Thursday, March 28, 2024

కొత్త కేసులు 42

- Advertisement -
- Advertisement -

42 positive corona cases registered

 

9 మంది డిశ్చార్జ్
నలుగురు కరోనా రోగుల మృతి
రాష్ట్రంలో 1634కు చేరిన పాజిటివ్‌ల సంఖ్య

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మళ్లీ 42 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 9 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీనిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 34 మంది ఉండగా, మరో 8 మంది వలస కార్మికులకు వైరస్ నిర్ధారణ అయిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. అయితే కరోనా వైరస్ దాడిలో మరో నలుగురు మృతి చెందినట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1634కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 1011కి పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 585 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటి వరకు వైరస్ బారిన పడి 38 మంది మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. కొత్తగా నమోదైన వలస కార్మికులు సిరిసిల్లా, కరీంనగర్, యదాద్రి జిల్లాలకు చెందిన వాళ్లని అధికారులు పేర్కొన్నారు. అయితే గత పది రోజుల నుంచి వలస కార్మికులకు కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 77 మంది వలస కార్మికులకు వైరస్ సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు.

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వారి సంఖ్య పెరిగిందని, ఈమేరకు ముందస్తు జాగ్రత్తలతో వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించి, లక్షణాలు ఉన్న వారికి టెస్టులు చేస్తున్నామని, లేని వారిని క్వారంటైన్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వైరస్ సోకిన వలస కార్మికులను రాష్ట్రంలోని జిల్లాలు కేసులుగా పరిగణించడం లేదని వెల్లడించారు.

మరో నలుగురు మృతి…..

రాష్ట్రంలో కరోనా వైరస్‌ను బారిన పడి మరో నలుగురు మృతి చెందారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 38కి చేరుకుంది. 75 సంవత్సరాలు ఉన్న ఓ వృద్ధుడు హైపర్‌టెన్షన్, డయబెటిస్ సమస్యలతో బాధపడుతుండగా ఇటీవల వైరస్ సోకింది. దీంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స పొందుతూ మృతి చెందాడని మంగళవారం ప్రకటించారు. 38 సంవత్సరాలు కలిగిన ఓ మహిళ న్యూమోనియా, ఒబియోసిటి సమస్యలు ఉండగా కరోనా సోకింది. ఈమె కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని అధికారులు స్పష్టం చేశారు. అదే విధంగా 68 సంవత్సరాల ఓ మహిళ, 70 ఏళ్ల వృద్ధుడిలకు న్యూమోనియా సమస్య ఉండగా కరోనా నిర్ధారణ అయింది. ఈక్రమంలో వీరు ఆసుపత్రిలోనే మరణించారని అధికారులు బులిటెన్‌లో పేర్కొన్నారు. అయితే కరోనా మరణాల్లో ఎక్కువ శాతం దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారే మరణిస్తున్నట్లు అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కంటైన్‌మెంట్ జోన్లను ప్రకటించరు….ఫోన్లు ఎత్తరు…..
సిఎం చెప్పినా వైద్యాధికారుల్లో నిర్లక్షం…..

రాష్ట్రంలో కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్న విషయం విధితమే. అయితే సోమవారం జరిగిన సిఎం ప్రెస్‌మీట్‌లో గ్రేటర్ పరిధి మినహా మిగతా జిల్లాలన్నీ గ్రీన్‌జోన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. కేవలం జిహెచ్‌ఎంసి పరిధిలోనే కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయని, 1452 కుటుంబాల చుట్టూ పోలీస్ వలయం నిఘా ఉంటుందని, ప్రజలెవ్వరూ అటువైపు వెళ్లోద్దని స్వయానా సిఎం సూచించారు. కానీ ఆ కంటైన్‌మెంట్ జోన్లు ఎక్కడున్నాయో తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. జోన్ల వివరాలు ప్రకటించాలని సిఎం చెప్పినా, అధికారులు ఇప్పటి వరకు వెల్లడించలేదు. కనీసం ఆ ప్రాంతాల వివరాలు తెలిస్తే అటువైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉంటామని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా కంటైన్‌మెంట్ వివరాలు తమ దగ్గర లేవని ఒకరు, మాకు సంబంధం లేదని మరో శాఖ అధికారులు దాటవేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్పష్టమైన వివరాలు వెల్లడించి ప్రజలను అప్రమత్తం చేయాల్సింది పోయి, విషయాలను గోప్యంగా ఉంచడం ఎంత వరకు సబబు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు సిఎం, వైద్యమంత్రి కరోనా కట్టడి కోసం నిరంతరం శ్రమిస్తూంటే వైద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం కనీసం ఫోన్లకు కూడా స్పందించడం లేదు. దీంతో కొందరు అధికారులు నిర్లక్ష్యానికి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News