Friday, April 26, 2024

512 కిలోల ఉల్లి.. రైతుకు దక్కింది రూ.2

- Advertisement -
- Advertisement -

షోలాపూర్ : మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలోని బార్షి గ్రామానికి చెందిన రాజేంద్ర తుకారాం చవాన్ అనే రైతు 40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉల్లిపాయలను పండించాడు. ఆరుగాలం కష్టపడి పండించిన ఆ పంటను తీసుకొని ఫిబ్రవరి 17న 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న షోలాపూర్ మార్కెట్ కు తీసుకెళ్ళాడు. పది బస్తాల్లో తీసుకెళ్ళిన ఆ ఉల్లి పాయలను తూకం వేస్తే 512 కిలోలు వచ్చింది. ఆయన తీసుకెళ్ళిన రోజు ఉల్లిపాయల రేటు కిలోకి 1 రూపాయిగా నిర్ణయించారు. దాంతో చవాన్ ఉల్లిపాయలకు మార్కెట్ యార్డ్‌లోని సూర్య ట్రేడర్స్ షాపు వ్యాపారి 512 రూపాయలుగా నిర్ణయించాడు. అందులో రవాణా, తూకం, కూలీల చార్జీల కింద 509.51 రూపాయలు పోగా రైతు చవాన్ కు 2 రూపాయల 49 పైసలు మిగిలింది.

దాన్ని రౌండ్ ఫిగర్ చేసి 2 రూపాయలకు ఆ రైతుకు చెక్ ఇచ్చారు. అది కూడా మార్చి 8, 2023న డ్రా చేసుకునేట్టు పోస్ట్ డేటెడ్ చెక్ అందజేశారు. చవాన్‌కు ఇచ్చిన రసీదు, చెక్కు ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది రైతు పట్ల జాలి చూపించారు. వ్యాపారులపై అసహ్యం వ్యక్తం చేశారు. స్వాభిమాని రైతు సంఘం నాయకుడు, మాజీ ఎంపీ రాజు శెట్టి కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మధ్యవర్తులు, వ్యాపారుల దయతో బతకాల్సి వస్తున్న భారతదేశంలోని రైతుల పరిస్థితిని ఈ సంఘటన మరోసారి ఎత్తిచూపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News