Home ఆఫ్ బీట్ నాలుగేళ్లలో 5178 కి.మీల… జాతీయ రహదారులు

నాలుగేళ్లలో 5178 కి.మీల… జాతీయ రహదారులు

తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం 2,527 కి.మీ నిడివి గల 15 జాతీయ రహదారులు ఉంటే రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సిఎం చొరవతో రూ.7631 కోట్లతో అదనంగా దాదాపు 5,178 కి.మీ మేర సాధించుకున్నామని, ప్రజల మౌలిక అవసరాలు, ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ దిశగా కృషి చేసినట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటికే 3,029 కి.మీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలింది నిర్మాణంలో ఉందని వివరించారు. సమైక్య రాష్ట్రంలో నిధుల్లో సింహభాగం ఆంధ్ర ప్రాంతంలోని రహదారులకే  వ్యయం చేయడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని, దాన్ని భర్తీ చేయడానికే గడచిన నాలుగేళ్లలో అనేక చర్యలు తీసుకున్నామని ‘మన తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో ఆయన తెలిపారు. 

Tummala-Nageswara-Rao

తెలంగాణ ఏర్పడిన తర్వాత రహదారుల నిర్మాణంలో మార్పేమైనా ఉందా?

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 24,950 కి.మీ మేర రాష్ట్ర రహదారుల్లో 16,864 కి.మీ మేర (70 శాతం) కేవలం సింగిల్ లైన్ రహదారులే. 143 మండలాలకు సింగిల్ లైన్ రోడ్లు కూడా సరిగ్గా లేవు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేకంగా రోడ్లు , మౌలిక వసతుల కల్పనపై ఎక్కువ ప్రాధాన్యత చూపారు. గతంలో పల్లెలకు కనీసం బస్సులను నడిపించలేని దుస్థితిలో రహదారులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. రూ. 2,518 కోట్లతో 1875 కి.మీ రోడ్లను డబుల్ లైన్లుగా మార్చాలని లక్షంగా నిర్ణయించుకోగా ఇప్పటివరకు రూ. 1057 కోట్ల నిధులు ఖర్చు చేసి 1007 కి.మీ రోడ్లను డబుల్ లైన్లుగా అప్‌గ్రేడ్ చేశాం.

కొత్తగా రీజినల్ రింగురోడ్డు ప్రతిపాదన ఎంతవరకు వచ్చింది?

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుండి మెదక్ వరకు 62 కి.మీ రహదారిని రూ. 426 కోట్ల అంచనా వ్యయంతో రెండు వరుసల రహదారిగా అభివృద్ధి చేయనున్నాం. రాయలసీమ జిల్లాల నుండి తెలంగాణకు రాకపోకల రద్దీ పెరిగిన నేపథ్యంలో శంషాబాద్ ఆరంగర్ చౌరస్తా రహదారిని 6 వరుసల రహదారిగా అభివృద్ధి చేయనున్నాం. ఇందుకు రూ.283 కోట్ల కావచ్చని అంచనా. అంబర్‌పేట కూడలి నుండి రామంతపూర్ వరకు 186.71 కోట్లతో నాల్గు వరుసల ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నాం. ఉప్పల్ రింగ్ రోడ్డు నుండి యాదగిరిగిట్ట రహదారిపై 6.25 కి.మీ రహదారిని ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నాం. ఇందుకు రూ. 626 కోట్ల ఖర్చు కానుంది. హైదరాబాద్ నగరానికి మణిహారంగా భవిష్యత్తులోనూ ఆర్థిక, రవాణా, లాజిస్టిక్స్ అవసరాలను తీర్చేలా సంగారెడ్డి-నర్సాపూర్-తూఫ్రాన్-గజ్వేల్-జగదేవ్‌పూర్-భువనగిరి-చౌటుప్పల్-ఇబ్రహీంపల్నం-చేవెళ్ల-శంకర్)ìల్లి-కంది వరకు 338 కి.మీ రహదారిని రూ. 5500 కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డుగా అభివృద్ధి చేస్తాం. సెంట్రల్ రోడ్ ఫండ్ పద్దు కింద రూ.1000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరానికి మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరగా 750 కోట్లు ఇవ్వడానికి హామీ ఇచ్చారు. ఈ నిధులు వస్తే మరిన్ని పనులు పూర్తి చేసేందుకువీలు కలుగుతుంది.

వ్యూహాత్మకంగా నదులపై వంతెనల నిర్మాణం పెరిగింది కదా!

గోదావరిపై నాలుగు వంతెనలను, మానేరుపై ఐదు వంతెనలను పూర్తి చేశాం. గూడెంవద్ద ప్రాణహిత నదిపై ఒక వంతెన నిర్మాణం కొనసాగుతోంది. నల్గొండ జిల్లా మట్టంపల్లి వద్ద కృష్ణానదిపై వంతెన పనులు జరుగుతున్నాయి. నాగర్‌కర్నూలు జిల్లా సోమశిల వద్ద కృష్ణానదిపై వంతెనకు అంచనాలు వేశాం. మొత్తం 511 బ్రిడ్జీ నిర్మాణాలను రూ.2495 కోట్లతో చేపట్టాం. బ్రిడ్జ్‌ల నిర్మాణంలోనూ చెక్‌డ్యాంలు వచ్చేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే 195 బ్రిడ్జ్‌లు పూర్తయ్యాయి.

కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు, ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయాల నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి. ?

హైదరాబాద్ మినహా 104 నియోజకవర్గాల ఎంఎల్‌ఏలకు నివాస, కార్యాలయ సముదాయ పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో భవనాన్ని రూ.119 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నాం. పరకాల నియోజకవర్గంలో ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయం నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. 26 జిల్లాల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో భవనం రూ. 913 కోట్ల అంచనాతో నిర్మిస్తున్నాం.