Home ఎడిటోరియల్ కరోనా ఎక్స్‌గ్రేషియా!

కరోనా ఎక్స్‌గ్రేషియా!

50000 ex-gratia to kin of those who died due to covidకరోనా మృతుల కుటుంబాలకు రూ. 50,000 చెల్లించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయమూర్తులు ఎంఆర్ షా, ఎఎస్ బోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మెచ్చుకున్నట్టే దేశ ప్రజలందరూ దానిని ప్రశంసించక తప్పదు. ఎందుకంటే వీరికి సహాయం చెల్లించాలన్న ప్రతిపాదననే కేంద్రం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. అందుచేత వారికి ఎంతో కొంత ఆర్థిక తోడ్పాటు లభిస్తున్నందుకు సంతోషించాలి. కరోనా పాజిటివ్ బయటపడిన నెల రోజుల్లో ఆత్మహత్య సహా ఏ కారణం వల్ల, ఎటువంటి ఇతరేతర వ్యాధుల వల్ల ఆ రోగి మరణించినా ఈ పరిహార విత్తానికి ఆ కుటుంబం అర్హమవుతుందని కేంద్రం సుప్రీంకోర్టులో చేసిన ఔదార్యపూర్వకమైన ప్రకటన కూడా హర్షించదగినది. అయితే కొవిడ్ 19 (కరోనా) రెండు వేవ్‌లలో దేశంలో చనిపోయిన వారి సంఖ్య విషయంలోనే ఏకాభిప్రాయం కుదరలేదు. రెండవ వేవ్ సృష్టించిన బీభత్సం, అపార ప్రాణ నష్టం గమనించిన వారికి మొత్తం కరోనా మృతుల సంఖ్య విశేషంగా ఉండవచ్చునని అనిపించడం సహజం. అందులో అవాస్తవానికి గాని, అతిశయోక్తి గాని తావు లేదు. కాని అధికారిక లెక్కల ప్రకారం కరోనా మృతుల సంఖ్య ఇప్పటి వరకు నాలుగున్నర లక్షలే.

అనధికార గణాంకాల ప్రకారం ఎంత తక్కువగా అనుకున్నా వీరి సంఖ్య 10 లక్షల వరకు ఉండవచ్చునని అనధికార అంచనాలు తెలియజేస్తున్నాయి. మృతుల్లో కుటుంబ పోషకులెందరు అనేది కీలకమైన అంశం. ఆ వ్యక్తి మృతి వల్ల పూర్తి నిస్సహాయ స్థితిలోకి, ఇక ఎంత మాత్రం గౌరవప్రదంగా బతకలేని పరిస్థితిలోకి జారిపోయిన కుటుంబాలెన్ని అనేది ముఖ్యం. ఇంత లోతుల్లోకి వెళ్లి పరిశీలించే విశాలమైన దృష్టిని మన ప్రభుత్వాల నుంచి ఆశించలేము. న్యాయవాదులు గౌరవ కుమార్ బన్సాల్, రీపక్ కన్సల్ వేసిన ప్రజా ప్రయోజక వ్యాజ్యాలను (పిల్) పురస్కరించుకొని కరోనా మృతుల వారసులకు ప్రభుత్వం నుంచి వీలైనంత ఎక్కువ పరిహార సాయం ఇప్పించడానికి ప్రయత్నించి చివరికి రూ. 50,000 కైనా ఒప్పించినందుకు సుప్రీంకోర్టును అభినందించాలి. ఎందుకంటే దేశ జనాభాలో అత్యధికులు నిరుపేద, పేద, మధ్య తరగతి వారే అయిన భారత దేశంలో కరోనాను నయం చేయించడానికి విపరీతమైన ఖర్చు భరించి కూడా ఆత్మీయులను కోల్పోయిన మెజారిటీ కుటుంబాలు ఆ వర్గాలకు చెందినవే అయి ఉంటాయి. కరోనాను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం 2005 కింద గుర్తించింది.

ఆ మేరకు 2020 మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసింది. అలా గుర్తించిన వైపరీత్యాల వల్ల మరణించిన వారి వారసులకు లేదా కుటుంబాలకు రూ. 4 లక్షలు చెల్లించాలని 2015 ఏప్రిల్ 8న జారీ చేసిన ఉత్తర్వులో నిర్ణయించింది. అందుచేత కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు చెల్లించాలన్న సహేతుక డిమాండ్ పిటిషనర్ల నుంచి దూసుకొచ్చింది. కేంద్రం దానిని తిరస్కరించింది. నెలలు, సంవత్సరాల తరబడి కొనసాగే విపత్తు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడం తగదని వాదించింది. కరోనా చికిత్స సదుపాయాల కింద విశేషంగా ఖర్చు పెట్టవలసి వస్తున్నందున మృతుల కుటుంబాలకు నగదు సహాయం అందించలేమని కూడా వాదించింది. కరోనా కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుతాల ఆదాయాలు దారుణంగా పడిపోయాయని, అదే సమయంలో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పింది. ఇటువంటి పరిస్థితిలో అసలు ఎక్స్‌గ్రేషియా చెల్లింపే సాధ్యం కాదని మొండికేసింది. ఇప్పటికే తరిగిపోయిన ఆ కాస్త నిధులను ఎక్స్‌గ్రేషియా కింద ఇచ్చేస్తే ఆరోగ్య రంగానికి ఖర్చు పెట్టడానికి ఏమీ లేకుండాపోతుందని కూడా అన్నది. ఇంతా చేసి చివరికి కేంద్రం ఇవ్వజూపిన రూ. 50,000 పరిహార సహాయ మొత్తాన్ని రాష్ట్రాలే తమ విపత్తు సహాయ నిధి నుంచి ఇవ్వాలని బాధ్యతను వాటి మీదికి తోసేసింది.

ఈశాన్యేతర రాష్ట్రాల విపత్తు నిర్వహణ నిధుల్లో 75 శాతం కేంద్రమే సమకూరుస్తున్నది. అలాగే ఈశాన్య రాష్ట్రాల నిధుల్లో 90 శాతం కేంద్రం నుంచే వెళుతున్నది. అయినప్పటికీ ఆ మిగిలిన నిధులు కూడా భారమయ్యే అధ్వాన్న స్థితిలోని రాష్ట్రాలూ ఉన్నాయి. వాటి నిధులను తోడివేసే కంటే కేంద్రమే జాతీయ విపత్తు నిర్వహణ నిధి నుంచి ఈ విత్తాన్ని భరించవచ్చు. దానిని అటుంచితే ‘పిఎం కేర్స్’ కింద వస్తున్న అపారమైన ధన రాశి నుంచి ఇటువంటి సందర్భంలో బాధిత కుటుంబాలకు ఉదారంగా సాయం చేయవచ్చు. అదేమీ లేకుండా మాటిమాటికీ తన మీద ఆర్థిక భారం పడకుండా జాగ్రత్త పడే వైఖరినే కేంద్ర ప్రభుత్వం ప్రదరిస్తూ ఉండడం బాధాకరం. టీకాల కొనుగోలు విషయంలోనూ సుప్రీంకోర్టు గట్టిగా మందలిస్తే గాని భారాన్ని స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించని సంగతి తెలిసిందే. అలవికానంత ఖర్చును నెత్తిన మోపే అసాధారణ విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోడానికి వెనుకాడడం జనహిత ప్రభుత్వాల లక్షణం ఎంత మాత్రం కాదు.

50000 ex-gratia to kin of those who died due to covid