పడ్డారు. కరోనా వల్ల పెట్టుబడులు, ఉపాధి కల్పన, సృజనాత్మకత,విద్య, వాణిజ్య రంగాలతోపాటు సరఫరా, వినియోగం తదితర అంశాలు బలహీనమయ్యాయని ఆయన పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. కరోనా అనంతరం ఉత్పత్తికి అవసరమయ్యే వనరుల నిర్మాణం, వనరులు సమకూర్చడం వంటివి సవాళ్లుగా ఎదురవుతాయని డేవిడ్‌మాల్టాన్ సూచించారు.

42 cr poor got Rs 53248 cr aid under the PMGKP