Home జాతీయ వార్తలు 45 రాగానే రిటైర్మెంట్‌కు సిద్ధం!

45 రాగానే రిటైర్మెంట్‌కు సిద్ధం!

ఒత్తిళ్ల ఉద్యోగాల నుంచి విముక్తికి అత్యధికుల  సన్నాహాలు

riteredముంబై : పని ఒత్తిడిని తట్టుకోలేక  45  సంవత్సరాలు పైబడ్డ వివిధ వృత్తుల ఉద్యోగులలో  61  శాతం వరకూ వచ్చే ఐదేళ్లలో  రిటైర్ కావాలనుకుంటున్న ట్లు వెల్లడైంది. పని సంబంధిత ఒత్తిళ్లను తట్టుకోలేకపోతు న్నామని మానసికంగా, శారీరకంగా తమపై ప్రభావం పడుతోందని, అందుకే 50 ఏళ్లు వచ్చే నాటికి జాబ్‌ల నుంచి వైదొలిగి ఆరోగ్యాలను రక్షించుకోవాలను కుంటున్నారని  ఓ సర్వేలో స్పష్టం అయింది. 45 ఏళ్లు దాటిన వారు తమ పని ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. దీని ప్రభావంతో వారు మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నారు. అయితే అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నా, అన్ని విధాలుగా కుంగిపోతున్నా రిటైర్ కాలేకపోతున్న వారూ ఉన్నారని ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఏదో విధంగా నెట్టుకువస్తున్నారని హెచ్‌ఎస్‌బిసి సర్వేలో స్పష్టం అయింది. గ్లోబల్ బ్యాంక్ హెచ్‌ఎస్‌బిసి తాజాగా ఉద్యోగులలో రిటైర్మెంటు ఆలోచనల గురించి సర్వే నిర్వహించింది.  సర్వే అనంతరం వెల్లడైన నివేదికలో భారతదేశంలో  45  దాటితే చాలు ఇక ఉద్యోగులలో చాలావరకూ విశ్రాంతి కోరుకుంటున్నారని స్పష్టం అయింది. ఆరోగ్యంగా ఉండాలంటే చేస్తున్న తీవ్రస్థాయి ఒత్తిళ్ల ఉద్యోగాలను మానుకోవడం తప్ప మరో మార్గం లేదని అత్యధికులు అభిప్రాయ పడుతున్నట్లు తేటతెల్లం అయింది. ప్రస్తుతం వివిధ స్థాయిల ఉద్యోగాలలో ఉన్న వారిలో అత్యధికులు అంటే దాదాపు  61  శాతం వరకూ  45 ప్లస్ వారు రిటైర్మెంట్ వయస్సుకు ముందుగానే అంటే వచ్చే ఐదేళ్లలోనే అంటే తమ  50 ఏళ్ల ప్రాయంలో జాబ్‌లకు సెలవు అనే స్థితి ఏర్పడిందని ఇది ఇండియాలో నెలకొన్న కీలక పరిణామం అని వెల్లడించారు. అయితే తాము రిటైర్ కావాలనుకుంటున్నామని, కోరుకున్న విధంగా విశ్రాంతి తీసుకుంటేనే ఆనందంగా ఉండగలిగే పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తున్నామని అయితే ఆర్థిక పరిస్థితులతో ఆ పనిచేయలేకపోతున్నామని  14  శాతం మంది ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఆర్థికంగా పలు సమస్యలతో ఉన్నప్పుడు తప్పనిసరిగానే జాబ్‌లు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. సరైన విధంగా చిన్న వయస్సులోనే పొదుపు పథకాలలో చేరడం ఇతరత్రా డబ్బుల సంపాదనకు దిగితే కానీ భారతీయులకు అనుకున్న విధంగా సత్వర పదవీ విరమణ , విశ్రాంత జీవిత పరిస్థితి ఏర్పడదని, ఓ వైపు ఉద్యోగాలలో పలు రకాలుగా మానసిక , శారీరక వేధింపులకు గురి అవుతూ అనివార్యంగా విధులు నిర్వర్తించడం పలు రకాల ఇతరత్రా పరిణామాలకు దారితీస్తోందని సర్వేలో వెల్లడైంది. ఉద్యోగులలో అత్యధికులు తమ  45వ ఏటనే వచ్చే ఐదేళ్లలో తాము రిటైర్ అవుతామని నిట్టూర్చడం దేశంలో ఉద్యోగ స్థితిగతులు దానితో పాటు సామాజిక కుటుంబ జీవన విధానాలు ఇతర అంశాల ప్రస్తావనకు కూడా దారితీస్తోందని, ప్రత్యేకించి ఉద్యోగ వాతావరణం పనితీరు వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయని విశ్లేషిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో రిటైర్ కావాలనుకుంటున్న వారిలో  43  శాతం వరకూ కుటుం బంతో మరింత ఎక్కువ సేపు  గడపాలనుకుంటున్నామని చెపుతున్నారు. ఇతరులు అంటే  34  శాతం వరకూ  దూర ప్రాంతాలలో పర్యటించి రావాల నుకుంటున్నారు. ఇక తమకు ఇష్టమైన అలసట లేని ఇతర పనులు లేదా సేవా కార్యక్రమాలకు దిగాలనుకుంటున్నారు. అత్యధికులు తోటలు పెంపకం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సాంస్కృతిక సందట్లో సడేమియాలకు సిద్ధం అవుతున్నారు. ఏది ఏమైనా అసాధారణ రీతిలో  45  ఏళ్లు దాటగానే చేసే పనులకు రాం రాం అనుకునే పరిస్థితులు ఏర్పడటం మానవ వనరుల అంశానికి సంబంధించి ప్రత్యేకంగానే నిలుస్తుందని విశ్లేషించారు. కొన్ని దేశాలలో రిటైర్‌మెంట్ వయస్సు దాటిన తరువాత కూడా ఉద్యోగ సామర్థంతో ఉండటం, ఇతర ఉద్యోగాలకు వెళ్లడం, వంటి పరిణామాలు ఉంటున్నాయి. పని పరిస్థితులు ఉద్యోగుల పట్ల వ్యవహారశైలి అనేదానిని బట్టే చాలా మంది తమ రిటైర్మెంట్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలా మంది గడువుకు ముందు రిటైర్ కావాలనుకోవడం ఉద్యోగ ప్రతికూల పరిస్థితుల ప్రభావం అని వెల్లడైంది. రిటైర్మెంట్ అనేది కొన్ని దేశాలలో ఉన్న పరిస్థితులను బట్టి సరికొత్త జీవితాలను నిర్ధేశించుకునేందుకు అందివచ్చే అవకాశంగా ఉంటోంది. సరైన రీతిలో వృత్తి ధర్మం నిర్వహించే పరిస్థితి ఉన్నవారే సంతోషంగా రిటైర్ అయిన వారే తరువాత కూడా ఉత్సాహంతో సరికొత్త విరమణానంతర జీవితాలకు ఉద్యుక్తులు అవుతున్నట్లు వెల్లడవుతోంది. ఉద్యోగాలలో  50  దాటినా కొనసాగితే తమకు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని భావించే వారు కొందరయితే, అనారోగ్య పరిస్థితులతో ముందుగానే ఉద్యోగాలు బాగా ఉన్నా పదవీ విరమణకు దిగాలనుకుంటున్న వారు మరికొందరు  ఉన్నట్లు సర్వేలో వెల్లడయింది. భారతదేశంలో సరైన రిటైర్ అనంతర భద్రతా ప్రణాళికలు లేకపోవడం కూడా ఉద్యోగులలో తీవ్రస్థాయి ఆందోళనకు దారితీస్తోందని, అంతేకాకుండా, కేవలం వేతనాలు తప్ప ఇతరత్రా ఉద్యోగులకు సరైన భావి పథకాలను కల్పించని ఆకర్షణీయ సంస్థల ధోరణి వల్ల కూడా విచిత్ర పరిస్థితి ఏర్పడుతోంది. ఇక భారతీయులలో ప్రతి ఐదుగురిలో ఒకరు విధి లేని స్థితిలో ఎప్పటికైనా తాము స్వచ్ఛందంగా ఆనందంగా పదవీ విరమణ లేక, విధుల నుంచి విశ్రాంత పరిస్థితి పొందుతామా? అనే ఆందోళనలకు గురి అవుతున్నారని  హెచ్‌ఎస్‌బిసి ఇండియా రిటైల్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్ మెంట్ అధికారి ఎస్ రామకృష్ణన్  ఈ సర్వే ప్రాతిపదికన తెలిపారు.