Home తాజా వార్తలు దేశంలో ఏటా 50వేల మంది అదృశ్యం

దేశంలో ఏటా 50వేల మంది అదృశ్యం

50 thousand disappear annually in the country

దేశం లోని వివిధ రాష్ట్రాల్లో ఏటా 50 వేల మంది మహిళలు, పిల్లలు అదృశ్యమవుతున్నారు. వీరిలో నేపాల్ బాలికలే ఎక్కువ . దేశం లోని వివిధ చోట్ల వ్యభిచార గృహాల్లో మగ్గిపోతున్న నేపాల్ బాలికల సంఖ్య 2 లక్షల వరకు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. దేశం లోని 678 జిల్లాల్లో 409 జిల్లాలు పసివాళ్లకు మనుగడ సాగించ లేని దుస్థితిలో ఉంటున్నాయి. ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పిల్లల అదృశ్యం ఎక్కువగా కనిపిస్తోంది. కిడ్నాప్‌కు గురైన ఆడపిల్లలను వ్యభిచార గృహాలకు అమ్మివేయడం పెద్ద వ్యాపారంగా సాగుతోంది. అలా వ్యభిచార గృహాలకు చేరిన పిల్లలు నరకం చూస్తున్నారు. తమ మాట వినేవరకు పచ్చి మంచినీళ్లయినా ఇవ్వరని ఎక్కడికీ కదలనీయకుండా నిర్బంధిస్తుంటారని నిరూపించే కొన్ని సంఘటనలు ఇటీవల బయటపడ్డాయి. వ్యభిచార నిర్వాహకులు ఈ బాలికలచే వ్యభిచారం చేయించడం తోనే ఆగడం లేదు. నీలి చిత్రాలను చిత్రీకరించి మరింత సొమ్ము చేసుకుంటున్నారు.

అక్షరం తెలియని బాలలు, అర్థంతరంగా చదువు మానేసిన వాళ్లు, సరైన తిండి లేక ఆలనాపాలనా చూసే వారు లేక అలమటించే బాలలు ఇంటి నుంచి ఎలాగోలా బయట పడుతున్నారు. అలాగే ముక్కుపచ్చలారకముందే మూడు ముళ్లు వేయించుకోడానికి సిద్ధమవుతున్న పసిమొగ్గలు, తల్లిదండ్రులతో పాటు పనిలో చేరిన బాల కార్మికులు అక్రమ రవాణా మార్గంలో అదృశ్యమై పోతున్నారని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ తన నివేదికలో వెల్లడించింది. దేశం లోని ఏ జిల్లాలో పిల్లలకు ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో స్పష్టం చేసింది. ఒడిశా, బీహార్, పశ్చిమబెంగాల్, ఆంధ్ర రాష్ట్రాల్లో పిల్లల అదృశ్యం, కిడ్నాప్ సంఘటనలు ఎక్కువగా ఉంటున్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో బాలల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా ఉంటోందని నివేదిక వెల్లడించింది.

నిమ్మకు నీరెత్తుతున్న కేసుల దర్యాప్తు : పిల్లల కిడ్నాప్, అదృశ్యం కేసులు లెక్కకు అందకున్నంత ఎక్కువగా ఉన్నా ఈ కేసులపై దర్యాప్తు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు సాగుతోంది. ఈ సమస్య అంతర్జాతీయంగా హేగ్ సదస్సు లో కూడా చర్చకు వచ్చింది. అయినా పాలక వర్గాలు మాత్రం తమ ధోరణిలో మార్పు తెచ్చుకోవడం లేదు. పిల్లల కిడ్నాప్ ముఠాల వెనుక బడా ప్రముఖుల అండదండలు ఉన్నందున పోలీసులు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

విద్యాహక్కు చట్టానికి దిక్కేది? : ఇక బాలల చదువులు, ఆరోగ్యం, సంక్షేమం, తదితర అంశాలను పరిశీలిస్తే 14 ఏళ్ల వయస్సు వచ్చేవరకు ఉచితంగా తప్పనిసరిగా చదువు నేర్పించాలన్న విద్యాహక్కు చట్టం ప్రభుత్వ నిర్వాకం వల్ల నీరుగారి పోయింది. యునిసెఫ్ నివేదిక పరిశీలిస్తే నివారించ దగిన వ్యాధులైనప్పటికీ ఏటా ఈ వ్యాధుల బారిన పడి దేశంలో 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్నిబట్టి బాలల ఆరోగ్యంపై పాలకవర్గాలు ఏపాటి శ్రద్ధ చూపిస్తున్నాయో తెలుస్తుంది. ఈ విధంగా చనిపోతున్న వారిలో 47 శాతం మరణాలు మశూచి, ధనుర్వాతం, వంటి వ్యాధుల వల్లనే సంక్రమిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, అస్సాం, రాష్ట్రాల్లో ఈ మరణాలు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. ఈ వ్యాధుల నివారణకు కావలసిన వ్యాక్సిన్ ఆస్పత్రుల్లో లభ్యం కాకపోవడమే మరణాల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తోంది.
 -మన తెలంగాణ/ పరిశోధన విభాగం