Home తాజా వార్తలు సుస్తీ లేని బస్తీలు

సుస్తీ లేని బస్తీలు

 45 new Basti Dawakhanas opened in Hyderabad

 

45 బస్తీ దవాఖానాలు ప్రారంభం

పేదలకు ఉచిత వైద్యం పరిసరాల్లోనే ప్రాథమిక చికిత్స అందిస్తున్నాం
ప్రజల నుంచి మంచి స్పందన
భవిష్యత్‌లో మరిన్ని బస్తీ దవాఖానాలు
వెంగళ్‌రావు నగర్ ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్
భాగ్యనగరం బస్తీ దవాఖానాలతో మురిసిపోయింది : మంత్రి ఈటల

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానల సంఖ్యను పెంచుతున్నామని మున్సిపల్‌శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.

పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 45 బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి. వీటిని ఆయా ప్రాంతాల్లో డిప్యూటి స్పీకర్ పద్మారావ్‌గౌడ్‌తో పాటు మంత్రులు కెటిఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, హారిష్‌రావు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారికంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా హైదరాబాద్ ఎర్రగడ్డలోని సుల్తాన్ నగర్, యాదగిరి నగర్‌లలో బస్తీ దవాఖానలను మంత్రి కెటిఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు ప్రాథమికంగా మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న బస్తీ దవాఖానాలకు అదనంగా శుక్రవారం మరో 45 దవాఖానలను ఒకేరోజు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ ఆసుపత్రులు ద్వారా ప్రజలకు మరిన్ని వైద్యసేవలు వారి పరిసరాల్లోనే అందుతాయని స్పష్టం చేశారు. స్థానిక పేద ప్రజలకు అవసరమైన రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య సదుపాయాలు సైతం ఈ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. యాదగిరినగర్ బస్తీ దవాఖానను ప్రారంభించిన అనంతరం మంత్రి కెటిఆర్ ఆసుపత్రుల్లోని వైద్య సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం అక్కడి వైద్య సిబ్బంది మంత్రికి బాడీ టెంపరేచర్ తోపాటు బిపిను చెక్ చేశారు. తర్వాత ఆ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన వృద్ధురాలి యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. “ అవ్వా ఎలా ఉన్నావ్ ? అని మంత్రి అడగగా, ఇప్పటిదాకా తాను ప్రయివేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేపించుకుంటున్నానని ఆ వృద్ధురాలు సమాధానం ఇచ్చింది.

దీనికి మంత్రి స్పందిస్తూ ఇకపైన ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లకుండా స్థానికంగానే మీ బస్తీలోనే మంచి వైద్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రతి రోగికి అవసరమైన చికిత్సతో పాటు మందులు సైతం అందుబాటులో ఉంటాయని, ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఆ వృద్దురాలికి మంత్రి కెటిఆర్ తెలియజేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న బస్తీ దవాఖానలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్న నేపథ్యంలో వీటిని మరింతగా విస్తరించే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

భాగ్యనగరం బస్తీ దవాఖానాలతో మురిసిపోయింది : మంత్రి ఈటల
భాగ్యనగరం బస్తీ దవాఖానలతో మురిసిపోయిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. వందలాది పేద బస్తీలకు వైద్యం ముంగిట్లోకే వచ్చిందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 122 బస్తీ దవాఖానాలు ఉండగా, శుక్రవారం 45 ప్రారంభించామని, భవిష్యత్‌లో మరో 30 దవాఖానాలను అందుబాటులోకి తెస్తామన్నారు. శుక్రవారం మంత్రి ఉప్పల్, బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన నూతన బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ఈసందర్బంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెంచుతున్నామన్నారు. పేదలు ప్రైవేట్ వైద్యంపై ఆధారపడకుండా అద్బుతమైన వైద్యం అందించేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

బస్తీ దవాఖానల్లో స్క్రీనింగ్‌తో పాటు మందులు కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఇక్కడ టెస్టులు చేయడానికి అవసరం లేకపోయినా, శాంపిల్స్ తీసి నారాయణగూడ ఐపిఎం ల్యాబ్‌కు పంపుతున్నామని తెలిపారు. అక్కడ వ్యాధి నిర్ధారణ అయితే ప్రభుత్వాసుప్రతులకు రిఫర్ చేస్తున్నట్లు చెప్పారు. బస్తీవాసులు ఖచ్చితంగా ఈ సేవలను వినియోగించుకొని వైద్యారోగ్యశాఖకు మరింత ప్రోత్సాహం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు బస్తీ దవాఖానలు తెరిచి ఉంటాయని , కార్పొరేటర్లు, కాలనీ వాసులు బస్తీ దవాఖానాల నిర్వహణలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.