Home ఎడిటోరియల్ ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం!

ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం!

Sampadakiyam     మూలాలను ఛేదించకుండా పైపూతలతో సరిపుచ్చినంత కాలం జాతిని పీడిస్తున్న ఏ సమస్య సమగ్ర పరిష్కారానికి నోచుకోదు. మరింతగా పెరిగి పేట్రేగుతుంది. దేశ రాజకీయాల్లో నేర చరిత్రుల పైచేయి ప్రాబల్యాల సంగతి కూడా ఇటువంటిదే. నేరస్థులను రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉంచడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను వారం రోజుల్లో సిద్ధం చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ఎ న్నికల సంఘాన్ని శుక్రవారం నాడు ఆదేశించిన నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకంగా పరిణమించిన ఈ రోగం మళ్లీ ప్రస్తావనకు వచ్చింది. దీనికి ఎన్నికల సంఘం తయారు చేసే ఔషధం ఎలా ఉంటుంది, ఎంత వరకు నయం చేస్తుంది అనే దానిని అటుంచితే నేరస్థులకు చోటు లేని రంగంగా రాజకీయాలను ప్రక్షాళనం చేసి పరిశుద్ధం గావించడానికి ఇంతవరకూ జరిగిన ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయన్న చేదు సత్యాన్ని అంగీకరించక తప్పదు.

పోటీలోని అభ్యర్థులు తమపై గల కేసుల వివరాలను తెలియజేయాలని విధించిన షరతు వల్ల ఎటువంటి మేలూ జరగలేదు. రాజకీయాల్లో వారి ఉనికి మరింత పెరిగింది. 2019లో ఎన్నికయిన ప్రస్తుత లోక్‌సభ సభ్యుల్లో దాదాపు సగం మంది(43%) క్రిమినల్ కేసులున్నవారేనని 2014 కంటే 26 శాతం ఎక్కువని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఎడిఆర్) పరిశోధనలో వెల్లడయింది. ఎన్నికైన 539 మంది సభ్యుల్లో 233 మంది తమపై కేసులున్నాయని అఫిడవిట్‌లలో స్వయంగా వెల్లడించారు. 2009 నాటితో పోల్చుకుంటే ఈ సంఖ్య 44 శాతం ఎక్కువ. అంటే నేర చరితులకు చోటివ్వడంలో ఇప్పటి సభ గత రెండు లోక్‌సభల కంటే మించిపోయిందని స్పష్టపడుతున్నది. ప్రస్తుత లోక్‌సభ సభ్యుల్లో 159 మంది మీద అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన కేసులున్నాయని బయటపడింది. 10 మందిపై ప్రాథమిక స్థాయిలో శిక్షలు కూడా పడ్డాయి. 11 మంది మీద హత్యా నేరానికి సంబంధించి, 30 మంది మీద హత్యాయత్నానికి సంబంధించి నేరాలు రుజువయ్యాయి.

మహిళలపై అక్రమాల విషయంలో 19 మంది పార్లమెంటు సభ్యుల మీద నేర నిర్ధారణ జరిగింది. భారతీయ జనతా పార్టీకి చెందిన మొత్తం 301 మంది లోక్‌సభ సభ్యుల్లో 87 మంది మీద తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. అలాగే 51 మంది కాంగ్రెస్ సభ్యుల్లో 19 మంది మీద కేసులు డిక్లేరయ్యాయి. వాస్తవ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రాజకీయాలను నేరస్థ రహితం చేయడమనేది ఎంత హాస్యాస్పద లక్షమో చెప్పనక్కరలేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఏ నేరమూ చేయని వారు గెలవడానికి గల అవకాశాలు 4.7 శాతంగా ఉంటే నేరస్థులకు 15.5 శాతం అవకాశాలున్నట్టు ప్రస్తుత లోక్‌సభ సభ్యుల విజయావకాశాలపై ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ జరిపిన సర్వే వెల్లడించింది. అక్రమ ధనార్జనకు సందులు విశాలమవుతున్న కొద్దీ రాజకీయాల్లో నేరస్థుల ప్రవేశానికి ద్వారాలు మరింత బార్లాగా తెరుచుకుంటున్నాయి. బరిలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ఇచ్చే విరాళాల మీద ఆధారపడి ఉన్నంత కాలం అక్రమార్జన నుంచి వాటికి కేటాయింపులు పెరిగిపోతాయి.

ఓటర్లను డబ్బుకి, ఇతర ప్రలోభాలకి లోబర్చుకోడం అధికమవుతున్న కొద్దీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం అధికమవుతున్నది. ఆ డబ్బు విధిగా తప్పనిసరిగా అక్రమ ఆదాయపరుల నుండే వస్తుంది కాబట్టి రాజకీయాల్లో అక్రమార్కులకు చోటు రానురాను మరింత విశాలమవుతున్నది. కోర్టుల్లో క్రిమినల్ కేసులున్నవారెవరికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలగకుండా చూడాలని ఒక బండ గీత వంటి నిబంధనను విధిస్తే ప్రత్యర్థుల మీద అక్రమ కేసుల బనాయింపు కూడా ఉధృతమవుతుంది. అప్పుడు ఎవరు నిజమైన నేరస్థులో, ఎవరు నిజాయితీపరులో తేల్చడం పాలను నీటిని విడదీసేటంత కష్టతరమవుతుంది. కింది కోర్టుల్లో శిక్షపడిన వెంటనే నేరస్థులని అంతిమ నిర్ణయానికి రావడానికి కూడా వీల్లేదు. సుప్రీంకోర్టులోనే తీవ్రమైన శిక్షలు ధ్రువపడి శిక్షలు పొందుతున్న వారిని ఆ తర్వాత అమాయకులుగా గుర్తించి విడుదల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

పోలీసులు సమగ్ర విచారణ చేపట్టకుండానే నిరుపేద అమాయకుల మీద తీవ్రమైన నేరారోపణలతో అభియోగ పత్రాలు దాఖలు చేసినందువల్ల వారికి కఠిన శిక్షలు పడినట్టు బయటపడిన ఉదంతాలు లేకపోలేదు. అందుచేత రాజకీయాల నుంచి నేరస్థులను పూర్తిగా దూరంగా ఉంచడమనేది అనుకున్నంత సుళువైన వ్యవహారం కాదు. అలాగని దానిని పట్టించుకోకుండా ఉండడమూ ప్రమాదకరమే. ప్రజల్లో చైతన్యం పెరిగి డబ్బుకు ఓటు అమ్ముకోడమనే జాడ్యం అంతం అయ్యేంత వరకు ఈ సమస్య పీడిస్తూనే ఉంటుంది. 70వ రాజ్యాంగ అవతరణ దినం జరుపుకుంటున్న సమయంలోనైనా నేతల్లో, జాతిలో ఆత్మ విమర్శ కలగాలి.

43% newly-elected Lok Sabha MPs have criminal record