Home తాజా వార్తలు అబూజ్‌మడ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్

అబూజ్‌మడ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్

Encounter

మావోల శిక్షణ శిబిరంపై పోలీసుల దాడి
ఐదుగురు మావోయిస్టులు మృతి
మృతుల్లో ఒక మహిళ, నలుగురు పురుషులు
ఇద్దరు జవాన్లకు గాయాలు

మన తెలంగాణ/కొత్తగూడెం : ఛత్తీస్‌గఢ్‌రాష్ట్రంలోని అబూజ్‌మడ్ ప్రాంతంలో శనివారం ఉదయం సుమారు ఆరుగంటల ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందగా ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ డిజిపి అవస్థి ధృవీకరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా, ఓర్చా పోలీసుస్టేషన్‌కు సుమారు 19 కిలోమీటర్ల దూరంలోని దుర్వేధ అటవీ ప్రాంతం దగ్గర గుమ్మర్క అడవిలో మావోయిస్టు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని తెలియడంతో డిఆర్‌జి, ఎస్‌టీఎఫ్ పోలీసు టీం దాడి చేశారు. ముందుగా మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా పోలీసులు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు. దాదాపు గంటన్నరపాటు మావోయిస్టులకు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులు డిస్ట్రిక్ట్‌గార్డ్ (డిఆర్‌జి) బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పులు జరుపుతూ మావోయిస్టులు సురక్షితమైన ప్రాంతానికి తప్పించుకుపోయారు.

అనంతరం కాల్పులు జరిగిన ప్రదేశాన్ని గాలించగా ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. మృతుల్లో ఒక మహిళ, మిగతా పురుషుల మృతదేహాలున్నాయి. కొందరు మావోయిస్టులు కూడా గాయపడటంతో వారిని మిగతా సహచరులు ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. కాగా కాల్పుల్లో ఇద్దరు జవాన్లుకూడా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. సంఘటనా స్థలం నుంచి ఒక 12 బోర్ రైఫిల్, 315 బోర్ పిస్టల్, కొన్ని నక్సల్స్‌కు సంబంధించి డాక్యుమెంట్లు, మందులు, నిత్యావసరాలు, పేలుడు పదార్థాలు, ఐఇడి బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ జవాన్లను చికిత్స కోసం తరలించారు.

5 Maoists killed in encounter in Chhattisgarh