Wednesday, April 24, 2024

ఇబ్రహీంపట్నం @ 50000 కాంగ్రెస్ సభ్యత్వాలు

- Advertisement -
- Advertisement -

పట్నం కాంగ్రెస్‌లో సీటు కయ్యం …!
ఆశవాహనులలో అదృష్టవంతులు ఎవరు ?

Cong protests against petrol, diesel, gas cylinder prices hike
మన తెలంగాణ/ఇబ్రహీంపట్నం : టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి నియామకం తరువాత కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ పెరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఏట్టకేలకు 50 వేలకు చేరింది. నాయకులు కలిసి కట్టుగా సభ్యత్వం చేర్పించినట్లైతె మరో 10వేలు దాటనుందని క్రింది స్థాయి నాయకులు అంటున్నారు. ఇప్పటికైనా సభ్యత్వం తీరు ఆమోగమని నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. సభ్యత్వ తీరును చూస్తుంటె వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు సునాయాసంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పిసిసి చీఫ్ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేయాలనే సంకల్పంతోనే నాయకులు ప్రతి గడప గడపకు వెళ్ళాలని, ప్రజా సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకపోయి సమస్యలు పరిష్కరించాలి అనే సిద్దాంతం ప్రణాళికలతో పొందు పర్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ తీరు చక్రబందంగా ఉంది. దీన్ని ఎవరు కాపాడలేరు బాబోయ్ అంటు క్రింది స్థాయి నాయకులు సైతం వాపోతున్నారు.

టిపిసిసి ఆదేశాలు భేఖాతర్ …

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిని చూసి సీనియర్లు సైతం వర్గపోరుకు టిపిసిసి కళ్ళెం వేస్తున్నప్పటికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వర్గ పోరుకు కళ్ళెం వేయలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే నాలుగైదు గ్రూపులుగా చలామణి అవుతూ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంది. ఈ మద్యనే టిపిసిసి ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై పెట్రోల్ , డిజిల్ గ్యాస్ ధరలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, ధర్నా, కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించినప్పటికి నియోజకవర్గ ఇన్‌చార్జీ నాలుగు మండలాలలో సైతం ఎక్కడ పాల్గొనలేదు. గ్రూపుల మద్య సఖ్యత లేక పోవడంతో సీనియర్లు సైతం రాస్తారోకోలకు గానీ , ధర్నాలకు, నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీనిపై టిపిసిసి అధ్యక్షులు సైతం ఆగ్రహాంతో ఉన్నారు. టిపిసిసి ఆదేశాలను సైతం భేఖాతర్ చేశారు. త్వరలో గ్రూపులకు కళ్ళె వేసే అవకాశాలు ఉన్నాయి. కేవలం యువ నాయకులు పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు పట్నం నియోజకవర్గ కేంద్రంలో కార్యాక్రమాలు నిర్వహించిన యువ నాయకులు చిలుక మధుసూధన్ రెడ్డి ఆద్వర్యంలో నిరసన, ధర్నా, రాస్తా రోకో కార్యక్రమాలు నిర్వహించారు. బాబు జగజీవన్‌రాం జయంతిలో పాల్గొన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు సైతం డా: బాబు జగజీవన్‌రాం జయంతి వేడుకలలో సైతం పాల్గొనలేదు .

కయ్యం పెడుతున్న సీటు పంచాయితీ …..

మరో రెండేళ్ళలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పటి నుండె సీటు కోసం కుస్తీ పడుతున్నారు. ఎవరి దీమా వారిదే . తమకే వస్తుందని లేదు తమకే వస్తుందని దీమా వ్యక్తం చేస్తు పనిలో పడ్డారు. పార్టీ కార్యక్రమాలలో పెద్ద పాల్గొనడం లేదు. వ్యక్తిగా వచ్చి పదిమందితో ఏదైనా కార్యాక్రమాన్ని చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఎవరికి ఆపద వచ్చిన రారనే ఆపవాదు ఉంది. ఆయనకు అతి సన్నితంగా ఉన్న వ్యక్తులు ఈమద్యనే దూరమైనట్లు తెలుస్తుంది. త్వరలో మరికొంత మంది కూడ దూరమైయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రేవంత్‌రెడ్డి మెప్పు కోసం ఆయన చుట్టు తిరుగడం తప్పా ప్రజలలోకెళ్ళి సమస్య పరిష్కరించే ఆలోచన లేదని సీనియర్ నేతలు సైతం వాపోతున్నారు. మరోకరు తనదైనా శైలీలో ఎక్కడ ఆపద వచ్చిన నేనున్నానని వారికి తోచిన సహాయం చేయడం వారిలో ఆత్మ స్తైర్యం నింపడం పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటు ఇప్పటినుంచే ప్రచారం చేస్తు ప్రజల మధ్యన ఉంటున్నారు. తమకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, డైనమిక్‌లీడర్ మాజీ మంత్రి, భువనగిరి పార్లమెంటు సబ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆశీస్సులు ఉన్నాయని తప్పకుండా తమకే సీటు వస్తుందని దీమాతోనే ఉన్నారు. మరొకరు స్వంతంగా పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తు నియోజకవర్గంలో తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించి వచ్చే ఎన్నికలలో పోటి చేయాలనే దృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఆయనకు కూడ రేవంత్‌రెడ్డి ఆశీస్సులు ఉన్నాయని తమకే టికెట్ లభిస్తుందనే దీమాతో ఉన్నారు. ఈ మద్యనే పార్టీ సభ్యత్వ భీమా కోసం ప్రత్యేక నిధిని టిపిసిసి అధ్యక్షులకు అందజేసి ఆయన మన్నలను పొందే ప్రయత్నం చేస్తున్నారు.

యువతకు పట్నంలో ఇన్‌చార్జీ బాద్యతలు …

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గ్రూపుల మద్య సమన్వయం లేకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సమరం చేయాల్సిన సమయంలో సీనియర్ నేతలు మల్‌రెడ్డి రంగారెడ్డి, మర్రి నిరంజన్‌రెడ్డి, కోదండరెడ్డి, దండెం రాంరెడ్డిలు సైతం దూరంగా ఉండడంతో యువనాయకులు సైతం టిపిసిసి ఆదేశాలను తూచ తప్పకుండా కార్యాక్రమాలు చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. రాబోవు రోజులలో యువతకు ఇన్‌చార్జీగా నియమిస్తే మరో రెండేళ్ళలో పార్టీని బలోపేతం చేసే దిశలో ఉంటారని టిపిసిసి చీఫ్ ఆలోచన ఉందని తెలుస్తుంది. ఇప్పుడున్న నియోజకవర్గ ఇన్‌చార్జీ అధికార పార్టీపై పోరాడటానికి వెనుకంజ వేయడానికి గల కారాణాలను వెతుకుతున్నట్లు తెలిసింది. త్వరలో యువతకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనతోనే ఈ ప్రాంతానికి తరుచుగా వస్తూ పార్టీ కార్యక్రమాలలో భాగాస్వాములైవుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇదే నిజం కావచ్చని కొంత మంది నాయకులు సైతం చెప్పుకొస్తున్నారు.

సీటు అదృష్టవంతులెవరో …

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ సీటు అదృష్టవంతులెవరోనని ఆ పార్టీ నేతలలో ఇప్పటి నుంచే చర్చ జరుగుతుంది. ఆ అదృష్టవంతులెవరో ఆరు నెలల ముందే ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఎఐసిసి తేల్చి చెప్పింది. అవకాశం కోసం ఇప్పటికైనా అధికార పార్టీపై పోరు చేసి ప్రజల మన్ననలు పొంది సీటు దక్కించుకుంటారా లేక వర్గ పోరుకు ఆజ్యం పోసి గతంలో మాదిరిగా అటు కాంగ్రెస్‌కు దక్కకుండా మిత్రపక్షమైనా టిడిపికి కేటాయిస్తే బొక్కబోర్లపడి కాంగ్రెస్ లేకుండా చేస్తారా ఆలోచించుకోవాలని సీనియర్లు సైతం ఆవేదన్యవక్తం చేస్తున్నారు. లేనిచో గతం మాదిరిగా కాకుండా కాంగ్రెస్‌లో ఐఖ్యత రాగం వినిపించి సీటు కోసం కుస్తీపడి ఆ అదృష్టవంతులెవరో తేల్చుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News