Home తాజా వార్తలు రెమ్‌డిసివర్ ఇంజక్షన్ల బ్లాక్ దందాకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

రెమ్‌డిసివర్ ఇంజక్షన్ల బ్లాక్ దందాకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

5 arrest in remdesivir black marketing gang busted

వరంగల్ క్రైం/గీసుకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ సంఖ్యలో రెమిడిసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముతున్న ఐదుగురు సభ్యుల ముఠాను గీసుకొండ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుండి 42 రెమిడిసివర్ ఇంజక్షన్లతో పాటు రూ.లక్ష 69 వేల నగదు, ఒక కారు, ఒక ద్విచక్రవాహనం, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించి ఈస్ట్‌జోన్ డిసిపి వెంకటలక్ష్మి వివరాలను వెల్లడించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో చందా విజయ్‌కుమార్ ల్యాబ్ టెక్నిషియన్, హైదరాబాద్, చింతం రాజేష్, ఊరుగొండ వరంగల్ రూరల్ జిల్లా, ముందాటి గోపాల్ మెడికల్ రిప్రజెంటేటివ్ హన్మకొండ, గట్టు అవినాష్ ల్యాబ్‌టెక్నిషియన్ ధర్మారం, వావిల సురేష్ మెడికల్ షాపు వరంగల్ అని తెలిపారు.

ఈ ముఠా సభ్యులు గీసుకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గొర్రెకుంటలోని కరోనా వ్యాధిగ్రస్తుడికి రెమిడిసివర్ ఇంజక్షన్లను అందజేసేందుకు నిందితులు కట్టమల్లన్న గుడి వద్ద ఉన్నట్లుగా సమాచారం రావడంతో పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి సూచనల మేరకు గీసుకొండ పోలీసులు కట్టమల్లన్న దేవాలయం ప్రాంతంలో అనుమానస్పదంగా కారు, ద్విచక్రవాహనాలపై ఉన్న నిందితులు పోలీసులను చూసి తప్పించుకొని పోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నిందితులు రెమిడిసివర్ ఇంజక్షన్లను అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా పోలీసుల ఎదుట అంగీకరించారని పేర్కొన్నారు. నిందితులను సకాలంలో అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన మామునూరు ఎసిపి నరేష్‌కుమార్, గీసుకొండ ఇన్స్‌పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సైలు అబ్దుల్ రహీం, రాజు, పవన్‌కుమార్, కిషన్‌లను సిపి తరుణ్‌జోషి అభినందించారు.

Five arrest in remdesivir black marketing gang busted