Home జాతీయ వార్తలు మొదటివారం రాజ్యసభ సమావేశాల్లో 52 శాతం సమయం వృధా

మొదటివారం రాజ్యసభ సమావేశాల్లో 52 శాతం సమయం వృధా

52% waste of rajya sabha sessions time in 1st week

 

న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటివారంలో 52.30 శాతం సభా సమయాన్ని రాజ్యసభ కోల్పోయింది. అంతరాయాలు, బలవంతపు వాయిదాల కారణంగా గత శుక్రవారంతో ముగిసిన శీతాకాల సమావేశాల మొదటి వారంలో షెడ్యూల్ చేసిన సమావేశ సమయంలో 52.30 శాతం వృధా అయిందని రాజ్యసభ పేర్కొంది. అనేక అంశాలపై విపక్ష ఎంపిలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వాటిలో ముఖ్యంగా గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో మహిళా సెక్యూరిటీ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన 12 మంది సభ్యులను ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేయడం ప్రధాన అంశం అయింది. ఈ నేపథ్యంలో విపక్షపార్టీల సభ్యులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ సస్పెన్షన్ అప్రజాస్వామికం అని విమర్శించారు. సస్పెండ్ అయిన సభ్యులు పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడంతో సస్పెన్షన్ రద్దుకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు.

తాము వెనక్కు తగ్గేది లేదంటూ సస్పెండ్ అయిన ఎంపిలు పార్లమెంట్ ఆవరణ లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అయితే విపక్ష ఎంపిలు క్షమాపణ చెబితే సస్పెన్షన్ ఎత్తివేసే విషయాన్ని ఆలోచించడానికి ప్రభుత్వం సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. గతవారం సమావేశాల షెడ్యూలు సమయంలో పార్లమెంట్ 47.70 శాతం సమయమే పనిచేసిందని గురువారం షెడ్యూలు సమయం కన్నా 33 నిమిషాలు తక్కువగా సభ పనిచేసిందని,పార్లమెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం ప్రైవేట్ మెంబర్ల బిజెనెస్ రెండున్నర గంటల పాటు సాగిందని పేర్కొంది. గతంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా 2020 ఫిబ్రవరి 7 న ఇది జరిగిందని వివరించింది. ఈసారి పార్లమెంట్ మొదటి వారం సమావేశాల్లో వ్యవసాయ చట్టాల రద్దు, ఆనకట్టల భద్రత బిల్లులు రాజ్యసభ ఆమోదించింది.

52% waste of rajya sabha sessions time in 1st week