Home ఎడిటోరియల్ ప్రైవేటు రైలు కూత!

ప్రైవేటు రైలు కూత!

Sampadakiyam        ఇక నుంచి మన రైళ్లు ఎన్నడూ లేనంతగా ప్రైవేటు కూత పెట్టనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తాజా బడ్జెట్‌లో ఇందుకు బార్లా దారులు వేశారు. రైల్వేల సామర్థాన్ని ప్రమాణాలను పెంచడానికి, అందుకవసరమైన 50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వ్యయాన్ని సమీకరించడానికి, అదనపు రైలు మార్గాలు, ఆధునిక బోగీలు సమకూర్చుకోడానికి ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించవలసి ఉన్నదని ఆమె బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంగా ప్రకటించారు. అంతేకాకుండా భారత ప్రైవేటు కార్పొరేట్ రంగం ఘనతను ప్రస్తుతించారు. ఉద్యోగాల కల్పనలో, సంపద సృష్టిలో మన కార్పొరేట్ రంగం అందెవేసిన చేయి అని కొనియాడారు. ఇందుకు కొంచెం భిన్న స్వరం అనిపించేలా రైల్వేలను ప్రైవేటుపరం చేయబోమని ఆ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ శుక్రవారం నాడు లోక్‌సభలో ప్రకటించారు.

అయితే రైల్వేలను ఆధునికం చేయడానికి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తామని ఆయన కూడా సెలవిచ్చారు. అంటే ప్రైవేటు యాజమాన్యాలు దండిగా లాభాలు చేసుకోడానికి అనువుగా రైల్వేను వారికి పూర్తిగా అందుబాటులో ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. రైలు మార్గాల విస్తరణ, ఆధునికీకరణ కార్యకలాపాల్లో ప్రైవేటుకు హద్దులు లేని అవకాశాన్ని కల్పిస్తారన్న మాట. దాని ప్రభావం ఎలా ఉండబోతుంది, అంతిమంగా భారత రైల్వేల భవిష్యత్తు ఏమి కానున్నది అనేవి కీలక ప్రశ్నలు. అత్యాధునికమైన బోగీలతో, స్టార్ హోటళ్ల స్థాయి సౌకర్యాలతో గంటకు 200 కిలో మీటర్లకు మించిన అమిత వేగంతో పరుగెత్తి ప్రయాణికులకు వినూత్న అనుభవాన్ని, ఆనందాన్ని కలుగజేసే ప్రైవేటు రైళ్లను అనుమతించడం ద్వారా భారత రైల్వేలలో పోటీని ప్రోత్సహించాలని వివేక్ దేవ్‌రాయ్ కమిటీ 2015లోనే సిఫారసు చేసింది.

అది ఇన్నాళ్లకు పరిపూర్ణంగా అమలు కాబోతున్నది. ప్రభుత్వ రంగంలోని రైళ్లను ఆధునికీకరించకుండా, వాటిని నడిపే తీరులో విప్లవాత్మకమైన మార్పు తీసుకురాకుండా అత్యధునాతన పోకడలు పోయే ప్రైవేటు నుంచి పోటీని అనుమతించడం బలహీనుని మీదికి బాహుబలి వంటి బలాఢ్యుడిని ఉసి గొల్పడమే అవుతుంది. దీని వల్ల అంతిమంగా రైల్వేలు ప్రభుత్వం చేజారిపోయే ప్రమాదం తల ఎత్తినా ఆశ్చర్యపోవలసిన పని ఉండదు. అత్యాధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటు చార్జీలను నిర్ణయించుకునే స్వేచ్ఛను కూడా ప్రైవేటు యాజమాన్యాలకు ఇవ్వనున్నట్టు బోధపడుతున్నది. అప్పుడు ప్రైవేటు కార్పొరేట్ రంగం నడిపే రైళ్లలో ప్రయాణం సంపన్న, పై మధ్య తరగతి వర్గాలకే పరిమితమవుతుంది.

రైల్వే శాఖ నడిపించే రైళ్లు పూర్తిగా జనతా బళ్లుగా మారిపోతాయి. రైల్వేలు పేద ధనిక విభాగాలుగా చీలిపోతాయి. ఒకే పట్టాలపై ఇలా రెండు వర్గాలకు చెందిన రైళ్లు నడపడం రైల్వేలో సాధారణ ప్రజల ప్రయాణాన్ని దెబ్బ తీస్తుంది. 201718 ఆర్థిక సంవత్సరంలో మన రైళ్లు 826 కోట్ల మంది ప్రయాణికులను గమ్యాలకు చేర్చాయి. వీరిలో అత్యధిక శాతం సాధారణ మధ్య తరగతుల ప్రయాణికులేనన్నది నిర్వివాదం. ప్రైవేటుకు చోటు పెరిగిన కొద్దీ పేదలు ప్రయాణం చేసే రైళ్లు నడపడం లాభ సాటి కాదనే అభిప్రాయం చోటు చేసుకోడం ప్రారంభమవుతుంది. పర్యవసానంగా ప్రభుత్వ స్కూళ్లను మూసి వేస్తున్న చందంగానే పబ్లిక్ రైళ్లను ఉపసంహరించుకోడం తథ్యమవుతుంది. ప్రభుత్వం పని కట్టుకొని పబ్లిక్ రంగంలోని రైళ్లపై ఖర్చు తగ్గించుకుంటే చివరికి రైల్వేలను ప్రైవేటుకు అప్పగించక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. ఏ ఆశయంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో రైల్వే శాఖను అభివృద్ధి చేశారో అది పూర్తిగా దెబ్బ తింటుంది.

రైల్వేలపై ఆధారపడి బతుకుతున్న సిబ్బంది వారి కుటుంబాలు వీధిన పడే దుర్గతి దాపురిస్తుంది. రైల్వేలను ఆధునికీకరించడం, ప్రయాణ సౌకర్యాలను మెరుగుపర్చడం, రైళ్ల వేగాన్ని పెంచి గమ్యాల మధ్య సమయ దూరాన్ని తగ్గించడం ఎంతైనా అవసరమే. అందుకోసం శతాబ్దాలుగా పెంచి పోషిస్తూ వచ్చిన రైలేను క్రమ క్రమంగా ప్రైవేటు హస్తగతం చేయడం ఆ విధంగా రైలు ప్రయాణాన్ని సాధారణ ప్రజలకు దూరం చేయడం ఏ విధంగా చూసినా అభివృద్ధి అనిపించుకోదు. 5 లక్షల కోట్ల డాలర్ల సంపద గల దేశంగా భారత్‌ను అవతరింప చేసే లక్షం ఎంత గొప్పదో దాని ఫలితం సాధారణ భారతీయులందరి జీవితాల్లో ప్రతిఫలించేలా చూడడం కూడా అంతే ఆవశ్యకం. ఊర్ధముఖ అభివృద్ధి కొద్ది మంది సంపన్నులను మహా ధనికులను చేస్తుంది. దానికి బదులుగా దేశ ప్రజలందరినీ అక్కున చేర్చుకొని సమానంగా స్పృశించే అభివృద్ధి వికాసాలను సాధిస్తే అవి జాతిని పీడిస్తున్న దారిద్య్రాన్ని తొలగించి భవ్యపథంలో నడిపిస్తాయి.

50 lakh crore investment for private railways in budget