Home తాజా వార్తలు రాతిచిత్రాలతావు ఒంటిగుండు గుట్ట

రాతిచిత్రాలతావు ఒంటిగుండు గుట్ట

prehistoric rock art

 

భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని జగన్నాథపురం నుంచి నల్లముడిగ్రామం…నల్లముడి గ్రామానికి 4,5 కి.మీ.ల దూరంలో అడవిలో వున్న చిన్న సున్నపురాతిగుట్టలజంటలో ఒకటి ఒంటిగుండు అనే ప్రదేశం. ఆ రెండు గుట్టల పాదాలలో గిరిజనుల(నాయకపోడుల) ఆరాధనాప్రదేశాలున్నాయి. ఒంటిగుండు పడగరాయి కింద ‘పంచపాండవులు’గా నిలుపుకున్న 5రాతికడ్డీలు దేవుళ్ళుగా కొలువైవున్నారు. వాటితో పాటు మీసాలు వున్న తలభాగం మాత్రమే చెక్కిన రాతిగుండు ఒకటి వుంది. ఒంటిగుండు పక్కనున్న చిన్నగుట్ట పై ఎత్తులో పడగరాయికింద 8అడుగుల పొడవైన రాతిస్తంభానికి పైకొసన దేవరతల చెక్కివుంది. మరొకదేవత కూడా అక్కడ పూజింపబడుతున్నది.

ఒంటిగుండుపైన మరొక పడగరాయి వుంది. అంతా 5-3అడుగులు తెరుచుకుని వున్న ఈ పడిగెరాయి కప్పు లోపలిభాగంలో, దక్షిణభాగాన రాతిగోడమీద వేసివున్న ఎరుపురంగు రాతిచిత్రాలు రాతిచిత్రపరిశోధకులకు సవాలు విసురుతున్నాయి. ఇక్కడి రాతిచిత్రాలలో పాము, బల్లి(ఉడుము), ఫ్లవర్ డిజైన్లు, దీర్ఘచతురస్రాకారపు(4,7,9,12) ఘనాలతో బొమ్మలు, సూర్యుడు, మానవాకృతుల(ఆంత్రోమార్ఫిక్)బొమ్మలున్నాయి. కొన్ని రాతిచిత్రాలకు తెలుపురంగు అంచులున్నాయి. కప్పుకున్న అన్ని బొమ్మల మీద తెలుపురంగు పూత తర్వాతికాలంలో పూసినట్టుగా ఒక పొరలాగా ఆవరించివుంది. ఇది పరిశోధనాంశమే.

ఈ రాతిచిత్రాలను ఇప్పటివరకు తెలంగాణాలో లభించిన రాతిచిత్రాలతావులతో పోల్చి చూసినపుడు, వస్తువిషయికంగా ఈ రాతిచిత్రాలు అంతిమపాతరాతియుగం నుంచి మధ్యరాతియుగం కాలాలకు చెందినవిగా చెప్పవచ్చు. ఇక్కడి ఆవాసాన్ని, పరిసరాలను అన్వేషించినపుడు రాతిచిత్రాలు ఒక అంతస్తంత ఎత్తులో (భూమికి 40అడుగులు) వుండడం, పెచ్చురాతిపనిముట్లలోని బ్లేడ్స్, సూక్ష్మరాతిపనిముట్లలోని సన్నకత్తులు గుట్ట పాదంలో దొరకడం నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక్కడ వున్నట్టి చిత్రాలలో కొన్నింటిని పోలినబొమ్మలు ఇంతకుమునుపు చూసిన రాతిచిత్రాలతావులు నీలాద్రి(రామచంద్రాపురం), రాచకొండలలో పోలికలున్నాయి.

రెండ్రోజుల నిపుణుల బృంద పరిశీలన: ఈ చిత్రాలను లోతుగా పరిశీలించడానికి, వ్యాఖ్యానించడానికి, పరిశోధించడానికి ఈ ఒంటిగుట్ట రాతిచిత్రాల తావును తొలుతగుర్తించిన కొండవీటి గోపి, జగన్మోహన్రావు (భద్రాచలం), కట్టా శ్రీనివాస్ (ఖమ్మం)లు… బండి మురళీధర్ రెడ్డి.. (రాతిచిత్రాల నిపుణులు),శ్రీరామోజు హరగోపాల్(తెలంగాణాజాగృతి చరిత్రవిభాగం, హైదరాబాద్),కట్టా జ్ఞానేశ్వర్, రామన్ స్పెక్ట్రాస్పెషలిస్టు,సైంటిస్ట్(హైదరాబాదు), కొండ్రేటి భాస్కర్(కనిగిరి)లను కలుపుకుని బృందపర్యటనకు పూనుకున్నారు. రాక్‌ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (రాశీ)సభ్యుల ఆధ్వర్యంలో ఒంటిగుండు రాతిచిత్రాల పరిశీలన, గణన, వివరాల సేకరణ రెండ్రోజులపాటు సాగింది.

రాతిచిత్రాల రంగుల రహస్యం-ఆధునిక పరికరాలతో శోధన: ఒంటిగుండు రాతిచిత్రాలను కట్టాజ్ఞానేశ్వర్ రామన్ స్పెక్ట్రోమీటరుతో పరిశీలించాడు. రాతిచిత్రాలకు ఇసుమంతైనా నష్టం కలిగించని ఈ పరిశోధనవల్ల పురాతన మానవుడు ఆ రాతిచిత్రాలను వేయడానికి వాడిన పదార్థాలను (ఇంగ్రిడియెంట్స్) గుర్తించవచ్చు. గతంలో ఈ బృందంలోని మిత్రులే రాతిచిత్రాలు వేయడానికి వాడిన ముఖ్యపదార్థాన్ని రామన్ స్పెక్ట్రోగ్రఫీ ద్వారా గుర్తించారు. రాశి సదస్సు పూనాలో జరిగినపుడు పరిశోధనాపత్రాన్ని సమర్పించడం జరిగింది.

ఒంటిగుండుకు అతి సమీపంలో వున్న అక్షరలొద్దిని కూడా పరిశీలించిన బృందం ఒంటిగుండు రాతిచిత్రాల ప్రత్యేకతలను పోల్చి చూసింది. అక్షరలొద్దిలోని రాతిచిత్రాల ప్రత్యేకతలో దానికదేసాటి అయినప్పటికి వస్తు,విషయాలు, చిత్రాల శైలులను పోల్చినపుడు ఒంటిగుండు ఇంకా పురాతనమైనది.

పురాతన వృక్షశిలాజ ఆనవాళ్ళు లభ్యం: రాతిచిత్రాల అన్వేషణలో అక్షరలొద్ది పరిసరాల్లో బృందసభ్యులు పరిశీలిస్తుండగా రాతిచిత్రాల కంటె మరింత పురాతనమైన వృక్షశిలాజాల ఆనవాళ్లు లభించాయి. వృక్షశిలాజం అంటే ఒకప్పటి చెట్లు కాలక్రమంలో రాతిలాగా మారిపోవడం అన్నమాట. పూర్తిగా రాతిలా గట్టిపడిపోయినప్పటికీ చెట్టుకి సంబంధించిన వార్షికవలయాలు, వల్కలము, దారువుకి సంబంధించిన ఆనవాళ్ళు ఈ రూపంలో కనిపిస్తూ వుంటాయి. వీరికి దొరికిన వృక్షశిలాజం పెనిరోగామ్ రకానికి చెందిన ఆంజియో స్పెర్మ్ అయ్యి వుంటుందని భావిస్తున్నారు. ఈ శిలాజాల వల్ల ఈ ప్రాంతంలో కనీసం 6.5 కోట్ల సంవత్సరాల ముందు నుంచే వృక్షజాలం వుందని నిర్ధారింపబడుతోంది. రాతిచిత్రాల పరిశీలనలో అనుకోకుండానే ఒక వృక్షశిలాజం దొరికిందంటే అచ్చంగా శిలాజపరిశీలనకు పూనుకుంటే ఈ ప్రాంత ప్రాచీనతకు ఆనవాళ్ళైన అనేక శిలాజాలు దొరకే అవకాశాలు పుష్కలంగా వున్నాయిని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు ఈ వృక్షశిలాజాలున్నచోట డైనోసార్ల ఆనవాళ్ళు కూడా దొరికే అవకాశం లేకపోలేదు.

అవగాహన లేక చారిత్రక విశేషాలు ధ్వంసం: వాతావరణమార్పుల వల్ల కొంతైతే, మానవసంచారం వల్ల మరింత దెబ్బతింటున్నాయి. గుట్ట గిరిజనుల ఆరాధనా స్థలంగా వుండటం వల్ల రాళ్ళు తరలింప బడకుండా, వెదురు ప్లాంటేషన్ లో దున్నివేయబడకుండా కాపాడబడినప్పటికీ, రాతిచిత్రాల దగ్గర ఈ మధ్య కాలంలో పెద్దగండదీపం పెట్టడంవల్ల ఆ మసి మొత్తం గుహలోని బొమ్మలపై మసిలా పేరుకుపోతోంది. దానిపై గులాం రంగులు చల్లడం, క్రేయాన్లూ, రంగురాళ్ళతో గీరడం వంటి పనులు చేస్తుండటంతో అవి మరింత దెబ్బతింటున్నాయి. మూడు అడుగుల ఎత్తుతో ఇరవై అడుగుల పొడవున్న ఇనుప చువ్వల చట్రం ఏర్పాటు చేయగలిగితే చూసే వారికి ఇబ్బంది లేకుండానే వీటికి చాలా సులభంగా రక్షణ కల్పించ వచ్చు. లేకపోతే చరిత్రపూర్వకాలం నాటి ఈ అపురూప చారిత్రకసంపద కాలగర్భంలో కలిసిపోతుంది.

వాటిని కాపాడుకునే చర్యలు చేపట్టకపోతే ‘ఒంటిగుండు, అక్షరలొద్ది జంట రాతిచిత్రాల తావులు’ మలిగిపోయిన జ్ఞాపకమౌతాయి.ప్రచురణ మరియు ప్రసారార్ధం, మరిన్ని వివరాలకు వీరిని సంప్రదించ వచ్చు. —-శ్రీరామోజు హరగోపాల్ (9949498698) (ఆదిమానవుడి రాతిపనిముట్లు, తెలంగాణాలోని ఇతర ప్రీ హిస్టారిక్ తావుల కంపారిజన్). —-కొండవీటి గోపి (8328626882) (తావు కనుగొన్న విధం). —-కట్టా శ్రీనివాస్ (9885133969) (శిలాజ ఆనవాళ్ళు రాతి చిత్రాలు). —-K జ్ఞానేశ్వర్ (9985223337) (రామన్ స్పెక్ట్రా పరీక్షలు). విషయ రచన: శ్రీరామోజు హరగోపాల్ , కట్టా శ్రీనివాస్

6.5 crore year-old fossils found in Bhadradri Kothagudem